యాసిడ్ మంటల్లో.. ఆమె అందమైన ముఖం కాలిపోయింది. లేలేత చెక్కిళ్లను, కోటేరు లాంటి ముక్కు, పదాలు పలికే పెదాలను యాసిడ్ కాల్చివేసింది. ఆ దాడి ఆమె అందమైన రూపాన్నేకాదు ఆనందమయ జీవితాన్నీ అంధకారం చేసింది.స్నేహితుల సూటిపోటి మాటలకు బడికి దూరమైంది. కానీ, చదువుకు దూరం కాలేదు.యాసిడ్ తన రూపాన్ని కాల్చి వేసినా గొంతును తాకలేకపోయింది. ఆ గాత్రాన్ని ఆధారంగా చేసుకొని తన జీవితాన్ని సుస్వర భరితం చేసుకుంది. హిందుస్థానీ సంగీతంలో అనన్య సామాన్యమైన ప్రతిభ చాటింది. ‘కాశీ కీ లత’గా గుర్తింపు పొందిన మంగళా కపూర్ జీవిత గాథ వెండితెరకెక్కింది. పార్లమెంట్ గౌరవాన్ని, పద్మశ్రీ పురస్కారాన్ని గెలుచుకున్న మంగళ స్వరరాగ గంగా ప్రవాహమిది!
తన ఈడు పిల్లల్లాగే మంగళ ఆడుతూ, పాడుతూ ఉండేది. తనకు వారణాసి ఇరుకు వీధులు, పెద్దపెద్ద ఆలయాలు, గంగా నది తప్ప మరో ప్రపంచం తెలియదు. వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన బెనారస్‌లో మంగళ వాళ్ల నాన్న వస్త్ర వ్యాపారం చేస్తుండేవాడు. ఆ వ్యాపార గొడవల్లో ఓ రోజు అర్ధరాత్రి పూట ఒక ముఠా వాళ్ల ఇంటిపై దాడి చేసింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే.. క్షణాల్లో ఆమె ముఖం కాలిపోయింది. ఆ తర్వాత తెల్లవారింది కానీ, మంగళ జీవితంలోకి వెలుగు రాలేదు. అది యాసిడ్ దాడి అని కొన్ని రోజులకు ఆమెకు తెలిసింది. 1965లో జరిగిన ఈ ఘటనలో గాయపడిన మంగళ మనదేశంలో తొలి యాసిడ్ దాడి బాధితురాలిగా మిగిలింది.
ఆరేండ్లు నరకం
దవాఖానలో కొంతకాలం చికిత్స పొందిన మంగళ మృత్యు ముఖం నుంచి బయటపడింది. మళ్లీ ఇంటి గడప తొక్కింది. కానీ, నిన్నటి నవ్వులు లేవు. ఆనందాలు లేవు. ఉన్నదల్లా దుఃఖమే. అయినా సరే, బతకాలి. బతకడం కోసం గెలవాలి. గెలవడం కోసం బతకాలని తండ్రి ఆమెకు ఆశలు కల్పించాడు. బుగ్గలు, చెవులు, మెడ, ఛాతీపై యాసిడ్ చేసిన గాయాలకు సర్జరీలు చేశారు. 37 శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. దీనికి ఆపరేషన్ థియేటర్లో ఘోరమైన హింసను భరించి కొత్త రూపు కోసం ఆరేండ్లు నరకం అనుభవించింది. పూర్వపు అందం రాకపోయినా సాధారణ పనులకు దేహం సహకరిస్తే చాలనుకుంది.
ఒంటరిగా చీకటిలో…
మంగళకు చదువంటే ప్రాణం. బడికి వెళ్తే తనను చూసి పిల్లలు దూరంగా జరిగేవాళ్లు. కొంతమంది భయపడేవాళ్లు. ఇంకొంతమంది ముక్కులేదని దెప్పి పొడిచేవాళ్లు. యాసిడ్ గాయల కంటే సానుభూతి లేని సాటి మనుషుల మాటలే ఆమె మనసుని మరింతగా బాధించాయి. కాకుల్లా పొడిచే మనుషుల మధ్య సంతోషంగా ఉండలేక ఆమె ఇంటికే పరిమితమైపోయింది. బయటికి పోతే భయంతో దూరంగా జరిగిపోయే జనం. బడికి వెళ్తే ఎగతాళి చేసే స్నేహితులు. ఉల్లాసవంతమైన ఆటల్లేవు. స్నేహితుల ముచ్చట్లు లేవు. స్నేహంలేదు. సానుభూతి లేదు. ఉన్నదల్లా ఒంటరితనం, దుఃఖం. కురూపం. స్నేహాల్లేని బాల్యం. ఆటల్లేని జీవితం. బడికి దూరంగా, ఇంట్లో ఒంటరిగా ఉండే ఆమె తన శరీరాన్ని తానే అసహ్యించుకుని ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇలాంటి సందర్భాల్లో మంగళకు ఆమె తండ్రి ధైర్యం నూరిపోసేవాడు. తన బిడ్డను ధీరగా తీర్చిదిద్దాడు. తండ్రి ప్రోత్సాహంతో ఉత్సాహం కూడగట్టుకునేది మంగళ.
సంగీతమే స్నేహమై..
మంగళకు చదువు అంటే ఎంత ఇష్టమో. సంగీతం కూడా అంతే ప్రాణం. తన ముఖాన్ని, మెడ, ఛాతీ భాగాన్ని యాసిడ్ మాడ్చేసింది. కానీ, ఆమె గొంతుని గాయపరచలేకపోయింది. నేర్చుకోవాలనే తృష్ణ ఆమెను సంగీత సాధనకు పురిగొల్పింది. ఇంటిపట్టునే గాత్ర సంగీత సాధన మొదలుపెట్టింది. గ్వాలియర్ ఘరానా హిందుస్థానీ సంగీతం నేర్చుకుంది. మరోవైపు దూరవిద్యా విధానంలో చదువు మొదలుపెట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో అడుగుపెట్టి, బ్యాచ్‌లర్ ఆఫ్ మ్యూజిక్‌లో చేరింది. తర్వాత మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ కోర్సు చేసింది. ఈ రెండు కోర్సుల్లోనూ బంగారు పతకాలు సాధించి.. సంగీతంలో రాటుదేలింది. గాయాలు మానుతూ, కొత్త రూపులోకి వస్తున్న తరుణంలోనే ఆమె స్వరం కూడా ఉచ్ఛస్థితికి చేరుకుంది. బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి సంగీత కళల్లో పీహెచ్డీ పూర్తి చేసి, డాక్టరేట్ డిగ్రీ అందుకుంది.
గెలిచిన రాగం
ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, బాధితులకు స్ఫూర్తినిస్తూ మంగళ ఓ రోజు వార్తల్లో నిలిచింది. తొలి యాసిడ్ బాధితురాలిగానే బయటి ప్రపంచానికి తెలిసిన మంగళ బెనారస్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికైంది. వారణాసిలోని ప్రసిద్ధ మహిళా మహావిద్యాలయలో సంగీత కళల విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టింది. నలుగురిలోకి వెళ్తే ప్రత్యేకంగా చూస్తారని, తనని దూరం పెడతారనే భయం, ఆలోచన లేకుండా పట్టుదలతో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. తరగతి గదిలో రాగ, తాళ గతులతో ఆమె గమనం మూడు దశాబ్దాలు విజయవంతంగా సాగిపోయింది. ఆమె గాన మాధుర్యంతో తాను తీసుకునే తరగతి గదులే కాదు మహిళా మహావిద్యాలయ ప్రాంగణమంతా ఓలలాడేది. అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది, పదవీ విరమణ చేసింది.
కాశీ కీ లత
తరగతి గదుల్లోనే కాదు గాయపడ్డ హృదయ రాగాన్ని అనేక వేదికలపై మంగళ వినిపించింది. విద్యార్థులకు సంగీత పాఠాలు చెబుతూనే కచేరీల్లో హిందుస్థానీ రాగాలాపన చేసింది. మొదట్లో తన ముఖంపై ఉండే మచ్చలు, పోరాట జీవితం ఎంతోమందికి ఆసక్తి కలిగించింది. ఆ కారణంగానే కచేరీలకు వచ్చేవారు. తర్వాత ఆ మచ్చలు మరచిపోయి ఆమె గాత్రం నుంచి జాలువారే రాగాలలో లీనమైపోయేవారు. తర్వాత రోజుల్లో ఆ స్వరానికి అభిమానులయ్యారు. ఆమె కచేరీ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేవారు. వారణాసిలో సంగీతానికి ఎంత ఆదరణ ఉండేదో, సంగీత ప్రియుల్లో మంగళకు అంతటి ఆదరణ ఉంది. తరంగ్ సంస్థ మంగళను ‘కాశీ కీ లత’ బిరుదుతో గౌరవించింది. కాశీ ప్రజలే కాదు హిందుస్థానీ సంగీతాభిమానులూ మంగళను కాశీ కీ లత పేరుతోనే పిలుస్తుంటారు. విధి ఆడిన వింత నాటకాన్ని… తన ప్రతిభతో ఎదుర్కొంది మంగళ.

వరించి వచ్చిన పద్మశ్రీ
మంగళ స్వర విజయాన్ని గుర్తించిన రాజ్యసభ ‘రోల్ మోడల్ అవార్డ్’ గౌరవించింది. ఆమె జీవన పోరాటానికి వచ్చిన గుర్తింపు కాదిది! మంగళ స్వరమాధుర్యానికి, సాధించిన ఘనతలకు లభించిన గౌరవం. పదేళ్ల క్రితం మంగళ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఎముకలు విరిగి మరికొంత జీవితం ఇంటికే పరిమితమైంది. ఈ గాయాలను కూడా మాన్పుకుని మళ్లీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈసారి కేవలం గళంతో మాత్రమే కాదు.. కలంతోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. తన జీవిత పోరాటంతోపాటు సంగీతంలో తన ప్రయాణాన్ని చెబుతూ హిందీలో ‘సీరత్’ ఆవిష్కరించింది. ఈ పుస్తకంలో యాసిడ్ దాడి తన దేహంపై చేసిన గాయంతోపాటు తన మనసుకు చేసిన గాయాన్నీ వివరించింది. ఫీనిక్స్ పక్షిలా మళ్లీ మళ్లీ ఎగురుతూ కొత్త జీవితం కోసం చేసిన పోరాట క్రమాన్ని ఈ పుస్తకంలో రాసుకొచ్చింది. జీవితంలో బతకాలనే ఆశను పెంచుకుంటూ తనను తాను ఎలా తీర్చిదిద్దుకుందో ఇందులో ఆవిష్కరించింది. ఆమె జీవితం స్ఫూర్తిగా ‘మంగళ’ పేరుతో మరాఠీలో ఓ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. అదే జనవరిలో సంగీత, కళారంగాల్లో పద్మశ్రీకి ఎంపికై మరోమారు వార్తల్లో నిలిచింది.
వైకల్యం తన ఆశలకు అడ్డుకట్ట
వేయకూడదని కోరుకున్నట్టే.. పేదరికం కూడా కళాకారుల్ని కళకు దూరం చేయకూడదని మంగళ కోరుకుంటున్నది. ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా తన స్వర ప్రస్థానం కొనసాగిస్తున్నది. ఇంటిదగ్గరే పేద పిల్లలకు ఉచితంగా సంగీత పాఠాలు చెబుతూ పాటలతో సావాసం చేస్తూనే ఉంది. ప్రతి రోజూ తన చుట్టూ చేరి సంగీత పాఠాలు నేర్చుకునే పిల్లలతో కలిసి ఆలాపన చేస్తూ ఆనందమయ జీవితాన్ని ఆస్వాదిస్తున్నది.
…? నాగవర్ధన్ రాయల