గంభీరమైన హిమాలయాల ఒడిలో ఒదిగి ఉండే చోప్టా.. సహజసిద్ధమైన సౌందర్యానికి పెట్టింది పేరు. మరపురాని సాహసక్రీడలకు కేరాఫ్. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ చేసే సాహసీకులకు ఈ ప్రాంతం స్వర్గధామంగా విరాజిల్లుతున్నది. మినీ స్విట్జర్లాండ్‌గా పిలుచుకునే ఈ పల్లె.. వేసవి విడిదికి సిద్ధమైంది. మరి.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చోప్టాను మీరూ చుట్టేయాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మూటాముల్లె సర్దేయండి. సముద్ర మట్టానికి సుమారు 2,680 మీటర్ల ఎత్తులో ఉండే చోప్టా.. పచ్చని పచ్చిక బయళ్లు, దట్టమైన దేవదారు అడవులకు నిలయం.
కాలుష్యానికి, నగరీకరణకు దూరంగా ఉండే ఇక్కడి పల్లె వాతావరణం.. స్విట్జర్లాండ్‌ను తలపిస్తుంది. ఇక్కడి పచ్చని పచ్చిక బయళ్లలో నడవడం, నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద క్యాంపింగ్ చేయడం, పర్వత మార్గాలను అన్వేషించడం.. చోప్టా యాత్రను ఉత్కంఠభరితంగా, ప్రశాంతంగా మారుస్తాయి. నగర జీవితం నుంచి సేదతీరుస్తాయి. అందుకే.. ట్రెక్కింగ్ చేయాలని ఉన్నా, ఆధ్యాత్మికత యాత్రకైనా, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు చూడాలనుకున్నా.. ఇప్పుడు చాలామంది ‘చలో చోప్టా!’ అంటున్నారు.
ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, స్పష్టమైన దృశ్యాలు ట్రెక్కింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటాయి. దాంతో, కొత్తగా ట్రెక్కింగ్ నేర్చుకునేవారంతా వేసవిలో ఇక్కడ వాలిపోతారు. ఇక ఇక్కడి పైన్, దేవదారు, రోడోడెండ్రాన్ అడవులు.. గాలిని స్వచ్ఛంగా, పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చేస్తాయి. ఇక్కడి సూర్యోదయ, సూర్యాస్తమయం.. హిమాలయ శిఖరాలను బంగారు, నారింజ వర్ణాలతో అలంకరిస్తాయి. ఈ దృశ్యం వీక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.
తుంగనాథ్ ఆలయం : ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న శివాలయంగా గుర్తింపు పొందిన తుంగనాథ్.. ఇక్కడే ఉంది. ఇది పంచ కేదారాలలో ఒకటి. చోప్టా నుండి సుమారు 3.5 కిలోమీటర్ల దూరం ట్రెకింగ్ చేస్తే.. ఇక్కడికి చేరుకోవచ్చు. ఆధ్యాత్మికతతోపాటు అద్భుతమైన హిమాలయ దృశ్యాలనూ వీక్షించవచ్చు.
చంద్రశిల శిఖరం : తుంగనాథ్ నుండి మరో 1.5 కిలోమీటర్లు పైకి వెళ్తే.. చంద్రశిల శిఖరం వస్తుంది. ఇక్కడి నుండి 360 డిగ్రీల కోణంలో నందాదేవి, త్రిశూల్, చౌఖంబ వంటి హిమాలయ పర్వత శ్రేణులను వీక్షించడం ఒక అపురూపమైన అనుభూతిని అందిస్తుంది.
డియోరియా తాల్ : అత్యంత స్వచ్ఛమైన ఈ సరస్సులో.. హిమాలయ శిఖరాల ప్రతిబింబాలు అద్భుతంగా కనిపిస్తాయి. క్యాంపింగ్ చేయడానికి, ఫొటోగ్రఫీకీ, ప్రకృతిలో ప్రశాంత క్షణాలు గడపాలని అనుకునేవారికి ఇది మంచి గమ్యస్థానం.
చోప్టాకి సమీప రైల్వే స్టేషన్.. రిషికేష్. ఇక్కడి నుంచి బస్సులు, టాక్సీల్లో చోప్టాకు చేరుకోవచ్చు. రిషికేశ్, డెహ్రాడూన్, హరిద్వార్ నుంచి కూడా జాతీయ రహదారుల ద్వారా వాహనాల్లో రావొచ్చు.