లైంగిక వేధింపులు- వివక్ష- గృహహింస.. ఇవన్నీ కనిపించే శత్రువులు. ఇలాంటి వాటి విషయాల్లో ఆమె అప్రమత్తంగా ఉండగలదు. పరిస్థితి అదుపు తప్పితే ఎదిరించి పోరాడనూ గలదు. క్యాన్సర్ అలాకాదే! ఒంట్లో ఓ మూలన చిన్నగా మొదలవుతుంది. నొప్పి తెలియకుండా విస్తరిస్తుంది. హఠాత్తుగా నిజరూపాన్ని బయటపెడుతుంది.ఆ సమయానికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయే ఉంటుంది. మగవారితో పోలిస్తే మహిళల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువ, మరణాలూ ఎక్కువే.
నేడు… క్యాన్సర్ డే
నేటికీ పట్టణ మహిళలను రొమ్ము క్యాన్సర్, గ్రామీణులను గర్భాశయ క్యాన్సర్ పట్టి పీడిస్తున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయ మహిళలకు సగటున పదేండ్ల ముందే రొమ్ము క్యాన్సర్ వచ్చే ఆస్కారం అధికం. పరీక్షలు చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ బయటపడుతున్నది. ప్రపంచంలో అత్యధిక గర్భాశయ క్యాన్సర్లు నమోదు అవుతున్నదీ భారతదేశంలోనే. గర్భాశయ క్యాన్సర్ అనే కాదు, ఏ క్యాన్సర్ అయినా సరే.. తొలిదశలోనే గుర్తిస్తే మరణాలను తగ్గించవచ్చు. సామాజిక చైతన్యం వైపుగా వేగంగా అడుగులు వేస్తున్న మహిళ, ఆరోగ్య చైతన్యం విషయంలో మాత్రం ఎందుకో నిర్లిప్తంగా ఉంటున్నది. బాధ్యతల బరువు అందుకో కారణం కావచ్చు.
వ్యసనాలకు దూరంగా..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం తెలంగాణలో 8.7 శాతం మహిళలు, 53.8 శాతం పురుషులు మద్యం తీసుకుంటున్నారు. పొగాకు విషయంలో మహిళల్లో 2.8 శాతంగా, పురుషుల్లో 28.2 శాతంగా నమోదైంది. మహిళ తలుచుకుంటే వ్యసనాన్ని వదిలించుకోవడమే కాదు, పురుషుల చెడు అలవాట్లనూ వదిలించగలరు.
మూడోవంతు మాత్రమే..
కేవలం మూడోవంతు మహిళలే జీవితంలో కనీసం ఒక్కసారైనా గర్భాశయ పరీక్ష చేయించుకుంటున్నారు. రొమ్ము, నోటి పరీక్షల విషయంలో ఇది 10 శాతం వరకూ ఉంటుంది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నివేదిక ప్రకారం.. తెలంగాణలో ఏటా క్యాన్సర్ కేసులలో 12.5 శాతం పెరుగుదల నమోదు అవుతున్నది. ఇదే నివేదికలో.. 2025 నాటికి 74 ఏండ్ల లోపు వారిలో 7 మంది మహిళలలో ఒకరు, 9 మంది పురుషులలో ఒకరు క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందన్న హెచ్చరికా ఉంది. పురుషులలో నోటి క్యాన్సర్ ఎక్కువ, మహిళలలో రొమ్ము క్యాన్సర్ అధికం.రెండూ ప్రాణాంతకమే!
జీవనశైలి ప్రభావం
శారీరక వ్యాయామం లేకపోవడం, కదలకుండా గంటల తరబడి ఒకేచోట కూర్చునే జీవనశైలి, ఆహార విధానం.. ఊబకాయానికి కారణం అవుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో హార్మోన్లలో మార్పులు తలెత్తుతాయి. హానికారక కణాలు పెరిగిపోతాయి. రొమ్ము, గైనిక్ (స్త్రీ సంబంధ) క్యాన్సర్లకు ఊబకాయమే చాలా వరకు కారణం. పొగపెట్టి వండిన మాంసాహారం (స్మోక్డ్ మీట్) పెద్దపేగు క్యాన్సర్‌కు దారితీస్తుంది. అలానే రేడియో ధార్మికత, ఇతర ప్రమాదకర రసాయనాల ప్రభావానికి గురికావడం వల్ల కూడా కొన్ని రకాలైన క్యాన్సర్లు వస్తాయి. తాజా పండ్లు, కూరగాయలతో సమృద్ధమైన ఆహారం క్యాన్సర్‌ను కొంతమేర నియంత్రిస్తుంది. మంచి జీవనశైలి వల్ల క్యాన్సర్ ఒక్కటే కాదు గుండె, మెదడు, మూత్రపిండాల వైఫల్యం లాంటి ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడు కోవచ్చు.
జన్యువుల పాత్ర
క్యాన్సర్ జన్యుపరంగా సంక్రమిస్తుందా, లేదా? అన్నదానిపై చాలా చర్చే జరిగింది. జన్యుపరమైన లోపాలను మనం పూర్తిగా సరిదిద్దలేం. కాకపోతే ముందస్తు నిర్ధారణతో తీవ్రతను తగ్గించవచ్చు. రొమ్ము, అండాశయ, పెద్దపేగు క్యాన్సర్ల లాంటివి జన్యుపరంగా వచ్చే ఆస్కారం ఎక్కువ. అదీ చిన్న వయసులోనే తలెత్తుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ జన్యు లోపాల తీవ్రత పెరుగుతుంది. అవి క్యాన్సర్లకు కారణమవుతాయి. కాబట్టి, నడి వయసు తర్వాత మరింత తరచుగా పరీక్షలు చేయించుకోవాలి.
తొలిదశలోనే గుర్తిస్తే..
క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే వ్యాధి తీవ్రతను, మరణాలను తగ్గించవచ్చు. అంటే, శరీరంలో కనిపించే చిన్నచిన్న మార్పుల గురించి సైతం మనకు అవగాహన ఉండాలి. రొమ్ములు, మెడ, ఇతర భాగాల్లో వచ్చే గడ్డలనూ విస్మరించలేం. మానిపోని అల్సర్లు, గాయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మల విసర్జనలో, వాంతుల్లో, దగ్గులో రక్తం పడుతున్నా అనుమానించాల్సిందే. అకారణంగా బరువు తగ్గడం, తొందరగా కడుపు నిండినట్లు అనిపించడం, పొత్తికడుపు అసాధారణంగా ఉబ్బడం.. తదితర లక్షణాలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతుంటే అనుమానించాల్సిందే. చర్మం రంగు మారిపోవడమూ ఓ హెచ్చరికే.
రోగ నిర్ధారణ
అల్ట్రాసొనోగ్రఫీ, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ, పీఈటీ స్కానింగ్, ఎండోస్కోపీ, బయాప్సీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ మొదలైన పరీక్షలు క్యాన్సర్ నిర్ధారణకు ఉపకరిస్తాయి. వ్యాధిని కచ్చితంగా కనిపెట్టగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే. సాంకేతికమైన అభివృద్ధి కారణంగా పెద్దగా నొప్పి లేకుండానే, అవయవాలు తొలగించాల్సిన అవసరం లేకుండానే చికిత్స సాధ్యమవుతున్నది. ట్యూమర్లను పూర్తిగా తీసేస్తున్నారు. సమర్థమైన కీమో థెరపీ ఇప్పుడు అందుబాటులో ఉంది. తక్కువ దుష్ప్రభావాలతో గరిష్ఠ ప్రయోజనం కలిగించే మందులు కూడా ఉన్నాయి. వీటన్నిటికితోడు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన వైద్యశాలలు మనకున్నాయి.
ఆహారం
తాజా పండ్లు, కూరగాయలు, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, మొలకెత్తిన గింజలు, చిరుధాన్యాలు, గ్రీన్ టీ, డ్రైఫ్రూట్స్, అల్లం, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, ఫ్యాటీ ఫిష్.. భోజనంలో భాగం చేసుకోండి. వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగండి. నిల్వ ఆహారం, సగం వండిన పదార్థాలు మంచిది కాదు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి.
వ్యాయామం
రోజుకు ఓ గంట వ్యాయామానికి కేటాయించండి. అందులో ఇరవై నిమిషాలు ట్రెడ్మిల్, ఈత లాంటివి ఉత్తమం. మరో ఇరవై నిమిషాలు యోగా. మిగతా ఇరవై నిమిషాలు ధ్యానం చేసుకోండి. ధ్యానానికి ఆలోచనలను వడపోసే శక్తి ఉంది. నెగెటివ్ ధోరణిని దూరం చేస్తుంది. ఆశావాదాన్ని దగ్గర చేస్తుంది.
ఉల్లాసం
సంగీతానికి సాంత్వననిచ్చే గుణం ఉంది. ఒత్తిడిని వదిలిస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతాన్ని ఆస్వాదించండి. పుస్తక పఠనం, చిత్రలేఖనం, రచనా వ్యాసంగం.. మీదైన అభిరుచిని నిర్లక్ష్యం చేయకండి. సామాజిక జీవితానికి చోటు ఇవ్వండి. కుటుంబంతో, స్నేహితులతో ఉల్లాసంగా గడపండి. మనసారా నవ్వండి. నలుగురినీ నవ్వించండి.
ఆశావాదం
క్యాన్సర్ అని తెలియగానే చాలామంది షాక్‌కు గురవుతారు. డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. బతకాలన్న కోరికను చంపేసుకుంటారు. ఇది కాదు స్పందించాల్సిన పద్ధతి. అన్నిటికంటే ముందు వాస్తవాన్ని ఆమోదించాలి. అయినవారికి మనమే ధైర్యం చెప్పాలి. చికిత్సకు సహకరించాలి. ఒకే రకమైన వైద్యం అందించినా.. నెగెటివ్ దృక్పథం ఉన్నవారితో పోలిస్తే.. ఆశావాదులే త్వరగా కోలుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
– డాక్టర్ గీతా నాగశ్రీ ఎన్, అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, కేర్ క్యాన్సర్ సెంటర్