దిగ్గజ సంస్థ యాపిల్.. తన సరికొత్త ఐఓఎస్‌పై అప్డేట్ ఇచ్చింది. వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ -2025 వేదికగా.. ‘ఐఓఎస్-26’ను ప్రకటించింది. ఐఫోన్, ఐపాడ్ యూజర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అనేక ఫీచర్లను ఇందులో పొందుపరిచింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో సరికొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తోపాటు అధునాతన ఏఐ ఫీచర్లు, మరిన్ని అప్డేట్స్ ఇచ్చినట్లు యాపిల్ సంస్థ చెబుతున్నది.
ప్రస్తుతం యాపిల్ ఉత్పత్తుల్లో ‘ఐఓఎస్ – 18’ ఆపరేటింగ్ సిస్టం నడుస్తున్నది. రాబోయే అప్డేట్ ‘ఐఓఎస్-19’గా ఉంటుందని అందరూ భావించారు. కానీ, సంప్రదాయానికి భిన్నంగా.. సంవత్సరాన్ని బట్టి పేరును నిర్ణయించింది. తాజా అప్డేట్ను ‘ఐఓఎస్-26’ పేరుతో అనౌన్స్ చేసింది యాపిల్ సంస్థ. ఇందులో అనేక అధునాతన ఫీచర్లతోపాటు, ఎన్నో మార్పులు – చేర్పులు చేసినట్టు యాపిల్ వెల్లడించింది. ముఖ్యంగా.. ఈ ఐఓఎస్‌ను లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో అందిస్తున్నది. ఈ డిజైన్.. యాపిల్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నది. లాక్‌స్క్రీన్ క్లాక్.. పూర్తి స్క్రీన్‌లో కనువిందు చేయనున్నది.
బ్రౌజింగ్‌లోనూ పెద్ద అప్డేట్ను జతచేసింది. యాపిల్ సేఫ్ బ్రౌజర్.. ‘సఫారీ’లో ఫ్లోటింగ్ ట్యాబ్ బార్‌ను ఏర్పాటుచేసింది. దీంతో ఎడ్జ్ టు ఎడ్జ్ బ్రౌజింగ్ చేసుకునే వీలు కలుగుతుంది. ఇక ఫొటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడుతున్న ఈతరం కోసం.. కెమెరా యాప్‌ను ఆధునికంగా తీర్చిదిద్దింది. సరికొత్త క్లీనర్, ఆన్‌స్క్రీన్ కంట్రోల్స్‌ను జతచేసింది. దీంతో మరింత స్ట్రీమ్ లైన్ ఇంటర్ఫేస్తో కెమెరా యాప్ కనిపించనున్నది. విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్‌తో ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సబ్జెక్టుల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నది. స్క్రీన్ షాట్ తీస్తే చాలు.. అందులోని వస్తువుల వివరాలన్నీ కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. ఇప్పుడు ఐఓఎస్ వినియోగదారులకూ చేరువైంది.
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా.. ‘ఐఓఎస్-26’ ఏఐపై ప్రత్యేక దృష్టిపెట్టింది. రైటింగ్ టూల్స్, జెన్మోజీ, ఇమేజ్ ప్లేగ్రౌండ్‌ను మెరుగుపరిచింది. ‘సిరి’కి ప్రధాన అప్‌గ్రేడ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఫోన్ యాప్, ఆపిల్ మ్యూజిక్, మ్యాప్స్, వాలెట్ యాప్స్‌లోనూ కొత్త ఫీచర్లను అందిస్తున్నది. అయితే, ఈ సరికొత్త అప్డేట్ సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్టు యాపిల్ చెబుతున్నది. ఐఫోన్ 11 – ఆ తర్వాతి సిరీస్ ఐఫోన్లు, ఐప్యాడ్ 11 జెనరేషన్ తర్వాతి సిరీస్‌లు మాత్రమే ఈ అప్డేట్ను సపోర్ట్ చేస్తాయి. అంతుకుముందు మోడల్స్‌లో ‘ఐఓఎస్-26’ పనిచేయదని యాపిల్ వెల్లడించింది.