నేటితరం హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. సినిమాల్లో రాణిస్తున్నప్పుడే.. నచ్చిన వ్యాపారాల్లోకీ దిగేస్తున్నారు. అలా.. వాటర్ బిజినెస్‌లోకి దిగింది బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్. సోదరి సమీక్షా పెడ్నేకర్‌తో కలిసి ‘బ్యాక్బే’ పేరుతో ప్రీమియం బెవరేజ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. అయితే, ఆమె అమ్ముతున్న నీళ్ల ఖరీదు చూసి సామాన్యులు పెదవి విరుస్తున్నారు. అధిక ధరలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో భూమి మాట్లాడుతూ.. అధిక ధరలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
“అవును.. మా నీళ్లు ఖరీదైనవే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, మేము ఉన్నది ‘ప్రీమియం వాటర్’ విభాగంలో. ఇందులోని పాత బ్రాండ్లు, దిగ్గజ సంస్థలు అందిస్తున్న నీళ్లు మరింత ఖరీదైనవి” అంటూ వెల్లడించింది. తన కంపెనీని ప్రారంభించినప్పుడు.. అందరూ వద్దని వారించారట. ‘దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. జాగ్రత్త!’ అని సలహా ఇచ్చారట. కానీ, తాను మాత్రం మంచి ఉత్పత్తిని అమ్ముతున్నాననే నమ్మకంతో పట్టు వదలలేదని చెప్పుకొచ్చింది భూమి. తమ సంస్థను నైతికంగా నడుపుతున్నామనీ, అధిక లాభాలకు ఆశ పడటం లేదనీ వెల్లడించింది. “ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఏ కేటగిరీలో ఉన్నారనే దానిపై మీకు స్పష్టత ఉండాలి. నేను ప్రీమియం కేటగిరీలో ఉన్నాననే స్పష్టత నాకుంది.
నేను మాస్ మార్కెట్లోకి ప్రవేశించాలనుకున్నప్పుడు.. మరో బ్రాండ్‌తో వస్తా!” అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక తమ సంస్థను విస్తరించడం గురించీ ప్రస్తావించింది. ఒక వాటర్ బ్రాండ్‌గా తమ వ్యాపారం మొదలైనప్పటికీ.. ఇప్పుడు పానీయాల బ్రాండ్‌గా విస్తరించామని చెప్పుకొచ్చింది. ముంబైలో పుట్టిపెరిగిన భూమి పెడ్నేకర్.. ఆర్య విద్యా మందిర్ స్కూల్లో చదువుకున్నది. 2015లో వచ్చిన ‘దమ్ లగా కే హైషా’ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే, ఈ చిత్రం కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరిగి.. మధ్యతరగతి గృహిణి పాత్రలో అద్భుతంగా నటించింది. టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్, సాండ్ కీ ఆంఖ్, బాలా, బధాయి దో, భక్షక్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. చివరిసారిగా అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ‘దల్దల్’లో కనిపించింది. ఈ క్రమంలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతోపాటు మరెన్నో పురస్కారాలనూ అందుకున్నది. సామాజిక స్పృహతో పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేస్తున్నది భూమి. తన ‘బ్యాక్బే’ వాటర్ బ్రాండ్ ద్వారా ప్లాస్టిక్ సీసాలకు బదులుగా పర్యావరణహితమైన పేపర్ ప్యాకేజింగ్‌ను ప్రోత్సహిస్తున్నది.