దీపావళి అంటే భారతదేశం అంతా పెద్దలు ఇండ్లను దీపాలతో అలంకరించే పండుగ. ఇక పిల్లలకైతే ఇది ఉత్సాహాన్ని తెచ్చిపెట్టే పటాకుల వేడుక. పటాకులు కాల్చడం సరదాగా అనిపించినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దివాలీ సందడి ఆరోగ్యానికి హాని కలిగించే వేడుకగా మిగిలిపోతుంది. ముఖ్యంగా పిల్లలు పటాకుల చప్పుళ్లు, పొగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఊపిరితిత్తులు, కండ్లు, చెవుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
పటాకుల తయారీలో వాడే రసాయనాల మిశ్రమాలు మన శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటిలో అత్యంత సూక్ష్మమైన పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) ఉంటుంది. ఈ రేణువులు ఊపిరితిత్తులు, కళ్లలోకి సులభంగా చొచ్చుకుపోతాయి. గాయాలను, మచ్చలను మిగులుస్తాయి. పటాకుల్లో సల్ఫర్ డై ఆక్సయిడ్, నైట్రోజెన్ ఆక్సయిడ్లు ఉంటాయి. ఇవి వాతావరణంలోకి పెద్దమొత్తంలో విడుదల కావడం వల్ల ఆమ్లవర్షానికి కారణమవుతాయి. ఆమ్లవర్షం మన శరీరానికి హానికరం. ఇక వీటిలో ఉండే ఆర్సెనిక్ లాంటి టాక్సిక్ పదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి. పిల్లలు పటాకులను కాల్చడానికి ఆసక్తి చూపుతారు. అయితే, వీటి పొగ కారణంగా కండ్లు ఎర్రబడతాయి. నీళ్లు కారుతూ మంటపెడతాయి. ఏదో కుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది. మంట మరీ ఎక్కువగా ఉంటే కనుగుడ్డుకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
పటాకుల కారణంగా జరిగే గాలి కాలుష్యంలో దీర్ఘకాలంపాటు గడిపే పిల్లల్లో కాటరాక్ట్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో దృశ్యాలను సరిగ్గా చూడలేకపోతారు. దీన్ని పట్టించుకోకపోతే కంటిచూపును దెబ్బతీసే గ్లకోమాకు దారితీస్తుంది. పటాకుల పొగతో తలెత్తే మరో సమస్య కండ్లు పొడిబారే పరిస్థితికి సంబంధించిన డ్రై ఐ సిండ్రోమ్. అందువల్ల పిల్లల విషయంలో ఇంటి పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు పటాకులు కాలుస్తున్నప్పుడు కండ్లు దూరంగా ఉంచేలా చూసుకోవాలి. ఐ షీల్డ్ పెట్టుకుంటే మంచిది. పటాకులు కాలుస్తున్న సమయంలో బయటికి వెళ్లకుండా పిల్లల్ని ఇంటికే పరిమితం చేయాలి. ఈ సమయంలో కూడా ఇంట్లోకి ధారాళంగా గాలి వచ్చేలా చూసుకోవాలి. బయటికి వెళ్తున్నప్పుడు గాగుల్స్, సన్‌గ్లాసెస్ లాంటివి ధరించడం ఉత్తమం. ఒకవేళ అనుకోకుండా కండ్లు పటాకుల పొగకు గురైతే శుభ్రమైన నీళ్లతో కడగాలి. అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవాలి. పటాకులు కూడా పర్యావరణానికి మేలుచేసే ఎకో ఫ్రెండ్లీవి ఎంపిక చేసుకుంటే మంచిది.