నిప్పులేని చోట మంటపెడుతుంది మాట. ఆ మాటల మంటలకు ఆజ్యం పోస్తుంది పెద్దల జోక్యం. ‘ఈగో’ సంసారంలో సుడిగుండాలు సృష్టిస్తుంది. అదే పిల్లల భవితకు పెద్ద గండం. కొట్లాడుకుని కోర్టు మెట్లెక్కే భార్యాభర్తలు ఒక్క మెట్టు దిగిరావాలంటున్నది జి. జ్యోతిరావు. ‘ఈ ప్రపంచంలోకి మీరు తీసుకువచ్చిన పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మీదే. పెండ్లినాటి ప్రమాణాలను గుర్తుచేసుకుని, తప్పొప్పులను సరిచేసుకుని మళ్లీ కలిసి ఉండేందుకు అమికాను ఆశ్రయించండి’ అంటున్నారు ఆమె. స్పానిష్ భాషలో అమిక అంటే ‘ఫ్రెండ్’ అని అర్థం. ఎడబాసిన వారిని కలపడంలో ఇరు కుటుంబాలు విఫలమైనప్పుడు ఇద్దరినీ కలుపుతుందీ ఫ్రెండ్!
‘రోజూ కోర్టు మెట్లెక్కే ఆడవాళ్లను చూస్తున్నాను. వాళ్ల సమస్యలు వింటున్నాను. నేను క్రిమినల్ కేసులు ఎక్కువ చూశాను. బెయిల్ రాక, కేసు నడిపించే లాయర్ లేక జైళ్లలోనే మగ్గిపోయే ఖైదీల కోసం ఉచితంగా వాదించాను. అలాగే వివాహ సంబంధమైన కేసుల్లో న్యాయం కోసం వచ్చే ఆడవాళ్ల తరఫునా వాదించాను. గృహహింస కేసుల్లో దంపతులను కలపాలనే వాదించాను. తొంభై శాతం కేసుల్లో ఇదే చేశాను. వీళ్లకు నా వంతు సాయం చేయాలని 30 ఏండ్లుగా ఉచితంగా న్యాయ సేవలు అందించాను.
కోర్టుకు వెళ్తే..
భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టుకు వెళ్తే.. వాళ్లిద్దరే కాదు, పిల్లలు కూడా మానసికంగా కుంగిపోతారు. ‘అమ్మ ఇలా.. నాన్న అలా..’ అని పిల్లలు మదనపడుతుంటారు. కేసు ఆలస్యమయ్యే కొద్దీ న్యాయవాదులకు ఫీజులు ఇవ్వడం భారంగా మారుతుంది. దీనికితోడు ‘కోర్టుకు వెళ్లారట’ అని ఇరుగు పొరుగు చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఈ పరిస్థితులు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. అమ్మానాన్న ఉండికూడా అనాథలుగా మిగిలిపోతారు. దంపతుల మధ్య ఉండే ఇబ్బందులతో పోలిస్తే.. వారి పిల్లల భవిష్యత్తుపై పడే ప్రభావం అంతకన్నా పెద్ద సమస్య. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. పేదరికం చూశాను. స్కాలర్షిప్ డబ్బులతో చదివాను. కష్టాలు తెలిసిన దాన్ని కాబట్టి.. ఎవరి పిల్లలూ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని కోరుకుంటాను. అందుకే వీలైనంత వరకు విడాకులు కోరుకునే దంపతులను కలిపే ప్రయత్నం చేస్తున్నాను. వారు కొత్త జీవితం మొదలుపెట్టేలా ‘అమిక మీడియేషన్ సెంటర్’ ద్వారా కృషి చేస్తున్నాను.
మధ్యవర్తి మాటలు
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. తాత, నాయనమ్మ, బాబాయి, మామయ్య, అమ్మమ్మ ఇలా అనుబంధాల మధ్య పిల్లలు పెరిగేవాళ్లు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉంటున్నాయి. అందులోనూ ఆ భార్యాభర్తలు విడిపోతే.. పిల్లలు ప్రేమాభిమానాలు తెలియకుండా పెరుగుతారు. సమాజంపై శత్రుత్వం పెంచుకుంటారు. మంచీచెడూ తెలిసే అవకాశమూ ఉండదు. పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావొద్దంటే తల్లిదండ్రులను కలిపే ప్రయత్నం చేయాలి. కారణాలు ఏవైనా విడిపోవాలి అనుకున్న దంపతులను కలపడం అనుకున్నంత తేలిక కాదు. ఇంట్లో ఇరుపక్షాలు కూర్చొని పరిష్కరించే వ్యవహారం అంతకన్నా కాదు. మధ్యవర్తిత్వం తెలిసిన, శిక్షణ పొందిన వాళ్ల సహకారం అవసరం. ఆర్బిట్రేటర్ ట్రైనింగ్ పొందిన వాళ్లతో ఇన్స్టిట్యూషనల్ మీడియేషన్ ఉంటే ఇలాంటి సమస్యలకు మేలు జరుగుతుందని దీన్ని మొదలుపెట్టాం.
పిల్లల కోసం పెద్ద మనసుతో..
మధ్యవర్తిత్వం కోసం భార్య గానీ, భర్త గానీ వస్తే.. మొదట వాళ్లు చెప్పింది మొత్తం వింటాం. బాధలన్నీ చెప్పుకోవడం వల్ల వాళ్ల మనసులో బాధ కొంతవరకు తగ్గుతుంది. వినేవాళ్లు మనకు న్యాయం చేస్తారనే నమ్మకం కలుగుతుంది. తర్వాత రెండో పార్టీని పిలుస్తాం. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడతాం. వాళ్లిద్దరితో వేర్వేరుగా మాట్లాడతాం. వాళ్ల తల్లిదండ్రులను కూడా పిలిపిస్తాం. అందరితో అన్నీ మాట్లాడిన తర్వాత సమస్య ఎక్కడుందో చెబుతాం. ఇద్దరూ కలిసి ఉండేందుకు ఉన్న మార్గాలను వారికి వివరిస్తాం. ముఖ్యంగా.. పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని చెబుతాం. పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేస్తాం. మధ్యవర్తిత్వం వల్ల మళ్లీ కలిసి జీవించేందుకు అవకాశాలు ఎక్కువే! ఓడిపోవడం ఉండదు. ఇద్దరూ విజేతలే!
అతిజోక్యం కూడదు..
చదువు, సంపాదనే కాదు పెండ్ల్లి చేసేప్పుడు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ ద్వారా కాబోయే వధూవరులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పెండ్లయ్యాక ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు జోక్యం చేసుకోవద్దు. చిన్నచిన్న ఇబ్బందులు వస్తే.. వాళ్లే సర్దుకుపోతారు. మూడోవ్యక్తి జోక్యం వల్ల అవే చిలికి చిలికి గాలివానగా మారుతాయి. భార్యాభర్తల్లో ఉండే ఈగోలు విడిపోయేంత దూరాన్ని పెంచుతాయి. పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటారు. కానీ, దానివల్ల సమస్య పరిష్కారం కాకపోగా, చాలా సందర్భాల్లో మరింత జటిలం అవుతుంటుంది. ఈ మధ్య పాతికేండ్లు దాటాక గానీ వివాహం చేయడం లేదు. ఆ వయసులో ఉన్న వ్యక్తులు ఐఏఎస్ అధికారులుగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతున్నారు. వాళ్ల సంసారం చక్కదిద్దుకునే సామర్థ్యం ఉండదా? కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఏ సంసారానికీ కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం ఉండదు. తల్లిదండ్రుల అతి జోక్యం తగ్గితే వివాదాలు సద్దుమణుగుతాయి. సంసారం అనుభవాలతో నేర్చుకునే పాఠశాల. కొత్త మనిషి కుటుంబంలోకి వస్తే సర్దుబాటు కావడానికి సమయం ఇవ్వాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటే.. కొన్నాళ్లకు ఇద్దరి మధ్యా అనుబంధం ఏర్పడుతుంది. మా మధ్యవర్తిత్వం అవసరం రాదు.’
మళ్లీ.. కలిసుందాం రా!
విడాకులకు దరఖాస్తు చేసినవాళ్లు, విడిపోయి కొన్నేండ్లపాటు దూరమైన వాళ్లు ‘మేం కలుసుంటాం. మమ్మల్ని కలిపే బాధ్యత తీసుకోండి’ అంటూ వస్తున్నారు. జీవితానుభవం వల్ల మనిషి ఆలోచనలో పరిణతి వస్తుంది. విడిపోయి సాధించేదేమీ లేదని గ్రహిస్తున్నారు. ఇలాంటి వాళ్లను కలపడమే మా బాధ్యత. ఎవరి తరఫునా మేం వకాల్తా పుచ్చుకోం. ఇద్దరి బాధలూ విని, ఒక్కటి అయ్యేందుకు ఉన్న అవకాశాలేమిటో చూపిస్తాం. పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది తల్లిదండ్రులే! ఆ బాధ్యత నుంచి పారిపోవాలని అనుకోవడం తప్పు. గొడవలన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాలని చెబుతాం. 99 శాతం కేసుల్లో ఇద్దరినీ కలపడంలో విజయం సాధించాం. అది సాధ్యం కాని సందర్భంలో వాళ్లకు తగిన పరిష్కారం సూచించాం.