హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ. ఫంక్షన్ హాలంతా ఒకటే సందడి. ఎరుపు, ఆకుపచ్చ రంగుల దుస్తుల్లో ఆడవాళ్లు అటూ ఇటూ తిరుగుతుంటే ఇప్పుడేం పండుగబ్బా అని అనుమానం వచ్చే లాంటి వాతావరణం ఏర్పడిందక్కడ. ఆ మాటే వాళ్లనడిగితే… అవును పండుగే ‘ఆవకాయ పండుగ’ అన్నారు చిరునవ్వుతో. వందకు పైగా కుటుంబాలు ఒక్కచోట చేరి కలిసికట్టుగా ఆవకాయ పెట్టుకుంటే నిజంగా పండుగే కదా మరి! ఆ అపార్ట్మెంట్ వాసులకు అసలు వినూత్నమైన ఈ ఆలోచన ఎలా వచ్చింది, 150 కిలోలకు పైగా ఆవకాయను ఒక్కరోజులో ఎలాపెట్టారు లాంటివన్నీ ఇక్కడ ఆసక్తి కలిగించే అంశాలే.
తెలుగు వాళ్లకు మాత్రమే సొంతమైన ఆస్తుల్లో ఆవకాయ ముందు వరుసలో ఉంటుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడూ, అస్సలు ఆకలి లేనప్పుడూ పొట్టకు దీనికి మించిన నేస్తం మరోటి ఉండదు. అందుకే ఏదేశమేగినా ఎందుకాలిడినా ఎర్రెర్రటి తొక్కు పచ్చడి ఎమ్మటె ఉండాల్సిందే. అలాంటిది అపార్ట్మెంట్లో ఉన్నంత మాత్రాన ఆవకాయను మర్చిపోతారా. అస్సలు మర్చిపోరు. కాకపోతే ఎవరు పెడతారు, ఎలా పెడతారన్న పెద్ద ప్రశ్నకు మాత్రం మంచి సమాధానంగా దొరికింది ఉమ్మడి ఆవకాయ కాన్సెప్ట్. హైదరాబాద్ మోతీనగర్‌లోని బ్రిగేడ్ సిటాడెల్ హై రైజ్ అపార్ట్మెంట్ దీనికి వేదికైంది. ఒకరి ఆలోచన, వందల మంది ఆమోదం, అందరి సహకారం ఫలితంగా ‘ఆహా!’ అనిపించే అద్భుతమైన ఆవకాయ ఇంటింటా
ఒకేరోజు చేరింది.
పూర్వం అమ్మమ్మ, బంధువులందరూ కలిసి ఆవకాయ పెట్టడం అన్నది ఎంత సందడిగా సాగేదో… ఆ అనుభూతి మళ్లీ కలిగితే బాగుండు, అసలు మన చుట్టుపక్కల వాళ్లమంతా ఏకమై అలా ఎందుకు ఆవకాయ పెట్టకూడదు… అంటూ అపార్ట్మెంట్ వాసి స్వాతి జ్యోతులకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తమ కమ్యూనిటీలోని మహిళల ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో, ‘మనం అందరం కలిసి ఆవకాయ పెట్టుకుందామా…’ అంటూ పోస్ట్ చేశారు. మంచి ఐడియా… డేట్ ఫిక్స్ చేయండి… అంటూ కుప్పలు తెప్పలుగా రిప్లయ్‌లు. మీరు ఏర్పాటు చేయండి, మేం ముందుండి సాయం చేస్తాం అంటూ పెద్దల నుంచి హామీ. 700 మందికి పైగా మహిళలు ఉంటారు ఆ గ్రూప్‌లో. ఎవరెవరికి ఆవకాయ అవసరం ఉందో వాళ్లంతా ఉత్సాహం చూపారు. అలా ఓ వంద కుటుంబాలు మనం కలిసికట్టుగా ఆవకాయ పెట్టుకుందాం అంటూ ముందుకు వచ్చాయి. ఇంకేం, దానికి రంగం సిద్ధం చేశారు. వారాంతంలో (శనివారం) కార్యక్రమం పెట్టుకున్నారు.
మామిడికాయ తొక్కు పెట్టాలంటే కాయలన్నీ ఒకే చెట్టువి తెంపాలి అన్నారొకరు. మా తోట ఉందిగా అన్నారు మరొకరు. ముందుగానే ఎవరెవరికి ఎంత పచ్చడి కావాలి అన్నది చర్చించుకున్నారు కాబట్టి శంషాబాద్ శివార్లలో మామిడి తోట నుంచి 350 మామిడి కాయలు కోయించి తెచ్చారు. గుంటూరు నుంచి ప్రత్యేకంగా కారం తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు, ఉప్పు… ఇలా అన్ని పదార్థాలూ సరిపడా అమర్చుకున్నారు. కమ్యూనిటీ లోపలే ఉండే ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసుకున్నారు. మామిడి కాయలు కడిగి పెట్టుకుని హాల్లోకి చేర్చుకున్నారు.
కావాలనుకున్న వంద కుటుంబాలకు చెందిన వాళ్లూ పిల్లలూ, వారికి సాయంగా కొందరు మగవాళ్లూ అక్కడికి చేరుకున్నారు. ముక్కలు కొట్టాక, తుడవడం, పొరను తీయడం కొందరు చేస్తుంటే… మరోవైపు దినుసుల ప్యాకెట్లను తెరిచి కొలతలు వేసే పనుల్లో మరికొందరు పడ్డారు. ఏవి ఎంత కావాలో చెబుతూ అన్నీ టబ్బుల్లోకి చేర్చి కారం కలపడం పెద్దవాళ్ల పనైంది. మాకు వెల్లుల్లి వేయకండి అని కొందరన్నారు. దీంతో రెండు రకాల ఆవకాయలను విడివిడిగా శుచిగా నాలుగు టబ్బుల నిండుగా (సుమారు 150 కేజీలు) పెట్టుకున్నారు. తిరగ కలిపాక ప్రతి ఇంటి నుంచీ వచ్చిన జాడీల్లో వాటిని సర్దారు.
‘అంత మంది సాయం చేసినా, ఆవకాయ మీద చేయి వేసి కలిపింది మాత్రం పెద్దవాళ్లే. అద్భుతః అనేంతలా కుదిరింది పచ్చడి. ఏడాదంతా ఉండే కారం శుచిగా చేయాలని పెద్దవాళ్లు పట్టుచీరలు కట్టుకొచ్చి మరీ పెట్టారు. బాల, జ్యోతి, సుజాత, స్వరూప… ఇలా బోలెడు మంది దీన్ని సక్సెస్ చేయడానికి పనిచేశారు. ఇక ఈవెంట్ కోసం మేమందరం ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలని అనుకున్నాం. మొత్తానికి ఇదంతా ఓ పండుగలా భలే సరదాగా జరిగింది’ అని చెబుతారు అదే కమ్యూనిటీలో నివసించే యోగా టీచర్ ధరణిప్రగడ దీప్తి.
‘ఏడాది క్రితమే ప్రారంభమైన మా అపార్ట్మెంట్లో బతుకమ్మ, సంక్రాంతి, నవమిలాంటి పండుగలన్నిటినీ సంప్రదాయ బద్ధంగా జరుపుకొంటాం. అలాగే పాత తరహాలో ఆవకాయ పెట్టాలన్న సంకల్పమూ విజయవంతం అయింది. నేను బ్యాంక్ మేనేజర్ని. మనకు ఆసక్తి ఉంటే తప్పకుండా వీటన్నిటి కోసం కూడా టైం దొరుకుతుంది. ఇలా ఎవరైనా చేసుకోవచ్చు’ అంటూ ఉత్సాహంగా చెబుతారు స్వాతి. అపార్ట్మెంట్ కల్చర్‌లో ఎవరికివారే అని విసిగి వేసారిన సగటు జీవికి ఇలాంటి ఆవకాయ పండుగ కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు కదూ! ఏమంటారు?!
-లక్ష్మీహరిత ఇంద్రగంటి రజనీకాంత్ గౌడ్