సినీ పరిశ్రమ అంటేనే.. గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందంగా కనిపించేవారికే అవకాశాలు ఎక్కువ. అందుకే.. నిత్య యవ్వనంగా కనిపించడానికి సినీతారలు నానా తంటాలు పడుతుంటారు. కాస్మెటిక్ సర్జరీలు, ఫిల్లర్లు, బోటాక్స్లను ఆశ్రయిస్తారు. కానీ, కొందరు మాత్రం సహజసిద్ధమైన సౌందర్యంతోనే.. అభిమానులను అలరిస్తారు. జుట్టు నెరిసినా, ముఖంపై ముడతలు పడుతున్నా.. అందంగానే కనిపిస్తారు. అలాంటివారిలో ఒకరు.. బాలీవుడ్ సీనియర్ నటి, దర్శకురాలు రత్న పాఠక్. గ్లామర్ పరిశ్రమలో పనిచేస్తూ.. జుట్టుకు రంగు వేయకూడదనీ, తన వయస్సును ఏమాత్రం దాచకూడదని గతంలోనే నిర్ణయించుకున్నది. ఆ నిర్ణయం వెనకగల కారణాన్ని.. తాజాగా మీడియాతో పంచుకున్నది.
తన భర్త, నటుడు నసీరుద్దీన్ షా సలహాతోనే జుట్టుకు రంగు వేయవద్దని నిర్ణయించుకున్నదట రత్న పాఠక్. దాని ఫలితంగా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పటికీ.. జీవితంలో వచ్చే మార్పులను గుర్తించడంలో సహాయపడిందని అంటున్నది. దాదాపు దశాబ్ద కాలంగా గ్రే హెయిర్ (తెల్ల జుట్టు)తోనే కనిపిస్తున్నది రత్న. దాంతో.. ఆమెకు అది ఓ సిగ్నేచర్ హెయిర్ స్టయిల్‌గా మారిపోయింది. “నటీ నటులు తమ వయసును స్వీకరించడం, అంగీకరించడం చాలాకష్టం. కానీ, అవన్నీ మన జీవితంలో తప్పకుండా వచ్చే మార్పులు. వాటినుండి ఎంతకాలమని దూరంగా ఉండగలరు? అంతేకాదు, ఆ మార్పులతో పోరాడటానికి ప్రయత్నిస్తే.. మీరు మూర్ఖులుగా కనిపిస్తారు” అంటూ చెప్పుకొచ్చింది.
అయితే.. జుట్టుకు రంగు వేయడం మానేసినప్పటి నుంచీ తనకు సినిమా అవకాశాలు తగ్గాయనీ, తాను ‘అమ్మమ్మ-నానమ్మ’ల విభాగంలోకి మారిపోయానని అంటున్నది. “టాలెంట్ ఉన్నా.. మంచి పాత్రలు దొరకని పరిశ్రమలో ఉన్నాం. ఇప్పుడు నేను ‘అమ్మమ్మ-నానమ్మ’ల విభాగంలో ఉన్నా. మన సినిమాల్లో ఆ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యం ఉందో అందరికీ తెలిసిందే!” అంటూ వాపోయింది. ఇక రత్న పాఠక్ షా సినిమాల విషయానికి వస్తే.. 1980లలో వచ్చిన టీవీ సీరియల్ ‘ఇదర్ ఉదర్’తో నటనారంగానికి పరిచయమైంది. 1983లో ‘మండి’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విలక్షణ నటుడు నసీరుద్దిన్ షాను ప్రేమ వివాహం చేసుకున్నది. మంచిమంచి పాత్రలు పోషిస్తూ.. తానూ విలక్షణ నటినేనని నిరూపించుకుంది.