బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకొస్తుంది?.. నివారణ పరీక్షలు.. చికిత్స
హార్ట్ ఎటాక్ అంత ప్రమాదకరం కాకపోయినా బ్రెయిన్ స్ట్రోక్‌తో మనిషి జీవితం ఒక్కసారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ పదం తరచూ వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు దీని బారినపడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎక్కువ మంది పక్షవాతానికి గురవుతూ ఉంటారు.
పక్షవాతాన్ని ముందే పసిగడదాం
తక్షణ వైద్యంతో బ్రెయిన్ సేఫ్
హార్ట్ ఎటాక్ అంత ప్రమాదకరం కాకపోయినా బ్రెయిన్ స్ట్రోక్‌తో మనిషి జీవితం ఒక్కసారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ పదం తరచూ వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు దీని బారినపడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎక్కువ మంది పక్షవాతానికి గురవుతూ ఉంటారు. దీనిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందించకపోతే.. మనిషి కోమాలోకి వెళ్లి, మృత్యువాతపడే ప్రమాదం ఉంది. మరికొన్ని సందర్భాల్లో రోగులు కనీసం కాళ్లు, చేతులు కదపలేక మంచానికే పరిమితమై తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలేంటి? వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, అందుబాటులో ఉన్న చికిత్స తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
మెదడులో రక్త సరఫరా నిలిచిపోవడాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అంటే గుండె నుంచి మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులలో లేదా మెదడు నుంచి గుండెకు రక్తం సరఫరా చేసే సిరలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మెదడులో రక్తసరఫరా నిలిచిపోతుంది. దీంతో బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీనినే ‘కావెర్నస్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్’ అంటారు. ప్రధానంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలు. అందులో 1. ఇస్కిమిక్స్ స్ట్రోక్, 2.హెమరేజిక్ స్ట్రోక్.
1.ఇస్కిమిక్స్ స్ట్రోక్
గుండె నుంచి మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులలో రక్తం గడ్డకడుతుంది. దీంతో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి, ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఈ విధంగా రక్తం గడ్డగట్టి, రక్త సరఫరా ఆగిపోవడాన్ని వైద్య పరిభాషలో ఇస్కిమిక్స్ స్ట్రోక్ అంటారు.
కారణాలు
- నియంత్రణ లేని అధిక రక్తపోటు
- నియంత్రణ లేని షుగర్ స్థాయులు
- మితిమీరిన కొలెస్ట్రాల్
రక్తం చిక్కబడటం వల్ల
సాధారణంగా అధిక రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్‌లు నియంత్రణలో లేకపోవడంతో రక్తం చిక్కబడుతుంది. ఈ విధంగా మెదడులోని ధమనులలో చిక్కబడిన రక్తం గడ్డకట్టి, మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది.

లక్షణాలు
- కాళ్లు, చేతులు పనిచేయకపోవడం
- అకస్మాత్తుగా కంటి చూపు తగ్గిపోవడం
- నోరు వంకర పోవడం
- నోటి మాట పడిపోవడం
- పక్షవాతం రావడం
నిర్ధారణ పరీక్షలు
- సీటీ స్కాన్
- ఎంఆర్ఐ స్కాన్
చికిత్సా విధానాలు
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన రోగులకు రెండు రకాల చికిత్స అందుబాటులో ఉంది. అందులో 1.ఇంజెక్షన్లతో చికిత్స చేసే పద్ధతి 2. ఇంటర్వెన్షన్ చికిత్సా పద్ధతి. చిన్న చిన్న బ్లడ్క్లాట్లు ఏర్పడినప్పుడు మొదటి పద్ధతిలో చికిత్స అందిస్తారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన రోగికి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ‘థ్రాంబోలైసిస్’ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రోగి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన నాలుగున్నర గంటల్లోపు ఇస్తేనే ఫలితం ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మెదడులో గడ్డ కట్టిన రక్తం కరిగిపోయి, రక్త ప్రసరణ మళ్లీ కొనసాగుతుంది. దీంతో రోగి క్రమంగా కోలుకుంటాడు.
ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్
ఈ చికిత్సను రోగి స్ట్రోక్‌కు గురైన 24 గంటల్లోపు చేయాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద క్లాట్స్ అంటే మెదడులో ఎక్కువ మోతాదులో రక్తం గడ్డ కట్టినప్పుడు థ్రాంబోలైసిన్ ఇంజెక్షన్ వల్ల ఫలితం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు రోగులకు ఆంజియోగ్రామ్ చేసినట్లుగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంటర్వెన్షన్ పద్ధతి ద్వారా కాలు లేదా చెయ్యి రక్తనాళాల నుంచి క్యాథటర్ను రక్తం గడ్డకట్టిన ప్రదేశానికి పంపించి గడ్డకట్టిన రక్తాన్ని బయటికి లాగేస్తారు. దీంతో రక్తసరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. ఫలితంగా రోగి కోలుకుంటాడు. అయితే ఇలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది రోగులు సాధారణ చికిత్స చేయించుకోవడం వల్ల పక్షవాతం వచ్చి బెడ్రిడన్కు గురై ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి ఈ చికిత్స గురించి అవగాహన లేకపోవడంతో ఆరోగ్యంతోపాటు ఆర్థికంగానూ నష్టపోతున్నారు.
95 శాతం మంచి ఫలితాలు
ఇంటర్వెన్షన్ చికిత్సతో 95 శాతం మంది రోగులు పూర్తిగా కోలుకుని, దవాఖాన నుంచి నడుచుకుంటూ వెళ్తారు. కోమాలోకి వెళ్లిపోయిన వారికి కూడా ఈ చికిత్స ఇవ్వవచ్చు. కానీ, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన 24 గంటల్లోగా చికిత్స అందిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ (ఏఎస్ఏ) 2026 మార్గదర్శకాల ప్రకారం పెద్ద బ్రెయిన్ క్లాట్ ఉన్నవారికి కచ్చితంగా ఈ చికిత్స అందించాలి. ఆరేండ్లు, అంతకుమించి వయసు ఉన్నవారు బ్రెయిస్ స్ట్రోక్‌కు గురైతే ఇంటర్వెన్షన్ పద్ధతి ద్వారా చికిత్స అందించవచ్చు.

2. హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్
హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి రెండు ప్రధాన కారణాలు. అందులో మొదటి కారణం అధిక రక్తపోటు వల్ల మెదడులో రక్తనాళాలు పగిలిపోయి, రక్తస్రావం కావడం వల్ల హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అంటే హై బీపీ కారణంగా మెదడులోని రక్తనాళాలు చితికిపోయి, మెదడులో రక్తస్రావం ఏర్పడుతుంది. దీని కారణంగా రోగి పక్షవాతానికి గురవుతాడు. ఇది చాలా తక్కువ మందిలో వస్తుంది. దీనికి ప్రత్యేక చికిత్స అనేది లేదు. ఇక రెండో కారణం ఎన్యురిజం. దీనివల్ల కూడా హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మెదడులోని రక్తనాళం ఒకచోట బలహీనపడి, బెలూన్లా ఉబ్బుతుంది. అలా ఉబ్బిన రక్తనాళం పగిలిపోయి రక్తస్రావం ఏర్పడుతుంది. ఈ విధంగా కావడాన్నే వైద్య పరిభాషలో ఎన్యురిజమ్ అంటారు.
లక్షణాలు
- మాట పడిపోవడం
- కాళ్లు, చేతులు పనిచేయకపోవడం
- నోరు వంకర పోవడం
- కంటి చూపు పోవడం
- పక్షవాతం రావడం
నిర్ధారణ పరీక్షలు
- సీటీ స్కాన్
- ఎంఆర్ఐ స్కాన్
ఈ వైద్య పరీక్షల ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ఏ రకమైనదో నిర్ధారించవచ్చు. దాని ఆధారంగా అవసరమైన చికిత్స చేయాల్సి ఉంటుంది.
చికిత్సా విధానాలు
ఈ హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో బీపీని నియంత్రించడం ఒక్కటే మార్గం. సకాలంలో సరైన రీతిలో బీపీని నియంత్రించడంతో చితికిపోయిన రక్తనాళాలు పునరుద్ధరీకరణ జరుగుతాయి. రక్తస్రావం కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఇక ఎన్యురిజమ్ వచ్చిన వారిలో మాత్రం కాయిలింగ్ అనే ప్రొసీజర్ ద్వారా చికిత్స చేస్తారు. కాలు లేదా చెయ్యిలోని రక్త నాళం నుంచి క్యాథటర్ను ఎన్యురిజం జరిగిన ప్రదేశానికి పంపించి, కాయిలింగ్ అనే ప్రొసీజర్ చేస్తారు. అంటే బెలూన్లా ఉబ్బి, పగిలిపోయిన రక్తనాళాన్ని మూసివేస్తారు.
సిరలలో రక్తం గడ్డ కడితే..
మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకువచ్చే వీనస్ వ్యవస్థలో (సిరలలో) కూడా రక్తం గడ్డకడుతుంది. దీనిని ‘కావెర్నస్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్’ అంటారు. ఇది చాలా అరుదుగా వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా పిల్లలు, మహిళల్లో వస్తుంది. ఇది చాలా వరకు మందులతో తగ్గిపోతుంది. అలా తగ్గని వారికి మాత్రం ఇంటర్వెన్షన్ పద్ధతి ద్వారా చికిత్స అందించవచ్చు.
లక్షణాలు
- భరించలేనంత తలనొప్పి
- ఫిట్స్ రావడం
- కోమాలోకి వెళ్లిపోవడం
కారణాలు
పిల్లల్లో హై ఫీవర్ వచ్చినప్పుడు డీహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కబడుతుంది. తద్వారా మెదడులోని సిరలలో రక్తం గడ్డ కడుతుంది. ఇక మహిళల్లో గర్భధారణ సమయంలో రక్తంలోని రసాయనాలు సమతుల్యత కోల్పోయి రక్తం గడ్డ కడుతుంది. అదే విధంగా ప్రసవ సమయంలో కూడా బాలింతల్లో రక్తం చిక్కబడి సిరలలో గడ్డ కడుతుంది. ఇలా సిరలలో రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది.
నిర్ధారణ పరీక్షలు
- సీటీ స్కాన్
- ఎంఆర్ఐ
చికిత్సా విధానాలు
ఈ రోగులకు ‘యాంటి కోవాగ్యులెంట్ ఇంజెక్షన్స్’ లేదా మాత్రలతో చికిత్స అందిస్తారు. ఈ చికిత్సతో తగ్గకపోతే అప్పుడు ఇంటర్వెన్షన్ పద్ధతిన చికిత్స చేస్తారు. కాలు లేదా చేతిలోని సిరల ద్వారా క్యాథటర్ను పంపించి గడ్డకట్టిన రక్తాన్ని తొలగిస్తారు. ఇంటర్వెన్షన్ చికిత్సా పద్ధతికి సుమారు రెండు గంటల సమయం పట్టవచ్చు.
మహేశ్వర్‌రావు బండారి …?
డా.మనోజ్ వాసిరెడ్డి
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలాజిస్ట్ ఎంబీబీఎస్, డీఎన్బీ, డీఎం (స్ట్రోక్ అండ్ న్యూరోఇంటర్వెన్షన్)
శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్, కొండాపూర్
హైదరాబాద్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

