ఏ వంటింట్లో చూసినా.. నల్లరంగు వంట సామాన్లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా గరిటెలు, వడ్డించే ఉపకరణాలన్నీ ‘బ్లాక్ ప్లాస్టిక్’తో చేసినవే కనిపిస్తున్నాయి. అమెరికా, నెదర్లాండ్స్‌లోని పరిశోధకులు.. ‘బ్లాక్ ప్లాస్టిక్’ వంట సామాగ్రిపై ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. ఆ వివరాలను ‘కెమోస్పియర్ జర్నల్’ ప్రచురించింది.
సర్వేలో భాగంగా 200 కన్నా ఎక్కువ బ్లాక్ ప్లాస్టిక్ ఉత్పత్తులను పరీక్షించారు. వీటిలో సుషీ ట్రేలు, గరిటెలు, టేక్-అవుట్ కంటైనర్లతోపాటు పిల్లలు ఆడుకునే బొమ్మలు, పూసల నెక్లెస్‌లు వంటివీ ఉన్నాయి. అయితే, ఈ వస్తువులలో 85 శాతం బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్, ఆర్గానో ఫాస్పేట్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ విష రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడంతోపాటు హార్మోన్లను నియంత్రించే ఎండోక్రైన్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయని చెబుతున్నారు. ఈ సామగ్రిని ఎక్కువగా వినియోగించే వ్యక్తులు క్యాన్సర్ బారినపడే ప్రమాదం మూడురెట్లు అధికమని తేల్చారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ నుంచి తయారైన బొమ్మలు కూడా అంతే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిచెన్‌లో ఉపయోగించే నాన్స్టిక్తోపాటు బ్లాక్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల ఒక మనిషి శరీరంలోకి సగటును 34,700 పీపీఎం విషరసాయనాలు చేరుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. వీటి కారణంగా క్యాన్సర్ ప్రమాదం, పునరుత్పత్తి సమస్యలు, నరాలకు సంబంధించిన వ్యాధులతోపాటు ఇతర హార్మోన్లపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి బదులుగా గాజు, స్టెయిన్లెస్ స్టీల్ లాంటి ప్రత్యామ్నాయాలను వాడుకోవాలని సూచిస్తున్నారు.