దేవుడు ఎందులోనూ తాను ప్రత్యక్షంగా పాల్గొనడనేది విదితం. తన కార్యానికి తన భక్తుల్నే ప్రయోగిస్తాడు. అలాగే పాపం పెరిగినప్పుడు దేవుని సూచన జరిగి తీరుతుంది. అది వినక పోతే, గట్టి హెచ్చరిక జారీ అవుతుంది. ఇందుకు బైబిల్లో ఒక పురాతన ఉదంతం ఉదాహరణగా కనిపిస్తుంది. అది ‘నినెవే’ అనే పట్టణం, సకల పాపాలకు విత్తనం. అది బహు విలాసవంతంగా ఉండేది. ఎడతెగని దుర్మార్గాలకు కేంద్రంగా ఉండేది. వినోద భరితం. దానిది విచ్చలవిడి చరితం! అందుకు దేవుడు వారికి ప్రమాద హెచ్చరికలు చేయాలి. ఆ విషయం చెప్పడానికి ప్రభువు, యోనా అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. యోనా ఇలాంటి పనులకు ససేమిరా ఇష్టపడని వ్యక్తి. అందుకే దైవవాక్కును తప్పించుకునే ప్రయత్నంతో పారిపోయి హడావుడిగా ఒక ఓడ ఎక్కేస్తాడు. అది శత్రువుల ఓడ. తెలియక వారి మధ్య చిక్కుకుంటాడు.
వారు అతని ఆచూకీ కనిపెడతారు. కాళ్లూచేతులూ కట్టేసి సముద్రంలో పడేస్తారు. అందరూ ఇక చచ్చాడులే అనుకుంటారు. ఒక పెద్ద చేప వచ్చి యోనాను మింగేస్తుంది. మూడు రోజులపాటు అతను ఆ చేప గర్భంలోనే ఉండిపోతాడు. మూడో రోజు మత్స్యం గర్భంలో నుంచి ఆణిముత్యంలా పైకి వస్తాడు. అయితే దేవుడు చెప్పిన పని చేస్తాడు. ఆ పట్టణవాసులకు జాగ్రత్తలు, హెచ్చరికలు సూచిస్తాడు. దైవ కార్యం నెరవేరుతుంది. అతను అలా సురక్షితుడు కావడానికి దైవ సంకల్పమే కారణమని పెద్దల వివరణ. తన భక్తులను అన్ని విపత్తుల నుంచీ దేవుడు ఎలా రక్షించుకుంటాడో ఈ కథ ద్వారా తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఒక్కోసారి పెద్దల ద్వారా తాను చెప్పదలచింది అందిస్తాడని, దాన్ని మనం వినయంతో వినాలనేది ఇందులోని నీతి….?
-ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024