ఆమె పరుగు ముందు పేదరికం ఓడిపోయింది.. మానసిక వైకల్యం తోకముడిచింది.. పల్లె పొలిమేర దాటిన ఆమె పరుగు.. రాష్ట్ర స్థాయిని ఏనాడో దాటింది.. జాతీయ స్థాయిలో పతకాలై వర్షించింది.. పారాలింపిక్స్‌లో దేశ పతాకను ఎగురవేసింది. పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కంచు మోగించిన జీవాంజీ దీప్తిది అందరి లాంటి పరుగు కాదు. పతనం నుంచి పతాకస్థాయికి చేరుకున్న దీప్తి కథ ఇది..
దీప్తి సొంతూరు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ. అసలు చిరునామా పేదరికం. తండ్రి యాదగిరి లారీ క్లీనర్. తల్లి ధనలక్ష్మి వ్యవసాయ కూలి. ఈ దంపతులకు తొలిచూలులో పుట్టిన ఆడబిడ్డే దీప్తి. కొన్నాళ్లయ్యాక కూతురు బుద్ధి మాంద్యంతో జన్మించిందని తెలిసింది. కుమిలి కుమిలి ఏడ్వడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ తల్లిదండ్రులది. ఆకలిగా ఉన్నా చెప్పలేనంత అమాయకం ఆ చిట్టితల్లిది. అమ్మరాగానే ఎక్కడున్నా.. చిరుతలా పరుగెత్తుకొచ్చేది. ఆ వేగం అనితరం. దాన్ని గుర్తించే సాహసం కూడా చేయలేకపోయారు ఆమె తల్లిదండ్రులు. గ్రామంలోని ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుకు చెందిన ఆర్డీఎఫ్ పాఠశాలలో చదివేది. ఆమె వేగానికి పాఠశాల ప్రాంగణం చిన్నబోయింది. ఇంటినుంచి బడికీ, బడి నుంచి ఇంటికీ ఉడుత పిల్లలా రయ్యిన దూసుకెళ్లేది. ఆమె పరుగులో ఏదో శక్తి ఉందని బడిలో బయటపడింది. రామ్మోహన్రావు సహకారంతో పోటీల్లో పాల్గొంటూ ఉండేది. జిల్లా స్థాయిలో దీప్తి ప్రదర్శన అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ దృష్టిలో పడింది. ఇంకేముంది.. మనోవైకల్యాన్ని జయించే తారకమంత్రం ఆయనే దీప్తికి ఉపదేశించాడు. అదే ‘రన్ దీప్తి రన్..’.
నాణ్యమైన శిక్షణ అందిస్తే దీప్తి పరుగు అనేక మైలురాళ్లు దాటుతుందని రమేశ్ నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వివిధ పోటీల్లో పాల్గొనేలా ఆమెను తీర్చిదిద్దారు. అన్నీ తానై అండగా నిలిచారు. గురువుగా ఆయన ఎంతచేసినా.. కుటుంబ ప్రోత్సాహం లేకపోతే దీప్తి ఊరుబాట పట్టాల్సి వచ్చేది. పరుగులో పతకాలు పండిస్తున్న కూతురు కోసం ఎంతకైనా ధైర్యం చేయాలనుకున్నాడు యాదగిరి. తనకున్న ఎకరం భూమి అమ్మేశాడు. కూతురుకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. మరోవైపు కఠిన శిక్షణలో దీప్తి రాటుదేలింది. ఒళ్లునొప్పులను కూడా గుర్తించలేనంత అమాయకత్వం ఆమెకు వరమే అయింది. శిక్షణ సమయంలో కిందపడ్డా, గాయాలైనా, కాళ్లు పట్టేసినా.. మరుసటి రోజుకు మళ్లీ మైదానంలో పరుగులు తీస్తూ కనిపించేది.
అథ్లెటిక్స్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడంతో 2016లో పాఠశాల స్థాయిలో సాయ్ శిక్షణకు ఎంపికై, అక్కడే చదువుకుంది దీప్తి. అదే ఏడాది కరీంనగర్లో జరిగిన జూనియర్ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది. తొర్రూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతూ పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సాధన చేసింది. 2017లో కేరళలో జరిగిన సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్లలో పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇలా జాతీయ స్థాయిలో పాల్గొన్న ప్రతి ఈవెంట్లో మెడల్ సాధిస్తూ… రోల్ మాడల్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఏషియన్ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం గెలుచుకుంది. మిడ్లే రిలే పోటీల్లో రజతం, మొరాకోలో జరిగిన పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి.. తన పరుగు ఆగేది కాదని చాటిచెప్పింది దీప్తి.
ఇదే జోరులో 2022 సెప్టెంబర్‌లో వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో 400 మీటర్ల పోటీల్లో దీప్తి గోల్డ్ మెడల్ సాధించింది. అదే ఏడాది నవంబర్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో 200, 400 మీటర్లలో బంగారు పతకాలు గెలిచింది. ఇలా అంతర్జాతీయ ఈవెంట్లలోనూ దేదీప్యమానంగా వెలిగిపోయింది దీప్తి. 2024 మేలో జపాన్ వేదికగా జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్లలో బంగారు పతకం సాధించింది. ఈ వేగాన్ని కొనసాగిస్తూ తాజా పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి శభాష్ అనిపించుకుంది. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు రాష్ట్ర ప్రముఖులు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా దీప్తిని అభినందించారు. కటిక పేదరికంలో జన్మించిన దీప్తి పట్టుదలతో సాధన చేసి పతకాన్ని సాధించి దేశానికి పేరు తీసుకురావడం గర్వకారణమని కొనియాడారు. పారిస్ గడ్డపై తెలంగాణ ఉనికిని చాటిన ఈ పరుగుల రాణికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిస్తే.. మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయనడంలో సందేహం లేదు.
– మచ్చ సమ్మయ్య ,
బొమ్మెర రాజ్‌కుమార్