Jackky bhagnani | బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తన కుటుంబ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్టైన్మెంట్పై వస్తున్న లీగల్ వివాదాల వార్తలకు స్పష్టత ఇచ్చారు. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ తమ సంస్థపై, అలాగే తన తండ్రి వాషు భగ్నానీపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోందంటూ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన పూర్తిగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. గత కొద్ది రోజులుగా పీవీఆర్ ఐనాక్స్ మరియు పూజా ఎంటర్టైన్మెంట్ మధ్య ఆర్థిక వివాదం నడుస్తోందని వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ‘మిషన్ రాణిగంజ్’, ‘గణపత్’, ‘బడే మియాన్ ఛోటే మియాన్’ చిత్రాల థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాల విషయంలో భారీ బకాయిలు ఉన్నాయని, దాదాపు రూ.50 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయనే ప్రచారం జరిగింది.
ఈ వివాద పరిష్కారం కోసం ముంబైలోని కొన్ని విలువైన ఆస్తుల విషయంలో కూడా చర్చలు జరిగాయని, సమస్య పరిష్కారం కాకపోతే కోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ కూడా ఖండించింది. భగ్నానీ కుటుంబంతో తమకు ఎన్నో సంవత్సరాలుగా సత్సంబంధాలు ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని పేర్కొంది. వ్యాపార పరమైన అంశాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకునే విషయాలని, వాటిని బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాగే ఈ వ్యవహారాలను జాకీ భగ్నానీ ఎంతో వృత్తిపరమైన నిబద్ధతతో నిర్వహిస్తున్నారని ప్రశంసించింది.
ఇదిలా ఉండగా, పూజా ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం మరో కీలక న్యాయపోరాటంతో కూడా వార్తల్లో నిలిచింది. దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ హక్కుల వివాదంపై సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తమ 1999 సూపర్ హిట్ చిత్రం ‘బీవీ నెం.1’ లోని ప్రసిద్ధ గీతాలు ‘చునరీ చునరీ’, ‘ఇష్క్ సోనా హై’ పాటలను సరైన అనుమతులు లేకుండా కొత్త సినిమాలో వినియోగించారని ఆరోపిస్తూ టిప్స్ ఇండస్ట్రీస్, నిర్మాత రమేష్ తౌరానీ, దర్శకుడు డేవిడ్ ధావన్‌లపై రూ.400 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేసింది. వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి సమయంలో తప్పుడు వార్తలతో తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయవద్దని జాకీ భగ్నానీ విజ్ఞప్తి చేశారు. ఏ వార్తనైనా ప్రచురించే ముందు దాని వాస్తవాలను ధృవీకరించాలని మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఆయన కోరారు.