Ranbir Kapoor | తమ సెలెబ్రిటీ హోదా పిల్లల స్వేచ్ఛకు అడ్డు కావొద్దని భావిస్తున్నారు బాలీవుడ్ కపుల్స్. బిడ్డల ప్రైవసీని కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నారు. ఇటీవల తమ పిల్లల ఫొటోలు తీయొద్దని సైఫ్, కరీనా జంట ఫొటోగ్రాఫర్లను, అభిమానులను కోరింది. ఈ జాబితాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కూడా చేరారు. ఈ దంపతుల గారాలపట్టి రాహ కపూర్ చిత్తరువులు కొన్నాళ్లుగా నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
ఓ ఫ్యామిలీ ఈవెంట్లో మొదటిసారి తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేశారు ఆలియా, రణ్‌బీర్. ఇక అప్పట్నుంచి ఆ చిన్నారి ఫొటోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. పైగా తమ ముద్దులపట్టి అల్లరి పనులను క్లిక్ మనిపించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేది ఆలియా. దీనివల్ల తమ కూతురి ప్రైవసీ దెబ్బతింటుందని భావించిన ఆమె.. గతంలో పోస్ట్ చేసిన ఫొటోలన్నీ డిలిట్ చేసింది.
అంతేకాదు, ఎక్కడైనా తాము కనిపిస్తే.. తమ బిడ్డను ఫొటో తీయొద్దని ఫొటోగ్రాఫర్లకు విజ్ఞప్తి చేసింది. అభిమానులను సైతం ఇదే అభ్యర్థించింది. ఇటీవల సైఫ్‌పై దాడి తర్వాత మీడియా కండ్లన్నీ కరీనా, సైఫ్ దంపతుల కొడుకులు తైమూర్, జహంగీర్లపై పడ్డాయి. వారి ఫొటోలు ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తమ బిడ్డల ప్రైవసీకి భంగం వాటిల్లనివ్వొద్దంటూ సైఫ్, కరీనా మీడియాను కోరారు. తాజాగా ఆలియా, రణ్‌బీర్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు.