Nora Fatehi | సామాన్యులకు రైలు ప్రయాణం సాధారణ విషయమే! సెలెబ్రిటీలు రైళ్లలో వెళ్తే మాత్రం.. అది సెన్సేషనే! తాజాగా, బాలీవుడ్ భామ నోరా ఫతేహి చేసిన రైలు ప్రయాణం.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తన మిత్రుడు, క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు రైల్లో ప్రయాణించింది నోరా. ఇందుకు సంబంధించి ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. రైల్లోనే రత్నగిరికి చేరుకున్న నోరా.. డైరెక్టర్ హల్దీ వేడుకలో పాల్గొన్నది.
ఈ సందర్భంగా ఆమె చేసిన డ్యాన్స్ వీడియో కూడా నెట్టింట చెక్కర్లు కొడుతున్నది. డైరెక్టర్ అనూప్‌తో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉన్నదనీ, 2017 నుంచి తన సినీ ప్రయాణంలో అనూప్ తోడుగా ఉన్నాడనీ రాసుకొచ్చింది. కెనడాలో పుట్టిపెరిగిన నోరా ఫతేహి.. నటనపై ఆసక్తితో భారత్‌కు వచ్చింది. ఎంతో కష్టపడి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నది. బాహుబలిలో ‘మనోహరి’ పాట.. నోరా కెరీర్‌నే మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘సత్యమేవ జయతే’ సినిమాలోని ‘దిల్బర్ దిల్బర్’ రీమిక్స్ పాటతో.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నది. ప్రస్తుతం ధ్రువ సర్దా హీరోగా నటిస్తున్న ‘కేడీ- ద డెవిల్’ చిత్రం ద్వారా కన్నడలో అరంగేట్రం చేస్తున్నది నోరా ఫతేహి.