పర్యాటక ప్రియులకు షార్జా స్వాగతం పలుకుతున్నది. ఈ ఎడారి స్వర్గంలో మనిషి మేధస్సు మలిచిన అద్భుతాలు ఎన్నెన్నో దర్శనమిస్తాయి. అమ్యూజ్మెంట్ పార్క్‌లు, ఆకాశాన్నంటే హర్మ్యాలు, విలాసవంతమైన హోటళ్లు షార్జాను పర్యాటక నగరంగా నిల
బెట్టాయి. ఈ విహార నగరిలో రెయిన్ రూమ్ రుతుపవనాలతో సంబంధం లేకుండా వర్షాతిరేకాల్లో ముంచెత్తుతుంది. రెయిన్ పార్క్‌లు అంతటా ఉండేవే కానీ, ఈ మాత్రానికి షార్జాదాకా వెళ్లాలా? అంటారా! ఇక్కడో విశేషం ఉంది. ఈ రెయిన్ రూమ్‌లో కురిసే చిటపట చినుకుల్లో ఎంత సమయం నిల్చున్నా తడిసే ప్రసక్తి ఉండదు.
హోరుమనే శబ్దంతో కుండపోతగా వర్షం కురుస్తున్నా.. ఆ వర్షంలో నడిచినా, గెంతినా, చేతులెత్తి స్వాతి చినుకులకు స్వాగతం పలికినా.. వర్షాన్ని అనుభూతి చెందుతాం కానీ తడవకపోవడం వింతే కదా మరి! షార్జా వచ్చిన పర్యాటకులు రెయిన్ రూమ్ తలుపు తట్టకుండా తిరిగి వెళ్లరు. ఇక అల్ ముంతజా అమ్యూజ్మెంట్ పార్క్ అందాలు చూస్తుంటే గంటలు నిమిషాల్లా గడిచి పోతాయి. అల్ నూర్ ద్వీపంలో బటర్‌ఫ్లై హౌజ్ షార్జాలో మరో అద్భుతం. వేవేల వర్ణాల సీతాకోకచిలుకలను ఇక్కడ చూడొచ్చు. సముద్ర గర్భంలో నిర్మించిన షార్జా అక్వేరియంలోకి ప్రవేశిస్తే జలచరాల విన్యాసాలను ఎంతసేపైనా వీక్షించొచ్చు.
ఇస్లామిక్ నాగరికతను తెలియజేసే షార్జా మ్యూజియం అదనపు ఆకర్షణ. ఇలా మరెన్నో పర్యాటక కేంద్రాలు షార్జా నగరంలో యాత్రికులకు క్షణం తీరిక లేకుండా కనువిందు చేస్తాయి. ఎందుకు ఆలస్యం, షార్జా విహారానికి సిద్ధమవ్వండి. ఇసుక దిబ్బలపై విహార కేంద్రాలు చేసే మహేంద్ర జాలాన్ని చూసి ఆనందించండి. మరిన్ని వివరాలకు https://www.sharjahtourism.ae/వెబ్సైట్ సందర్శించండి.