మన చర్మం చలికాలంలో ఎలా మారుతుందో, తల మీది చర్మమూ అలాంటి మార్పులకే లోనవుతుంది. ఫలితంగా మాడు పొడిబారిపోయి శిరోజాల సమస్యలకు కారణం అవుతుంది. ఇలా తలమీది చర్మం పొడిగా అవడం వల్ల వెంట్రుకలూ తేమను కోల్పోతాయి. దీనివల్ల పెరుగుదల మందగిస్తుంది. కుదుళ్లు బలహీన పడటం, వెంట్రుకలు చిట్లడం, రాలడంలాంటివి జరుగుతాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఈ సీజన్లో కురుల్ని కాపాడుకోవడానికి సాయపడతాయి. ఏ కాలమైనా సరే, జుట్టు బలంగా ఉండాలంటే సమతుల పోషకాహారం అవసరం. ఆహారంలో విటమిన్ ఎ, బి, సి, డి, ఇలతోపాటు ఐరన్, జింక్, ప్రొటీన్, బయోటిన్, అత్యావశ్యక కొవ్వులు ఉండాలి.ప్రొటీన్: మన వెంట్రుకలు కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారవుతాయి. మాంసం, గుడ్డు, చేపల్లోనూ, శాకాహారంలో బీన్స్, పప్పుల్లో అధిక మోతాదులో ప్రొటీన్లు దొరుకుతాయి.
బయోటిన్: విటమిన్- బి7 (లేదా విటమిన్ హెచ్)గా పిలిచే బయోటిన్ వెంట్రుకల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చిలగడదుంప, బాదం, గుడ్లలో ఇది పుష్కలంగా లభిస్తుంది. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు: జుట్టు పెరుగుదలకు తోడ్పడే ఈ ఫ్యాటీ యాసిడ్లు గింజలు, ఎండు ఫలాలు, చేపల్లో ఉంటాయి. ఐరన్: ఆకుకూరలు, బీన్స్, ఐరన్ ఫోర్టిఫైడ్ తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే వెంట్రుకలను దృఢంగా ఉంచే ఇనుము లభిస్తుంది.
విటమిన్ సి: ఇది శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి వెంట్రుకలు బలంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు సాయపడుతుంది. నారింజ, జామ, బొప్పాయి, స్ట్రాబెర్రీలాంటి వాటిలో విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. జింక్: జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో జింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది గింజలు, తృణ ధాన్యాలు, గుడ్డు లాంటివాటిలో అధికంగా ఉంటుంది.
-మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com