ఫ్రిదా పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఐస్‌క్రీమ్ పిల్లల్నే కాదు పెద్దల్నీ ఫిదా చేస్తున్నది! తల్లిపాల వారోత్సవాల సందర్భంలో న్యూయార్క్ నగరంలో తయారైన ఈ ఐస్‌క్రీమ్ పిల్లల్నే కాదు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటున్నది. ఆడ్ఫెలోస్ కంపెనీ ఈ హిమక్రీమ్ని తయారు చేసింది. దీన్ని టేస్ట్ చేస్తే.. ముర్రుపాలున్నట్టు ఉప్పగా, తేనెలా తియ్యగా ఉందట. తల్లిపాలతో తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ని తిని.. ఫిదా అవ్వండని ఆ కంపెనీ ప్రకటించింది.
ఈ నెల 10న మార్కెట్లోకి వచ్చిన ఈ ఐస్‌క్రీమ్‌ని న్యూయార్క్‌వాసులు ఎగబడి తింటుంటే.. మిగతా ప్రపంచం దీని గురించి తెగ చర్చించుకుంటున్నది. ఒక ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ గురించి సోషల్ మీడియాలో ఇంతగా చర్చించడం విడ్డూరమే. ఆడ్ఫెలోస్ కంపెనీ చేసిన ఈ ప్రయత్నాన్ని విమర్శించిన వాళ్లూ ఉన్నారు. తల్లిపాలతో ఐస్‌క్రీమ్ తయారీ.. పసిబిడ్డలకు అన్యాయం చేస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
అయితే, ఇది పేరుకు తగ్గట్టుగా తల్లిపాలతోనే తయారు చేసింది కాదట. ఇందులో ఆవుపాల మోతాదే అధికమని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తేనే, ఫ్రూట్‌జ్యూస్, క్రీమ్ కలిపి దీనిని తయారు చేశారట. కేవలం తల్లిపాల రుచిని అందించి అందరినీ ఆకట్టుకోవాలనే మార్కెటింగ్ టెక్నిక్ కాదని, ఈ ఐస్‌క్రీమ్ ద్వారా తల్లిపాల ప్రాధాన్యానికి, పోషకాల అవసరానికి ప్రచారం కల్పించడం మా ఉద్దేశమని కంపెనీ అంటున్నది.