చందమామ లాంటి అందం, అభిమానులను అలరించే నటన కాజల్ అగర్వాల్ సొంతం. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చి మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నది. మదర్స్ డే సందర్భంగా కొడుకు ‘నీల్ కిచ్లు’పై తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టింది కాజల్.
‘నిన్ను మొదటిసారి ఎత్తుకున్నప్పుడు చిన్ని చిన్ని చేతులు, కళ్లను చూశాను. ఎప్పుడైతే నీ వెచ్చని ఊపిరి నాకు తగిలిందో ఆ క్షణమే నీతో ప్రేమలో పడిపోయాను. నువ్వు ఎప్పుడూ నా బంగారానివే. నువ్వు నా మొదటి బిడ్డవు. అంతేకాదు, ఎప్పటికీ మొదటివాడివే. రాబోయే రోజుల్లో నీకు ఎన్నో నేర్పుతాను. కానీ, నువ్వు నాకు ఇప్పటికే చాలా నేర్పించావు. అమ్మతనాన్ని రుచి చూపావు. నిస్వార్థంగా ప్రేమించడం ఎలాగో తెలిసేలా చేశావు. నా హృదయంలో ఒక భాగం నా చేతుల్లో ఒదిగిపోగలదని నిరూపించావు. ఎన్నో అనుభూతులను మొదటిసారి రుచి చూపించినందుకు థ్యాంక్స్.
మంచివాడిగా, ధైర్యశాలిగా, తెలివైన, చురుకైన, ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను. నువ్వే నా సూర్యుడు. నా చందమామ. నా నక్షత్రం.. ఈ మాటలు ఎప్పటికీ మరచిపోవద్దు’ అని రాసుకొచ్చింది కాజల్ అగర్వాల్.