ప్రతి ఉదయం చిక్కటి చాయ్తోనో, చక్కని కాఫీతోనో మొదలవుతుంది. అయితే, తరచూ టీ సేవిస్తే సమస్యలు తప్పవు. ఇలాంటప్పడు చాయ్ బదులు బనానా టీ తాగితే మంచిది. అరటిపండ్లతో టీ ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా! నిజమే.. దీన్ని మనమే ఇంట్లో తయారు చేసుకుని తాగొచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యకరం కూడా. దీన్ని తయారుచేయడం కూడా సులభమే. మరి ఈ బనానా టీని ఎలా తయారుచేయాలో, దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లను పోసి మరిగించాలి. ఇప్పుడు ఒక అరటిపండును తీసుకుని దానిపైన, చివరి భాగాలను కట్ చేయాలి. ఆ పండును మరుగుతున్న నీటిలో అలాగే వేయాలి. తరువాత స్టవ్‌ను సిమ్‌లో పెట్టి 10 నుంచి 15 నిమిషాలపాటు మరిగించాలి. ఆ నీటిని వడకట్టాలి. అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. అవసరం అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవచ్చు. దీంతో రుచికరమైన బనానా టీ రెడీ అవుతుంది. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. రోజుకు ఒక కప్పు తాగితే చాలు, ఎన్నో లాభాలను పొందవచ్చు. అరటిపండును తొక్క సహా లేదా తొక్క తీసి కేవలం పండును వేసి కూడా మరిగించుకోవచ్చు. బనానా టీలో ట్రిప్టోఫాన్, సెరటోనిన్, డోపమైన్ అనే మజిల్ రిలాక్సెంట్స్ ఉంటాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. అలాగే అరటిపండు టీ బరువును నియంత్రిస్తుంది. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది.