సంక్రాంతి తర్వాత సినిమా సీజన్ అంటే సమ్మరే. పిల్లల పరీక్షలు పూర్తయిపోవడం.. దానికి తోడు ఎండకాలం సెలవులు. రెండు నెలలూ పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇక వినోదమంటే తొలి ప్రయారిటీ సినిమానేగా!? కుటుంబాలకు కుటుంబాలు థియేటర్లకు క్యూ కట్టేది అందుకే. ఈ సీజన్లో సినిమా కాస్త బాగుంటే చాలు నిర్మాతలకు కాసుల పంటే. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సమ్మర్ సినిమాల సందడి భారీగానే ఉంది. సీనియర్ స్టార్లు, జూనియర్ స్టార్లు.. వీళ్లతోపాటు పక్కనే ఉన్న తమిళ హీరోలు అందరూ ఈ ఎండకాలాన్నే టార్గెట్ చేశారు. ఆ సమ్మర్ సందడేంటో.. దాని కథాకమామీషు ఏంటో కాస్త తెలుసుకుందాం..
సీనియర్ స్టార్లయిన బాలకృష్ణ, వెంకటేశ్.. సంక్రాంతిని టార్గెట్ చేసి భారీ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా వెంకీ అయితే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో రీజనల్ సినిమా రికార్డులన్నిటినీ బద్దలు చేసి సంక్రాంతి వీరుడయ్యాడు. పొంగల్ తర్వాత సినిమావారికి ఇష్టమైనది వేసవి. ఈ టైమ్‌లో విడుదలైన సినిమాలు మంచి కలెక్షన్లు సాధిస్తాయని వారి నమ్మకం. అందుకు తగ్గట్టుగా పలు సినిమాలు వేసవి వార్‌కు సిద్ధమవుతున్నాయి.
రానున్న ఎండకాలంలో థియేటర్లలో సందడి చేసే స్టార్ల గురించి చెప్పాలంటే ముందు అగ్రనటుడు చిరంజీవి నుంచి మొదలుపెట్టాలి. ప్రస్తుతం ఆయన వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయిక. ఇంకా కొంతమంది హీరోయిన్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. ‘విశ్వంభర’ అనే లోకం చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తున్నది. ఇందులో చిరంజీవి కారణజన్ముడిగా కనిపిస్తారట. మే 9న సినిమా విడుదల చేయనున్నట్టు వినికిడి. నిజానికి మే 9 చిరంజీవికి కలిసొచ్చిన డేట్. ఆయన నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలు విడుదలైందీ ఆ తేదీనాడే కావడం గమనార్హం.
వేసవిలో కాస్కో అంటున్న రెండో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఆయన నటించిన రెండు సినిమాలు ఈ సమ్మర్లో విడుదల కానుండటం విశేషం. ఈ రెండూ తమిళ చిత్రాలే కావడం మరో విశేషం. పైగా రెండిటిలోనూ ఆయన హీరోగా కాకుండా, ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తుండటం గమ్మత్తు! వాటిలో మొదటిది ‘కుబేర’. ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. తన బాణీకి భిన్నంగా శేఖర్‌కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో నాగార్జున కరోడ్‌పతిగా కనిపిస్తారని తెలుస్తున్నది.
ఈ సినిమా కథా వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు శేఖర్ కమ్ముల టీమ్. రష్మిక కథానాయిక. ఏప్రిల్ 30న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు సునీల్ నారంగ్, రామ్మోహన్రావు పుస్కూర్. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్‌గా నటిస్తున్నట్టు కోలీవుడ్ న్యూస్. తలైవాను ఢీకొనే పాత్రలో నాగ్ కనిపిస్తే ఇక థియేటర్లలో జాతరే కదా! కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న విడుదల కానున్నదని సమాచారం. అంటే.. రెండ్రోజుల తేడాతో ఈ రెండు సినిమాలు
విడుదల అవుతుండటం విశేషం.
మరో అగ్రహీరో పవన్‌కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ ఫ్రాంచైజీలో తొలి భాగం ఈ సమ్మర్లోనే విడుదల కానుంది. ఈ చిత్రంలో కొంతభాగానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, మిగతాదంతా ఏఎం జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ నటిస్తున్న తొలి జానపద చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో ఆయన రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే కథతో దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిధి అగర్వాల్ ఇందులో కథానాయిక. మార్చి 28న విడుదల అవుతున్న ఈ సినిమాతో సమ్మర్ సీజన్ మొదలుకానుంది.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ద రాజాసాబ్’ కూడా సమ్మర్లోనే రానుంది. హారర్ కామెడీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్స్టార్డమ్ ఉన్న ప్రభాస్ నటిస్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఆయనే ‘రాజాసాబ్’ అనే ఘోస్ట్‌గా కనిపిస్తారని తెలుస్తున్నది. సంజయ్‌దత్ కీలక పాత్రధారి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.
‘ధమాకా’(2022)తో వందకోట్ల విజయాన్ని సాధించిన రవితేజ.. అదే కసితో ఇప్పుడు ‘మాస్ జాతర’ చేస్తున్నారు. శ్రీలీల కథానాయిక. రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రవితేజ గత చిత్రాల మాదిరిగానే మాస్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తున్నది. మే 9న ఈ సినిమా విడుదల చేయాలని ముందు భావించారు. కానీ అదేరోజు ‘విశ్వంభర’ రానుంది. స్వతహాగా చిరంజీవి వీరాభిమాని అయిన రవితేజ.. మరి అభిమాన హీరో కోసం ఆ డేట్‌ను త్యాగం చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ డేట్ మార్చుకున్నా.. రిలీజైతే సమ్మర్లోనే.
ఇక ఈ వేసవి రానున్న మరో స్టార్ హీరో నాని. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో సినిమా అయిన ‘హిట్ 3’లో ఆయన హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. హిట్, హిట్ 2 మంచి విజయాలు సాధించిన నేపథ్యంలో ‘హిట్ 3’పై భారీ అంచనాలే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే దర్శకుడు శైలేష్ కొలను ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘హిట్’ కథానాయకుడు విశ్వక్సేన్, ‘హిట్2’ కథానాయకుడు అడివి శేషు ఇందులో ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. నిధి శెట్టి కథానాయిక. మే 1న సినిమా విడుదల కానుంది.
టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ కూడా సమ్మర్లో సందడి చేయనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన నటించిన ‘కింగ్డమ్’ చిత్రం ఈ సమ్మర్లోనే విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన మళ్లీరావా, జెర్సీ చిత్రాలు అద్భుతంగా ఆడాయి. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మే 30న ‘కింగ్డమ్’ విడుదల కానుంది.
సమ్మర్లో సందడి చేయనున్న మరో స్టార్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన ‘జాక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. వైష్ణవి చైతన్య కథానాయిక. ‘టిల్లు స్కేర్’తో వందకోట్ల విజయాన్ని సాధించిన సిద్ధు జొన్నలగడ్డ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. ఇంకా సందీప్‌కిషన్ ‘మజాకా’, నితిన్ ‘రాబిన్‌హుడ్’, శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’, అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ‘ఘాటీ’.. ఈ సినిమాలన్నీ సమ్మర్ రిలీజ్లే. ఆ విధంగా ఈ సమ్మర్ అంతా భారీ సినిమాలతో థియేటర్లు కళకళలాడనున్నాయి. ఇక సినీ అభిమానులకు కావాల్సినంత టైమ్‌పాస్.
తమిళ హీరోలు సైతం సమ్మర్‌నే టార్గెట్ చేశారు. రజినీకాంత్ ‘కూలీ’ ఈ సమ్మర్లోనే మే1న విడుదల కానున్నదట. అలాగే, ఏప్రిల్ 11న ‘భారతీయుడు 3’, జూన్ 5న మణిరత్నం ‘థగ్‌లైఫ్’ సినిమాలతో కమల్‌హాసన్ హంగామా చేయనున్నట్టు సమాచారం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్‌కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా కూడా ఏప్రిల్ 10న సందడి చేయనుంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన ‘రెట్రో’ మే 1న విడుదల కానుంది.
…? సినిమా డెస్క్