ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలో కారంపై మమకారం ఎక్కువే! కూర వండితే.. ఓ చెంచా ఎక్కువ పడాల్సిందే! అందులోనూ మాంసాహారమైతే.. మసాలాలు దట్టించి వండాల్సిందే! ఘుమఘుమలాడే ఘాటైన వంటకాలు అంతే ఘనంగా లాగించేస్తారు మనవాళ్లు. ఆ తర్వాత నోటితోపాటు కడుపు మంటతోనూ అల్లాడిపోతుంటారు. ఆ మంటను తగ్గించుకోవడానికి నీళ్లను ఆశ్రయిస్తారు. అయితే, నీళ్లు తాగితే కడుపు మంట నుంచి ఎలాంటి ఉపశమనం దొరకదు. అంతేకాదు.. మంట మరింత పెరుగుతుంది కూడా. ఆ స్పైసీ బర్న్‌ను సంపూర్ణంగా తగ్గించి, కడుపును కూల్చేసే అద్భుతమైన పానీయం.. మజ్జిగ మాత్రమే. ఈ మ్యాజిక్ డ్రింక్‌తో కడుపుమంట పూర్తిగా తగ్గిపోతుందని పెద్దలతోపాటు ఆహార నిపుణులూ సెలవిస్తున్నారు.
నిజానికి కడుపు మంటకు కారణమయ్యేది.. కారంలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయన పదార్థం. ఇది కడుపులోకి వెళ్లినప్పుడు జీర్ణవ్యవస్థలోని శ్లేష్మ పొరను చికాకు పెడుతుంది. దీనివల్ల కడుపులో మంట పుడుతుంది. ఈ ఆయిల్ లాంటి పదార్థం నీటిలో కరగదు కూడా! దాంతో, కడుపు మంటగా అనిపించినప్పుడు నీళ్లు తాగినా.. పెద్దగా ప్రయోజనం కలగదు. పైగా నీటితో కలిసి.. మరింతగా వ్యాపించి, మంటను పెంచుతుంది కూడా. అదే సమయంలో పాల ఉత్పత్తులలో కొవ్వుతోపాటు కేసిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఈ కేసిన్ ప్రొటీన్.. ‘డిటర్జెంట్’ లాగా పనిచేసి, క్యాప్సైసిన్ అణువులను సమర్థంగా కరిగించేస్తుంది. కడుపు మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, మజ్జిగతో మంచి ఫలితం కనిపిస్తుంది. అందుకే, కారం ఎక్కువైనప్పుడు చల్లని నీరు, శీతల పానీయాలను తాగడం పక్కన పెట్టేయాలి. బదులుగా మజ్జిగ తాగడం, పాలు, పెరుగు, లస్సీ వంటివి తీసుకోవడం మంచిది. ఇవి మంటను త్వరగా అణచివేసి, కడుపులో చల్లదనాన్ని ఇస్తాయి.