కరోనా మహమ్మారి.. అన్ని రంగాలతోపాటు సినీ పరిశ్రమనూ తీవ్రంగా దెబ్బతీసింది. దాని ప్రభావం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ఖాన్పైనా పడింది. ఎంతలా అంటే.. ఒకానొక దశలో సినీరంగాన్ని వదిలేసుకోవాలన్న ఆలోచనకు వచ్చాడట ఆమిర్. ఈ విషయాన్ని ఆయన కూతురు ఇరా ఖాన్ ఇటీవల బయటపెట్టింది. ఒక ఇంగ్లిష్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘కరోనా వల్ల అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. అదే సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. అప్పుడే నాన్న కూడా సినీ రంగాన్ని వదిలేయాన్న ఆలోచన చేశారు. అయితే, ఇప్పుడే అంతటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని మాకు అనిపించింది. అదే విషయాన్ని ఆయనతో పంచుకున్నాం. కరోనా రోజులను వేరే కోణంలో చూడాలనీ, కెరీర్‌కు సంబంధించిన విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దనీ చెప్పాం. కొన్ని రోజులపాటు అన్నిటినీ పక్కన పెట్టి.. కాస్త చిల్ అవ్వమని సలహా ఇచ్చాం. దాంతో ఆయన మనసు మార్చుకున్నారు. కెరీర్ గురించిన ఆలోచనలను వదిలేసి.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. క్రమంగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు’ అని చెప్పుకొచ్చింది ఇరా ఖాన్. కరోనా తర్వాత ఆమిర్‌ఖాన్ ఒకటి రెండు సినిమాల్లో గెస్ట్ రోల్స్ మాత్రమే చేశాడు. 2022లో ‘లాల్‌సింగ్ చద్దా’తో పూర్తిస్థాయిలో నటించాడు. ప్రస్తుతం సితారే జమీన్పర్, గజినీ సీక్వెల్ చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉన్నాడు.