ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ॥
అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఒక చేతిలో మధురసాలతో కూడిన మాణిక్యపాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిటె ధరించిన రూపంలో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ ఎర్రని శరీర ఛాయతో, మెడలో తారాహారాలు ధరించి, నిండు చంద్రుడిలా ప్రకాశించే ముఖంతో, విశాలమైన త్రినేత్రాలతో భాసిల్లుతుంటుంది. తన బిడ్డల ఆకలి తీర్చటానికి దుర్గాదేవి.. అన్నపూర్ణగా అవతరించింది. ఈ తల్లిని ఉపాసించిన వారికి ఏ లోటూ ఉండదు. బ్రహ్మతేజస్సు, వాక్సిద్ధి కలుగుతాయి. అంతేకాదు, తనను కొలిచినవారి సకల కార్యభారాన్నీ ఈ తల్లే వహిస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. అన్నపూర్ణకు దద్యోజనం (పెరుగన్నం), కట్టెపొంగలి నివేదనగా సమర్పించాలి. ఈ రోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పారాయణం చేయాలి. శక్తికొద్దీ అన్నదానం చేయాలి.