ప్రాణాలకు తెగించిన సైనికుడికి విశ్వాసానికి మారుపేరైన శునకం తోడైతే.. శత్రువుల జాడ
కనిపెట్టడం, వారిని మట్టుపెట్టడం చాలా తేలిక. అందుకే సాయుధ బలగాలు సంక్లిష్టమైన సందర్భాల్లో జాగిలాలను ఆయుధంగా ఎంచుకుంటాయి. అయితే ఈ జాగిలాలతో సమరానికి వెళ్లడం ఆయుధం ప్రయోగించడం కన్నా కష్టం. నేర్పుతోపాటు ఓర్పు కూడా చాలా అవసరం. సాహసం, సహనం ఉన్నవారికే డాగ్ హ్యాండ్లర్ బాధ్యతలు అప్పగిస్తుంది సైన్యం. అలాంటి సాయుధ చర్యల్లో భారత్ తరఫున సత్తా చాటుతున్నది డాగ్ హ్యాండ్లర్ పీవీ శ్రీలక్ష్మీ. కంటిచూపుతో జాగిలాన్ని నియంత్రిస్తూ, ఒంటిచేతితో శత్రువులను మట్టుబెడుతున్నది.
సరిహద్దులో గస్తీ సరిగ్గా లేకపోతే దేశం ఆగమైతుంది. బోర్డర్లో భద్రతతోపాటు చొరబాట్లను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించే సాయుధ బలగం అసోం రైఫిల్స్. సుదీర్ఘమైన సాయుధ దళాల చరిత్రలో ఎన్నో సాహసాలు చేసిన అసోం రైఫిల్స్‌లో సాహసనారి శ్రీలక్ష్మి ప్రత్యేకం. అప్రమత్తత, తెగువ, శత్రువు పన్నిన కుట్రను చాకచక్యంగా భగ్నం చేసే నేర్పరిగా ఆమెకు మంచి పేరుంది. ఆ నైపుణ్యాలే అసోం రైఫిల్స్‌లో మొట్టమొదటి మహిళా డాగ్ హ్యాండ్లర్‌గా ఆమెను చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి.
శత్రువుకు చిక్కకుండా సాయుధ చర్యలో పాల్గొనడం సైనికుల సాధారణ విధి. కానీ, కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలు ఛేదించడం కోసం అదనపు నైపుణ్యాలు ఉండాలి. జాగిలాలతో కలిసి శత్రువుపై దాడి చేయడం కూడా అలాంటిదే. డాగ్ హ్యాండ్లర్ విధి మాటువేసి శత్రువును మట్టుబెట్టడమే కాదు… అంతకుమించిన సాహసం చేయాలి. ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో జాగిలాన్ని వెంటబెట్టుకుని సమరంలోకి దూకాలి. శత్రువు జాడ కనుక్కునే క్రమంలో ఏ మాత్రం అలికిడి అయినా ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఎంతో అప్రమత్తత, సహనంతోపాటు మరెన్నో అదనపు మెలకువలు ఉండే వారికే ఈ డాగ్ హ్యాండ్లర్ బాధ్యతలు అప్పగిస్తారు.
సైనికులను హతమార్చేందుకు ఏర్పాటుచేసిన బాంబులను గుర్తించడం, వాటిని నిర్వీర్యం చేయడం ఇవన్నీ డాగ్ హ్యాండ్లర్స్ చాకచక్యంగా చేయాలి. సైనిక జాగిలాలకు ఎంతటి శిక్షణ ఉంటుందో, వాటిని ఉపయోగించే (డాగ్ హ్యాండ్లర్స్) వారు కూడా అంతే సాధన చేయాల్సి ఉంటుంది. ఆత్మరక్షణతోపాటు జాగిలాన్ని కాపాడుకోవడం, దాన్ని దాడిలో ఉపయోగించడం కీలకం.
ఇన్నిట్లో ప్రతిభ కలిగిన శ్రీలక్ష్మి డాగ్ హ్యాండ్లర్‌గా ఎంపికై మహిళలందరూ గర్వపడే విజయం సాధించింది. సైనిక చర్యల్లో అత్యంత సమర్థంగా పనిచేసే శునక జాతిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బెల్జియన్ మాలినోయిస్ జాతి జాగిలాలతో కలిసి ఆమె పనిచేస్తున్నది. పురుషాధిక్యత ఉన్న సైన్యంలో లింగ సమానత్వానికి ఒక బాట వేసింది. శ్రీలక్ష్మి విజయాల స్ఫూర్తితోనే అసోం రైఫిల్స్‌లో 4 శాతంగా ఉన్న మహిళా సైనికులను ఆరేండ్లలో పది శాతానికి పెంచాలని సైన్యం భావిస్తున్నది. స్త్రీ శక్తితో మరెన్నో విజయాలు సాధించాలనే లక్ష్యంతో..!