నేటితరం మహిళలు నవ్యతకు పెద్దపీట వేస్తున్నారు. కాలి చెప్పులు మొదలుకొని.. కళ్ల కాటుక వరకూ అన్నీ ఆధునికంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆధునిక వస్తువులతో అనేక ప్రయోజనాలు పొందుతున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం పాతకాలపు పద్ధతులనే పాటిస్తున్నారు. ముఖ్యంగా, నెలసరి సమయంలో ఉపయోగించే ‘మెన్స్ట్రువల్ కప్’ విషయంలో.. భారతీయ మహిళలు ఇప్పటికీ అపనమ్మకంతోనే ఉన్నారట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) లక్నో.. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో ఆరోగ్యంతోపాటు పర్యావరణానికీ అనుకూలంగా ఉండే ‘మెన్స్ట్రువల్ కప్’ వాడకం పెంచేలా మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని గైనకాలజిస్టులు చెబుతున్నారు. పునర్వినియోగించే అవకాశమున్న ఈ సిలికాన్ కప్‌లను.. సాధారణ ప్యాడ్ల కన్నా ఎక్కువ సమయంపాటు ఉపయోగించొచ్చు.
రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ వాడుకోవచ్చు. రక్తస్రావం తక్కువగా ఉన్నట్టయితే.. 12 గంటల వరకూ మార్చకున్నా ఫర్వాలేదని గైనకాలజిస్టులు అంటున్నారు. దీర్ఘకాలంలో వాడే సాధారణ ప్యాడ్లకన్నా.. ఇది ఎంతో చవకైనది కూడా. వీటిని తరచుగా మార్చాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా.. ప్యాడ్ వల్ల వచ్చే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే, ఈ ‘మెన్స్ట్రువల్ కప్’ మొదటిసారి ఉపయోగించేవారికి కాస్త అసౌకర్యంగా ఉంటుంది. వాటిని శుభ్రం చేయడం కూడా చిరాకుగా అనిపిస్తుంది. కానీ, ఇవి మహిళల ఆరోగ్యానికి, పరిశుభ్రతకు ఎంతో ఉపయోగపడతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే.. ‘మెన్స్ట్రువల్ కప్’ ఎంచుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలకు సరిపడే రకాలనే ఎంచుకోవాలి. వాటిని సురక్షితంగా అమర్చుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం.