స్త్రీకి తల్లి కావడానికి మించిన అదృష్టం మరోటి లేదు. బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన సరిపోదు. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం. ఆ బిడ్డ చిన్న లోపంతో జన్మించినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు ఈ సమస్యలు ఎక్కువ. కాబట్టి గర్భం దాల్చినప్పటి నుంచి బంగారు కలలుగనే స్త్రీలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. తొమ్మిది నెలలూ కడుపులో మోసి, పండంటి బిడ్డను కనొచ్చు! శిశువు ఆరోగ్యం, ఆనందం అంతా తల్లిచేతుల్లోనే ఉందంటున్నారు డాక్టర్ నితాషా బగ్గ.
సాధారణ గర్భదారణ కాలం తొమ్మిది నెలలు (నలభై వారాలు). అంటే పిండం తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు ఉంటుంది. నవమాసాలు నిండిన తర్వాత ప్రసవిస్తే పుట్టిన బిడ్డను ‘ఫుల్ టర్మ్ బేబీ’ అంటారు. నెలలు నిండిన శిశువు కనీస బరువు 2.5 కేజీలు. ఇలా జరగకుండా 24 నుంచి 37 వారాల మధ్యలో ప్రసవిస్తే పుట్టిన బిడ్డను ‘ప్రీ మెచ్యూర్ బేబీ’ అంటారు. ఈ శిశువుల బరువు 500 గ్రాముల నుంచి 2 కిలోల వరకు ఉంటుంది. నెలలు నిండకముందే ప్రసవానికి పలు కారణాలున్నాయి. గర్భిణికి, పిండంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నెలలు నిండకముందే ప్రసవం జరుగుతుంది.

గర్భిణి ఆరోగ్యం క్షీణిస్తే గర్భంలో పెరుగుతున్న పిండం కూడా ఆరోగ్యంగా ఉండదు. పిండం ఎదుగుదల (శరీర నిర్మాణం)లో లోపాలు తలెత్తుతాయి. పిండంలో అవయవాలు సరిగా వృద్ధి చెందవు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలలో లోపాలుంటాయి. వీటి వల్ల నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. ఫలితంగా పుట్టిన శిశువు అవయవ లోపాలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రీమెచ్యూర్ ప్రసవం జరిగితే.. పుట్టిన శిశువుని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో ఉంచి, చికిత్స చేస్తారు. గర్భం దాల్చినప్పటి నుంచి లెక్కించి, 34 వారాలు ఎప్పటికి పూర్తవుతాయో అప్పటి వరకు ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తారు. ఇది తల్లి కడుపులోని గర్భసంచిలాంటిదే. బిడ్డకు ఇన్ఫెక్షన్లు సోకుకుండా బయటి వాతావరణం నుంచి రక్షణ కల్పిస్తుంది. తల్లి నుంచి పోషకాలు అందినట్టే ఇందులోనూ బిడ్డకు అవసరమైన పోషకాలను అందిస్తారు. కృత్రిమంగా ప్రొటీన్లు ఇవ్వడం వల్ల శిశువులో ఎదుగుదల క్రమంగా మొదలవుంది. ఆ సమయంలో శిశువు శరీరంలోని గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలను స్కాన్ చేసి, వాటి ఎదుగుదలను పరీక్షిస్తారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే దానికి సంబంధించిన చికిత్స అందిస్తారు. ఆ సందర్భంలోనే బిడ్డకు ఇన్ఫెక్షన్లు ఉంటే యాంటి బయాటిక్స్ ఇస్తారు. ఊపిరితిత్తులు మెరుగుపడటానికి వెంటిలేటర్ పెడతారు. దీని వల్ల ఊపిరితిత్తుల్లో ఎదుగుదల పూర్తి స్థాయిలో జరుగుతుంది. శిశువు బరువు 1.4 కేజీల నుంచి 1.5 కేజీల వరకు పెరిగేదాకా ఆ యూనిట్లోనే ఉంచుతారు.

ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతమైన బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న సందర్భంలోనూ తల్లిదండ్రులకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు. వాటిని పాటిస్తే తర్వాత కాలంలో బిడ్డకు ఆరోగ్య సమస్యలు అంత తేలికగా రావు.