చిన్న జ్వరమొచ్చినా, పెద్ద రోగమొచ్చినా.. వైద్యులు మొదటగా చేసేది మూత్ర పరీక్ష! మూత్రం.. మనిషిలో అనేక వ్యాధులను బయటపెడుతుంది. రోగం ముదరకముందే.. మనకూ కొన్ని హెచ్చరికలను ఇస్తుంది. మూత్రం దుర్వాసన రావడం కూడా.. ఇలాంటి ఓ హెచ్చరికే! ముఖ్యంగా.. మహిళల్లో తీవ్రమైన వ్యాధులకు సంకేతం!
బ్యాక్టీరియల్ వెజినోసిస్: మహిళల జననాంగాల్లో ఏర్పడే ఒక రకమైన ఇన్ఫెక్షన్.. బ్యాక్టీరియల్ వెజినోసిస్. మూత్రం నుంచి దుర్వాసన రావడం.. బ్యాక్టీరియల్ వెజినోసిస్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. అందుకే, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, దురద, మంట ఉంటే.. వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: మహిళల్లో ఎక్కువగా కనిపించే ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది.మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ కారణంగా.. మూత్రం నుంచి దుర్వాసన వస్తుంది. దీంతోపాటు దురద,మంట కూడా కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే.. నిర్లక్ష్యం చేయవద్దు.కిడ్నీ సమస్యలు: మూత్రం నుంచి దుర్వాసన వస్తున్నదంటే.. కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. శరీరంలో టాక్సిన్స్ పెరగడం వల్ల సమస్య ముదురుతుంది. నిర్లక్ష్యం చేస్తే.. మూత్రపిండాల పనితీరుపై ప్రభావితం చూపుతుంది.మధుమేహం: రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువైనా.. మూత్రం వాసన వస్తుంది. ఇది మధుమేహం ప్రారంభ లక్షణాన్ని సూచిస్తుంది.