పరిచయం అక్కర్లేని పేరు రెజీనా. చేసింది కొన్ని సినిమాలే అయినా, దాదాపుగా అన్నీ హిట్టే! ‘ఆచార్య’లో మెగాసార్ట్తో స్టెప్పులేసిన ఈ అమ్మడు తాజాగా, అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రం సారాభాయ్ జీవితకథతో ముడిపడిన వెబ్‌సీరిస్‌లో ఆయన భార్య మృణాళిని పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘మృణాళిని సారాభాయ్ పాత్ర ఏ నటికి అయినా సవాలే. ఎందుకంటే ఆమె గొప్ప మహిళ. భారతీయ సంప్రదాయ నృత్యానికి మృణాళిని సేవ అపారం. నేటి తరానికీ తెలిసిన వ్యక్తి. అందుకే సంప్రదించగానే కాదనలేకపోయాను. ఆ మరుక్షణం నుంచీ నన్ను నేను మృణాళినిగా ఊహించుకున్నాను. భరతనాట్య గురువుగా ఆమె హావభావాలు గమనించాను. ముంబై, జైపూర్‌లోని నాట్య గురువుల దగ్గర భరతనాట్యం నేర్చుకున్నా. కరోనా కారణంగా గురువులు అందుబాటులో లేని సమయంలో జూమ్ మీటింగ్‌లో ప్రాక్టీస్ చేసేదాన్ని. వెబ్ సీరిస్ చూసిన వాళ్లంతా ‘మృణాళిని సారాభాయ్ మళ్లీ పుట్టింది’ అని మెచ్చుకుంటున్నారు. ఓ నటిగా ఇంతకన్నా సంతృప్తి ఏం ఉంటుంది? ‘రాకెట్ బాయ్స్’ ట్రైలర్‌కు కూడా యూట్యూబ్‌లో అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కొత్త కథలు, ఇతివృత్తాలతో పాటు పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే ఏ సినిమా అయినా అంగీకరిస్తున్నా. మన చిత్రాల్లో మహిళల కోసం చాలెంజింగ్ రోల్స్ సృష్టిస్తున్నారు. ఇదొక శుభపరిణామం. కఠోర శ్రమ తర్వాత వచ్చే ఫలితం ఎప్పుడూ మధురంగానే ఉంటుంది. ఇప్పుడా అనుభూతిని ఆస్వాదిస్తున్నా.