children’s day | నేడు బాలల దినోత్సవం. మీ పిల్లలకు కానుకగా ఏం ఇద్దామని అనుకుంటున్నారు? బిడ్డ చల్లగా ఉండాలని కోరుకొనే తల్లిదండ్రులుగా ఓ హెల్మెట్ కొనిస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే, 2008 నుంచి ఇప్పటివరకూ రోడ్డు ప్రమాదాల్లో నూరేండ్లు నిండిన బాలల సంఖ్య.. 55 వేలు. రహదారి మీద రక్తమోడిన ప్రతి చిన్నారి అర్ధంతర నిష్క్రమణ వెనుకా కన్నవారి నిర్లక్ష్యం ఎంతో కొంత ఉండి తీరుతుంది.
☞ బైక్ మీద వెళ్తున్నప్పుడు పిల్లలకైనా సరే, హెల్మెట్ ఉండాలన్నది నిబంధన. 9 నెలల బిడ్డ నుంచి నాలుగేండ్ల చిన్నారి వరకూ ఐఎస్ఐ ప్రమాణాలున్న పిల్లల హెల్మెట్ వాడాల్సిందే.
☛ పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు బండి స్పీడు 40 కిలోమీటర్లకు మించకూడదు. హఠాత్తుగా బ్రేకులు పడితే, బిడ్డలు బ్యాలెన్స్ తప్పుతారు.
☞ తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే పిల్లల్లో 98 శాతం మందికి హెల్మెట్లు ఉండవు. నిజానికి, చాలాసార్లు తల్లిదండ్రులకే ఉండవు.
☛ కార్లలో పిల్లలు ముందు సీట్లో కూర్చుంటామని మారాం చేస్తుంటారు. అది క్షేమకరం కాదు. ఏదైనా జరిగితే, ఎయిర్ బ్యాగులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఆ ఒత్తిడిని లేత శరీరం అసలు తట్టుకోలేదు.
☞ దాదాపు 76 శాతం తల్లిదండ్రులు పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పరు. ఈ కారణంగా ప్రతిరోజూ 30 మందికి పైగా చిన్నారులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని సేవ్ లైఫ్ ఫౌండేషన్ చెబుతున్నాది.
పసిబిడ్డలేం మూటలు కాదు, కారులోనో బండి మీదో.. ఓ మూలన కుక్కేయడానికి. పసిబిడ్డల ప్రాణాలూ పెద్దల ప్రాణమంత అమూల్యమైనవే. ఇంటిపెద్ద హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన పిల్లలకూ రక్షణ లభించదు. చిన్నచిన్న బొమ్మలు, మంచిమంచి బట్టలు కొన్నట్టే.. వాళ్లకు హెల్మెట్ కూడా కొనండి. వీలైతే ఈ రోజే షాపింగ్ చేయండి. కొన్ని బహుమతులు అమూల్యమైనవి. ఆ కానుకకు ‘హ్యాపీ చిల్డ్రన్స్ డే’ అన్న శుభాకాంక్షలు జోడిస్తే మరింత విలువ. మన పిల్లలనే కాదు, ప్రతి
బిడ్డనూ జాగ్రత్తగా రహదారి దాటించాల్సిన బాధ్యత మనదే!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సర్వం సిద్ధం.. త్వరలో 5 నుంచి 11 ఏండ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్
Children Health | చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం ఇవ్వాలి..?
chicken blood parenting | చైనాలో మొదలైన నయా ట్రెండ్ .. ఇది మంచికా? చెడుకా?
ఆన్లైన్ క్లాసులు పక్కనబెట్టి.. సోషల్ మీడియాలో మునిగితేలుతున్న చిన్నారులు