కాలచక్రంలానే ఫ్యాషన్ చక్రం కూడా గిర్రున తిరుగుతూనే ఉంటుంది. కొత్త డిజైన్లు పాతవైపోతాయి. పాత డిజైన్లు కొత్త హంగులు అద్దుకుంటాయి. కొన్నిసార్లు పాతకొత్తలు కలిసి జుగల్బందీ చేస్తాయి. అక్షయ తృతీయ.. మహిళలకు ఆభరణాల వేడుక! ఆరునూరైనా మనసుకు నచ్చిన నగలనే ఎంచుకుంటారు. దీంతో తయారీదారులు మగువల అంతరంగాన్ని అర్థం చేసుకుని సరికొత్త కలెక్షన్లు సిద్ధం చేసుకుంటున్నారు.
ఒకప్పుడు నగలంటే బంగారం, వెండి మాత్రమే. కానీ ఇప్పుడు ప్లాటినమ్, ఆక్సిడైజ్డ్ సిల్వర్‌తోపాటు ఇతర లోహాలను కూడా ఆభరణాల తయారీలో వాడుతున్నారు. దీంతో నగలు బంగారు రంగుతోపాటు, రకరకాల వర్ణాలలో తళుకులీనుతున్నాయి. అందమైన పెయింటింగ్స్‌తో కూడిన నగలు కూడా ఆధునిక ఫ్యాషన్లకు చక్కగా నప్పుతున్నాయి.
ఒకవైపు పెద్దపెద్ద ఆభరణాలకు గిరాకీ పెరిగింది. ఇది ‘మాగ్జిమలిజం’కు తార్కాణం. మరోవైపు ‘మినిమలిస్టులు’ పలుచని నగలను ఇష్టపడుతున్నారు. వజ్రాల పట్ల మక్కువ అలానే ఉంది. రంగురాళ్లను అలంకరించుకునే వారూ పెరిగారు. సమకాలీన డిజైన్లను అభిమానించే వర్గం ఉంది. నిజాం, రాజస్థానీ తదితర అంతఃపుర ఆభరణాలను కోరుకునే వర్గమూ ఒకటుంది. లోకో భిన్న రుచిః అంటే ఇదేనేమో.
కళ్లు చెదిరే భారీ డిజైన్లతో టెంపుల్ జువెలరీ ఎప్పటిలానే మగువలను ఆకట్టుకుంటున్నది. ఆలయాల్లో అమ్మవారికి అలంకరించే నిండైన డిజైన్లతో వీటిని తయారుచేస్తారు. రాళ్లు, పచ్చలు, కెంపులు, వజ్రాల మేళవింపుతో ఏ మహారాణి కోసమో.. చేయి తిరిగిన స్వర్ణకారుడు సిద్ధం చేసినట్టు అనిపిస్తాయి. రామ పరివారం, వినాయకుడు, లక్ష్మీదేవి ప్రతిబింబాలతోనూ.. గోపురాలు, మంటపాల రూపాలతోనూ అలరారుతుంటాయి. ‘తళుకుబెళుకు రాళ్లు తట్టెడేల?’అన్నట్టు ఒక్క నగ చాలు మగువను మెరిపించడానికి!
బంగారు నగలంటేనే పెద్ద బడ్జెట్. అయితే, ఆధునిక డిజైన్లకు మాత్రం ఎక్కువగా ఖర్చు చేయనక్కర్లేదు. తక్కువ బంగారంతోనే భారీగా కనిపించే నగలను డిజైన్ చేస్తున్నారు. పాపిటబిళ్ల నుంచి వడ్డాణాల వరకూ లైట్ వెయిట్లో దొరుకుతున్నాయి.
బంగారు కాసులను పొందికగా జోడించి రూపొందించినవే కాసుల నగలు. తరాలుగా మగువల మొదటి ఎంపిక ఇవే. ఆధునిక హంగులద్ది రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు. కాసుల మీద దేవుళ్లు, పక్షులు, జంతువుల రూపాలను ముద్రిస్తూ మరింత అందాన్ని చేకూరుస్తున్నారు. కాసుల గాజులు, కమ్మలు, చోకర్లు, పట్టీలు కూడా వచ్చేశాయి.