చిన్నపిల్లల్లో తలెత్తే ఆటిజంలాంటి వ్యాధులు ఇక మీదట దీర్ఘకాలికంగా ఉండబోవని, వాటికి కూడా మందు ఉంటుందని ఇటీవల అమెరికాలోని స్టాన్ఫర్డ్ శాస్త్రవేత్తలు ఎలుకల మీద చేసిన ప్రయోగం ద్వారా వెల్లడైంది. మెదడులోని ప్రధాన భాగాలకు రక్షణగోడలా ఉండే రెటిక్యులర్ థలామస్ న్యూక్లియస్ అనేది దీని నివారణలో కీలక భాగం కానుందని ఇది చెబుతున్నది. ఈ ప్రాంతంలో అతిగా ఏర్పడే స్పందనలను నియంత్రించగలిగితే ఆటిజం లక్షణాలు తగ్గుతున్నట్టు గమనించారు. వీటిని అదుపు చేసే మందులను వాడటం ద్వారా మూర్ఛలాంటి ఇతర లక్షణాలను కూడా తగ్గించవచ్చని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది.
అంతేకాదు, సరిగ్గా నడవడం, రాయడం, షూ లేసులను సరిగ్గా పట్టుకొని కట్టుకోగలగడం లాంటి వివిధ పనులను చేసుకునేందుకు కూడా ఇవి అవకాశాన్ని కల్పిస్తున్నాయట. చేసిన పనినే మళ్లీ చేయడంలాంటి సమస్యలను అధిగమించేందుకూ, నలుగురిలో కలిసి మాట్లాడగలిగేలా ఉపకరించేందుకూ ఇవి తోడ్పడతాయట. కాబట్టి ఈ ప్రయోగాలు మరింత ముందుకు వెళితే మెదడులోని ఆ ప్రత్యేక భాగంలోని చర్యల్ని నియంత్రించడం ద్వారా ఆటిజం నుంచి విముక్తి కలిగించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవే మందుల్ని మూర్ఛల నివారణలోనూ వాడేందుకు సరికొత్త మార్గాలు వెతుకుతున్నారు.