Web Series | మొఘల్ దర్బార్ అంటేనే రాజకీయ చదరంగపు బల్ల. కథంతా సింహాసనం చుట్టూ నడుస్తూ ఉంటుంది. పీఠం వదలని వయోధికులు, అధికారం కోసం ఆశపడే వృద్ధాప్య ఛాయలున్న యువరాజులు, రెండుతరాల వైపూ గుర్రుమంటూ చూసే మూడోతరం వారసులు. మధ్యలో ప్రేమలు, ప్రతీకారాలు. తాజ్మహల్ నేపథ్యంగా సాగిన ఆ నాటకీయ పరిణామాల్ని ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’ వెబ్ సిరీస్లో ఉత్కంఠ భరితంగా చూపే ప్రయత్నం చేశారు దర్శకుడు.
హైదరాబాద్ అందగత్తె అదితీరావ్ హైదరీ.. అనార్కలి పాత్ర పోషించింది. ‘నాకు చరిత్ర అంటే ఇష్టం. ఏదైనా చారిత్రక పాత్ర పోషించాలనే కల ఇప్పటికి నిజమైంది. మొఘల్-ఎ-ఆజంలో మధుబాలలా పేరు తెచ్చుకోవాలని నా కోరిక. ఎంతో ఇష్టంగా, కాస్తంత భయంగా ఈ పాత్ర చేశాను’ అంటున్నది అదితి. వనపర్తి సంస్థానాధీశుల కుటుంబం నుంచి వచ్చిన ఈ దొరసాని అనార్కలిగా అందరి హృదయాలనూ కొల్లగొట్టడం ఖాయం. ‘జీ ఫైవ్’ ఓటీటీలో వీక్షించవచ్చు.