వరుస సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నది శ్రీలీల. ‘పెళ్లిసందD’ సినిమాతో తెలుగు నాట కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారింది. ‘భగవంత్ కేసరి’ తో హిట్ కొట్టిన ఈ అమ్మడు.. ‘గుంటూరు కారం’తో భారీ విజయాన్ని అందుకుంది. ‘మా అమ్మ చాలా స్ట్రిక్ట్’ అని చెప్పే ఈ యంగ్ బ్యూటీ.. మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి ఇంకా ఏం చెప్పిందో చదివేయండి…
డాక్టర్ కావడం వల్ల అనుకుంటాను మా అమ్మకు ఓర్పు చాలా ఎక్కువ. అంతకుమించి నా మీద ప్రేమ కూడా. నేను ఎక్కడ ఉంటే అదే ఆమెకు ఫేవరెట్ ప్లేస్. అయితే, నా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. నాకు ఏ విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలి, ఏ విషయంలో ఇవ్వకూడదు అనే విషయం ఆమెకు బాగా తెలుసు. డ్యాన్స్, స్విమ్మింగ్, స్కూల్ అన్నిటితో రోజంతా బిజీబిజీగా గడిచిపోయేది. నాకు అల్లరి చేయాలని ఉన్నా అమ్మ కళ్లన్నీ నామీదే ఉండేవి.
నా విషయాలను నేను హ్యాండిల్ చేయగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత నాకు స్వేచ్ఛ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటినుంచే మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఇక, ఆమెతో అన్నీ షేర్ చేసుకుంటున్నా. షూటింగ్స్ లేనప్పుడు అమ్మతో ఎక్కువ సమయం గడుపుతుంటా. ఆమెకు కూతురుగా పుట్టడం నా అదృష్టం. చాలామంది పేషెంట్స్ ఆమెతో సన్నిహితంగా ఉంటారు. నేను ఈ రేంజ్లో ఉన్నానంటే దానికి కారణం అమ్మే. ఫెయిల్యూర్స్ వచ్చినా కుంగిపోకుండా ‘వాట్ నెక్స్’ అంటూ ముందుకు సాగాలని ప్రోత్సహిస్తుంటారు. అందుకే అమ్మే నా ఇన్స్పిరేషన్.