శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 30, 2020 , 00:44:28

హంసలు-తాబేలు

హంసలు-తాబేలు

పూర్వం ఒక కొలనులో ‘కంబుగ్రీవం’ అనే తాబేలూ, ‘వికటం -సంకటం’ అనే రెండు హంసలూ ఎంతో స్నేహంగా ఉండేవి. ఎండాకాలం సమీపించింది. హంసలు తాబేలుతో ‘మిత్రమా! ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతున్నది. కాబట్టి మేము వేరే సరస్సుకు పోవాలనుకుంటున్నాం’ అని చెప్పాయి. తాబేలు బాధతో ‘అదేంటి , ఇన్నాళ్లూ మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా వదిలి మీ దారిన మీరు వెళ్ళిపోవడం ధర్మమేనా? ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్లండి’ అని బతిమాలింది. హంసలు ఒక ఉపాయం ఆలోచించి, ఒక కర్రను తెచ్చాయి. తాబేలుతో ‘మిత్రమా! నీవు ఈ కర్రను నోటితో కరుచుకొని పట్టుకో. మేమిద్దరం చెరొక కొననూ మా ముక్కులతో పట్టుకొని పైకి ఎగురుతాం. మాతోపాటు ఆకాశంలో పయనించి మరొక సరస్సుకు చేరుకోవచ్చు. అప్పటి వరకూ నోరు తెరవొద్దు’ అని చెప్పాయి. అందుకు తాబేలు ‘అలాగే’ అని సంతోషంగా చెప్పింది. బయలుదేరే ముందు హంసలు తాబేలుతో ‘మిత్రమా! మార్గ మధ్యంలో ఎన్నో పల్లెలు, పట్నాలు వస్తాయి. ఆకాశంలో వెళుతున్న మనల్ని చూసి జనం గోల చేస్తారు, పిల్లలు కేరింతలు కొడతారు. నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. నీవు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నోరు తెరవవద్దు. తెరిచావో  కిందపడి చచ్చిపోతావు’ అని మరొకమారు గుర్తుచేసాయి.  ‘మీ హెచ్చరికలను తప్పక పాటిస్తాను’ అని తాబేలు కర్రను నోటితో గట్టిగా పట్టుకుంది. హంసలు  ఆకాశానికి ఎగిరాయి. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వచ్చింది. ఈ వింతను చూసి పిల్లలూ, పెద్దలూ  అరిచి గోల చేయడం మొదలు పెట్టారు. కొందరు ఈలలు వేస్తున్నారు. తాబేలు ఆకాశంలో ఎగురుతున్నదంటూ హేళన చేయసాగారు. మరికొందరు వెంటపడుతున్నారు.  తాబేలుకు ఆత్రం పెరిగిపోతున్నది. ఆ తొందరలో అది హంసలు చేసిన హెచ్చరికను మరచిపోయింది. ‘కింద ఆ కోలాహలమేమి’ అని హంసలను అడగబోయి నోరు తెరిచింది. అంతే, కిందపడి మరణించింది. లోకంలో మూడు రకాల మనుషులు ఉంటారు. సొంతగా ఆలోచించుకొనేవారు, ఇతరులు చెప్పిన మంచిని గ్రహించేవారు. ఇంకా, రెండూ లేక చెడేవారు. వీరినే మూర్ఖులని అంటారు. అలాంటి మూర్ఖులు తాబేలులాగా  చెడిపోతారు. 

ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి  

1. హంసల పేర్లు ఏమిటి? 

2. ఆకాశంలోకి ఎగిరే ముందు తాబేలుకు, హంసలు ఏమని జాగ్రత్తలు చెప్పాయి?

3.హంసలు వేరే సరస్సుకు ఎందుకు వెళ్లదలచుకున్నాయి?

4. తాబేలు ఎందుకు  కిందికి జారింది?

5. తాబేలు నోరు తెరవకపోయి ఉంటే ఏమి జరిగేది? 


logo