Actress Sangeetha | ‘ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా..’ డైలాగ్‌తో దొరికిన ఒక్క చాన్స్‌తో ఎప్పటికీ గుర్తుండిపోయే నటి అనిపించుకున్నారు నటి సంగీత. ‘ఖడ్గం’తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తొలి ఇన్నింగ్స్‌లో మరపురాని పాత్రలెన్నో పోషించారు. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగీత ఈ ఇరవై ఏండ్లలో తాను గమనించిన సంగతులు, సినిమా కబుర్లు, బుల్లితెర ముచ్చట్లు, కుటుంబ విశేషాలు ‘జిందగీ’తో పంచుకున్నారు.
మీరు మంచి డ్యాన్సర్ కదా! జీ తెలుగు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’కు జడ్జిగా రావడం ఎలా ఉంది?
చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రియాలిటీ షోల ద్వారా.. మళ్లీ నా ఇంటికి తిరిగొచ్చిన అనుభూతి కలుగుతున్నది. చిన్నప్పుడే నేను మంచి క్లాసికల్ డ్యాన్సర్‌ని. తర్వాత అన్ని రకాల నృత్యాలూ నేర్చుకున్నా.
ఈ షోలో పోటీదారుల నృత్య విన్యాసాలు చూస్తుంటే ఎలా అనిపిస్తున్నది?
మిగతా రియాలిటీ షోల్లో ఇంత కసి, తెగువ కనిపించదు. గెలవాలన్న తపనతో పోటీదారులు చేస్తున్న ఫీట్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఎలాగైనా నిరూపించుకోవాలన్న వాళ్ల తపనను జడ్జిగా దగ్గర నుంచీ చూస్తున్నాను.
మీరు రోజూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారా?
మరీ రెగ్యులర్‌గా చేయడం లేదు. ఈ డ్యాన్స్ షో చూస్తుంటే నాకూ మునుపటిలా నృత్యం చేయాలనే పట్టుదల పెరుగుతున్నది. షో పూర్తయ్యేనాటికి డ్యాన్స్ పరంగా పాత సంగీతను చూస్తారు.
మీనా, మహేశ్వరి, సంఘవి, రంభ, మీరు.. ఇటీవల ఓ చోట కలుసుకున్నట్లున్నారు?
అవును.. మా ఇంట్లోనే చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. మేమంతా చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులం. అయితే, భర్త చనిపోయిన తర్వాత.. మీనాలో ఒంటరితనాన్ని గుర్తించా. తనను తాను కోల్పోతుందేమోనని భయమేసింది. ఎలాగైనా తనను సాధారణ స్థితికి తీసుకురావాలనుకున్నా. వెంటనే మహేశ్వరి, సంఘవి, రంభ, మీనా.. అందర్నీ సకుటుంబంగా మా ఇంటికి ఆహ్వానించా. నా కోరిక మేరకు విదేశాల్లో ఉన్నవాళ్లు సైతం వచ్చారు. రెండురోజులు సరదాగా గడిపాం. కష్టసుఖాలు పంచుకున్నాం. మీనా మాతో బాగా కలిసిపోయింది. మా పిల్లలంతా కలిసింది తొలిసారే అయినా, ఇట్టే కలిసిపోయారు.
మీ కూతురు శిహివ్య గురించి చెప్పండి? తను అమ్మ కూచా.. నాన్న కూచా?
మా శిహివ్య తెలివైన అమ్మాయి. ఇంట్లో తన అల్లరి మామూలుగా ఉండదు. దానికి మా ఆయన క్రిష్ తోడైతే నాకు చుక్కలే. అమ్మకూచినని నాకు తెలిసిన వాళ్లతో.. నాన్నకూచినని క్రిష్‌కు తెలిసిన వాళ్లతో తెలివిగా చెబుతుంది.
శిహివ్య తండ్రిలా పాటలు పాడుతుందా?
తను బాగా చదువుతుంది. అన్ని రంగాల్లో ఆసక్తి ఉంది. పాటలు పాడుతుంది. డ్యాన్స్ చేస్తుంది. ఒక్కోసారి తన యాక్టింగ్ చూసి.. మేం ఆశ్చర్యపోతాం. ప్రత్యేకంగా సంగీతం అంటూ ఏమీ నేర్పించడం లేదు. ముందు చదువు అనుకున్నాం. ఆటలు కూడా బాగా ఆడుతుంది. తన ఆసక్తిని గమనించి బ్యాడ్మింటన్ నేర్పిస్తున్నాం. ఆటల్లో చురుగ్గా ఉంటే.. ఆరోగ్యంగా ఉంటారని నా ఉద్దేశం.
మీ అమ్మవల్ల యాక్టర్ అయ్యారు మీరు. మీ ఇష్టానికే వదిలేస్తే.. ఏ రంగాన్ని ఎంచుకునేవారు?
నాకు మొదటి నుంచీ సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. మా తాతయ్య పెద్ద నిర్మాత. అమ్మకు యాక్టర్ అవ్వాలనే కోరిక. అయితే కొన్ని కారణాలవల్ల అది జరగలేదు. పదోతరగతి పూర్తికాగానే అమ్మకోసమే హీరోయిన్గా మారాను. నాకు విదేశాల్లో బాగా చదువుకొని ఉద్యోగమో, వ్యాపారమో చేయాలని ఉండేది. నటిని కాకపోయి ఉంటే, ఆ రెండిటిలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకునేదాన్నేమో! అదే జరిగి ఉంటే .. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను కోల్పోయేదాన్నేమో.
పోషించాల్సిన పాత్రకు సంబంధించి ఏమైనా అధ్యయనం చేస్తారా?
కచ్చితంగా చేస్తాను. అప్పుడే ఆ పాత్రలో సహజత్వం ఉట్టిపడుతుంది. ప్రస్తుతం ‘మసూద’ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నా. ఆ పాత్ర గురించి కూడా రీసెర్చ్ చేశాను. తెలుగులో మరో కొత్త సినిమాకు సంతకం చేశాను. అందులో ప్రతినాయిక పాత్ర పోషిస్తున్నాను. నా సెకండ్ ఇన్నింగ్స్.. నన్ను నేను నిరూపించుకునే సమయం. ఓ నటిగా ఎలాంటి షేడ్స్ అయినా.. వెండితెరపై చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. మంచికథ కోసం ఎదురుచూస్తున్నా.
మీ లైఫ్‌లో ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ మూమెంట్?
డెలివరీ తర్వాత.. తొలిసారిగా బిడ్డను చేతుల్లోకి తీసుకున్న క్షణం నా కండ్లముందు ఎప్పటికీ కదలాడుతూనే ఉంటుంది. మాతృత్వపు మాధుర్యం ప్రతి తల్లికీ మరపురానిదే.
ఖడ్గం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్ర క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటుంది. ఈ ఇరవై ఏండ్ల ప్రయాణంలో అలాంటి పరిస్థితులు ఏమైనా గమనించారా?
ఆ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేది కాబట్టి, సీతామహాలక్ష్మి పాత్ర పుట్టుకొచ్చింది. ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే.. ముందు దాని గురించి ప్రజలు తెలుసుకోవాలి. బాధితుల తరఫున ఆ పాత్ర ద్వారా నా గొంతుక వినిపించడం గొప్పగా అనిపించింది. ఈ 20 ఏండ్ల ప్రయాణంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడెవ్వరూ భయపడటం లేదు. సమస్యను నిర్భయంగా చెబుతున్నారు. ఇలాంటి తెగువ ప్రతి ఒక్కరినుంచీ రావాలి.
గతంలో మీ బ్యాచ్ అల్లరి ఎలా ఉండేది?
ఓ.. చాలా అల్లరి చేసేవాళ్లం. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలనుకున్నా వెళ్లిపోయేవాళ్లం. విదేశాలకూ ప్రయాణం అయ్యేవాళ్లం. సినిమాలకైతే లెక్కేలేదు. అయితే, ఎవరో ఒకరు షూటింగ్లో ఉండేవారు. ఇక మేమంతా ఓ దగ్గర కలిశామంటే ఆ అల్లరికి ఆకాశమే హద్దు. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. మనసుకు నచ్చినట్లుగా గడిపేవాళ్లం.
తెలుగింటి ఆడబిడ్డగానే మిమ్మల్ని చూస్తున్నారు ప్రేక్షకులు. మీరెలా ఫీలవుతున్నారు?
అది నా అదృష్టం. వెండితెరమీద ఆదరించారు. ఇప్పుడు బుల్లితెరమీదా ఆదరిస్తున్నారు. చేసినవి కొన్ని సినిమాలే అయినా.. నన్ను నేటికీ గుండెల్లో దాచుకున్నారు. ఆ ప్రేమకు నేను ఫిదా.
చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు.. అప్పటికీ ఇప్పటికీ నగరం ఎలా ఉందనిపిస్తుంది?
ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తుంటే ఏదో ఫారిన్‌కు వచ్చినట్లే ఉంటున్నది. చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. మౌలిక వసతులు చాలా మెరుగయ్యాయి. సాంకేతికంగా బెస్ట్ సిటీగా ఉంది. ఇదొక కూల్ అండ్ సేఫ్ సిటీ. నా కూతురికి ఎంతో ఇష్టమైన నగరం హైదరాబాద్.
విజయ్ మంచి స్నేహితుడు: దళపతి విజయ్ నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. ఇద్దరం చాలా మంచి మిత్రులం. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమాలో ఇద్దరం తొలిసారిగా కలిసి నటిస్తున్నాం. మా అందరిదీ ఒకే ఏజ్ గ్రూప్. ప్రతిరోజూ షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నాం. శరత్‌కుమార్‌గారు, జయసుధగారు, శ్రీకాంత్ అన్నయ్య, శ్యామ్ గారు.. మేమంతా లంచ్ టైమ్‌లో కలిస్తే.. ఓ గెట్ టుగెదర్ పార్టీలా ఉంటుంది.
…? రవికుమార్ తోటపల్లి
అతనికి ఇతరుల శృంగార జీవితంపైనే ఆసక్తి.. బ్రహ్మస్త్ర ప్రొడ్యూసర్, డైరెక్టర్‌పై కంగనా ఫైర్