శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 28, 2020 , 23:23:01

ధైర్యమే..ఇమ్యూనిటీ!

ధైర్యమే..ఇమ్యూనిటీ!

చిమ్మచీకట్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు.. భయం భయంగా వెనక్కి తిరిగిచూస్తే.. హోరుగాలిలో ఊడలమర్రి.. జడలు విరబోసుకున్న దయ్యంలా కనిపిస్తుంది. గుండెల్లో ధైర్యం నింపుకుని మళ్లీ వెనక్కి చూస్తే.. అదే ఊడలమర్రి.. మనకు మద్దతుగా నిలబడిన సైన్యంలా అనిపిస్తుంది. మనిషిని భయం నుంచి అభయానికి, మృత్యువు నుంచి అమృతత్వానికి మళ్లించే శక్తి ధైర్యానికి ఉంది. కొవిడ్‌ను ఓడించడంలోనూ ధైర్యం మానసికమైన ఇమ్యూనిటీని ఇస్తుంది. ధైర్యాన్ని వదులుకుంటే.. మనల్ని మనం వదులుకున్నట్టే!

ఒకే దవాఖాన. ఒకే వైద్య బృందం. ఒకే రకమైన ఆరోగ్య పరిస్థితులు. కానీ..తొమ్మిదిమంది రోగులు మరణిస్తారు. ఒకరు మాత్రమే బతుకుతారు. కారణం..

ఆ ఒక్కరిలోని బలీయమైన జీవనకాంక్ష! ఎంత గొప్ప చికిత్స అయినా రోగి మీద తొంభైశాతమే పనిచేస్తుంది. మిగతా పదిశాతం ఫలితం అతడి ఆత్మవిశ్వాసం మీద, బతికితీరాలన్న కోరిక మీదా ఆధారపడి ఉంటుంది.కొవిడ్‌కు సంబంధించినంత వరకూ ఇదే.. మోరల్‌ ఇమ్యూనిటీ! శరీరానికి విటమిన్‌ మాత్రల ద్వారా, పోషక విలువలతో కూడిన ఆహారం ద్వారా, కషాయం ద్వారా రోగ నిరోధకశక్తి వస్తుంది. కానీ, మోరల్‌ ఇమ్యూనిటీకి మాత్రం.. ఆత్మవిశ్వాసం, ఆశావాదం, జీవన ఆకాంక్ష, కుటుంబం పట్ల బాధ్యత, వ్యాధితో పోరాడి గెలువగలననే ధైర్యం  ఇవే విటమిన్లూ, పోషక విలువలూ.

మానసికంగా గెలువాలి

‘ముందు శత్రువును మానసికంగా దెబ్బకొట్టు. అదే డబ్భుశైతం విజయం. మిగతా ముప్పైశాతం గెలుపు తనంతట తానే వస్తుంది’ అంటాడు చాణక్యుడు. కరోనా విషయంలోనూ మనం ఈ వ్యూహాన్నే అనుసరించాలి. రాజమౌళి సినిమాలో ముందుగా విలన్లనే చూపిస్తారు. ఆ దుర్మార్గుడు మహా భయంకరంగా ఉంటాడు. అంతకంటే భయంకరంగా మాట్లాడతాడు. కలలో కూడా ఉలిక్కిపడేలా వికటాట్టహాసం చేస్తాడు. ఆ తర్వాతే, హీరోను చూపిస్తారు. కొన్నిసార్లు, కథానాయకుడి ప్రవేశం.. ఏమంత గ్రాండ్‌గా ఉండకపోవచ్చు. కానీ, ప్రేక్షకుడు ఆ హీరో శక్తియుక్తుల్ని మనసులోనే ఊహించుకుంటాడు. అంతటి శత్రువును దెబ్బకొట్టబోతున్నాడంటే, ఇంకెంత మొనగాడై ఉంటాడో లెక్కలేసుకుంటాడు. అదృష్టవశాత్తు మన శుత్రవు మహాపిరికిది. ధైర్యంగా ఎదురుపడలేదు.

 ప్రత్యక్షంగా దాడిచేయలేదు. అలా అని ఏమైనా శక్తిమంతమైందా అంటే, అదీ కాదు. కాస్తంత వేడి తగిలితే చాలు.. విలవిలలాడిపోతుంది. అంతటి బలహీనమైన శత్రువును ఎక్కడా చూసి ఉండమేమో. ఇన్నేండ్ల జీవితంలో మనం ఎన్ని సమస్యల్ని అధిగమించలేదూ? ఆ మాటకొస్తే.. పేదరికం, నిరుద్యోగం, పరీక్షల్లో వైఫల్యాలు, వృత్తి జీవితంలో ఎదురుదెబ్బలు.. ప్రతి సమస్యా ఓ వైరస్‌ లాంటిదే. వాటన్నిటినీ ఎమోషనల్‌ ఇమ్యూనిటీతో గెలిచాం. ఇప్పుడు మాత్రం, ఓటమిని ఎందుకు అంగీకరించాలి? పురాణాల్లో మార్కండేయుడు ప్రాణగండం నుంచి గెలిచింది కూడా ఎమోషనల్‌ ఇమ్యూనిటీతోనే! శివుడు.. మనసుకు అధిపతి! శివలింగం ఆత్మబలానికి ప్రతీక. లింగాన్ని ఆలింగనం చేసుకోవడం అంటే.. మనసును శక్తిమంతం చేసుకోవడం. 


నవ్వులే చికిత్సగా..

ఆశావాదం కోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలే చదువాల్సిన పన్లేదు. హాయినిచ్చే సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యం, ధ్యానం, నోస్టాల్జియా.. జీవితం పట్ల మమకారాన్ని కలిగిస్తాయి. ‘నాకు చిన్నప్పటి నుంచీ రాజేంద్రప్రసాద్‌ సినిమాలంటే ఇష్టం. మనసు బాగాలేనప్పుడు తన సినిమాల్లోని కామెడీ బిట్లు చూస్తుంటాను. కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ సమయంలోనూ.. హాస్యమే నాకు ఔషధంలా పనిచేసింది. మనసారా నవ్విన ప్రతిసారీ రోగనిరోధకశక్తి పెరిగిన అనుభూతి. అద్దం ముందు నిలబడి ‘కరోనా! నీ పప్పులేం ఉడకవు సరేనా?’ అని నా అభిమాన నటుడిని అనుకరిస్తూ పంచులు వేసేవాడిని. కనిపించని కరోనా వైరస్‌ను ‘వెవ్వెవ్వె’.. అని వెక్కిరించేవాడిని. అదో మానసిక విజయం! నాకోసం నేను కనిపెట్టుకున్న టెక్నిక్‌' అంటారు ఓ కార్పొరేట్‌ కంపెనీలో పీఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న మూడుపదుల యువకుడు.

కరోనా మూడు చేపల కథ..

‘కరోనా తీవ్రంగా వ్యాపిస్తుందని తెలిసింది. ఎందుకైనా మంచిది మాస్కులూ శానిటైజర్లూ కొనుక్కుందాం. భౌతిక దూరం పాటిద్దాం’అని చెప్పింది మొదటి చేప. చెప్పినట్టే అన్ని జాగ్రత్తలూ పాటించింది. రెండో చేప మొదట్లో తేలికగా తీసుకుంది. అస్సలు పట్టించుకోలేదు కానీ, ఆ తర్వాత తనలో కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో.. టెస్ట్‌ చేయించుకుంది. క్వారంటైన్‌కు వెళ్లింది. నెగెటివ్‌ రిపోర్టుతో బయటికి వచ్చింది. మనం, మొదటి చేపలా ఉందాం. లేదంటే, రెండో చేపలా అయినా వ్యవహరిద్దాం. మన కథలో నిరాశకు చోటులేదు. మూడో చేపకూ స్థానం లేదు.

కూతురి కోసం..


‘ఆ క్షణంలో నాకు ఉద్యోగం గుర్తుకురాలేదు. పరిచయాలూ స్నేహాలూ గుర్తుకురాలేదు. చదివిన పుస్తకాలూ, పోగేసుకున్న జ్ఞానం ఏదీ... గుర్తుకురాలేదు. కండ్లముందు నా కుటుంబం మాత్రమే కనబడింది. ఇప్పుడిప్పుడే కాలేజీ చదువులకు వస్తున్న కూతురు, నేనే ప్రపంచమనుకునే భార్య.. నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. అవును, వాళ్ల కోసమైనా నేను బతకాలి. నేను చెట్టయితే, వాళ్లంతా కొమ్మలూ రెమ్మలూ! చెట్టు ఎండిపోతే, కొమ్మలు వాడిపోతాయి. కుటుంబానికి ఆధారం ఉండదు. ఎంతోకొంత పింఛను వచ్చినా,  మహానగరంలో ఆ డబ్బు ఏ మూలకూ సరిపోదు. భారీ అద్దెలు చెల్లించలేరు కాబట్టి, నగరం నడిబొడ్డున ఉన్న విశాలమైన అపార్ట్‌మెంట్‌ నుంచి ఏ శివార్లకో మారాల్సి వస్తుంది. ఇరుకిరుకు గదుల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. నా కూతురు, ఇక పెద్ద చదువులు చదువలేదు. లక్ష్యాల్ని నెరవేర్చుకోలేదు. ఊహించుకుంటేనే.. టపటపా కన్నీళ్లు. ఆ దుస్థితి రాకూడదంటే, నేను చావకూడదు.

బతకాలి..బతకాలి.. బతకాలి 

.. ఒకటికి పదిసార్లు మనసుకు అలా ఆటో సజెషన్స్‌ ఇచ్చుకున్నాను’ అని తన కథంతా చెబుతారు... ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలోని ఐసీయూలో కొవిడ్‌ చికిత్స తీసుకుంటున్న ఒక మధ్యవయస్కుడు. కరోనా నేరుగా ఆయన ఊపిరితిత్తుల మీదే దాడి చేసింది. దీంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలు వచ్చాయి. పక్షం రోజులు మృత్యువుతో పోరాడారు. అంతిమ విజయం మనిషిదే, కాదుకాదు, ఆత్మవిశ్వాసానిదే.   అలాంటిదే మరో కథ. మూడుపదుల వయసులోని ఓ మహిళ  మానసిక ఇమ్యూనిటీతోనే కొవిడ్‌ను గెలిచింది. ఆమె ఓ పసిపాపకు తల్లి. బిడ్డను అత్తగారి దగ్గర వదిలి.. నాలుగు గోడల మధ్య ఒంటరి జీవితం గడిపిందామె. కూతుర్ని చూడాలని అనిపించిన ప్రతిసారీ.. వారగా కిటికీ తీసేది. కర్టెన్‌ చాటు నుంచీ ఆ బోసినవ్వుల్ని కళ్లలో నింపుకునేది.  ‘కొవిడ్‌ను గెలువాలి. నా బంగారుతల్లిని ఈ చేతులతో ఎత్తుకోవాలి’ అన్న బలీయమైన ఆకాంక్ష ఆమెను త్వరగా కోలుకునేలా చేసింది. ఆ సానుకూలమైన మార్పును చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఇక్కడ మందుల కంటే, మనసే బలంగా పనిచేసింది. 

జీవిత లక్ష్యం కోసం

కొవిడ్‌ ఆధార్‌ కార్డులనో, జనాభా లెక్కల కాగితాలనో చేతిలో పట్టుకుని దండయాత్రకు బయల్దేరదు. దానికి పెద్దలంటే గౌరవం లేదు. పిల్లలన్నా ప్రేమలేదు. అదో కాలకేయ ముఠా. ఎవరినీ వదిలిపెట్టాలని అనుకోదు. ఆ వైరస్‌కు ఎదురొడ్డి పోరాడటానికి.. ఏ వయసువారైనా సిద్ధంగా ఉండాలి. అది పాతిక కావచ్చు, యాభై కావచ్చు, వందా కావచ్చు! ప్రతి జీవితం విలువైందే. ప్రతి మనిషికి ఓ ప్లానింగ్‌ ఉంటుంది. సాధించాల్సిన కలలూ, నెరవేర్చాల్సిన లక్ష్యాలు, చేరాల్సిన మజిలీలు, ఆస్వాదించాల్సిన ప్రయాణాలు.. చాలానే ఉంటాయి. ఆ కలల్ని రబ్బరుతో తుడిచేయడానికి కొవిడ్‌కు ఏం హక్కు ఉంది? ఆ ప్రణాళికల్ని చెత్తపాలు చేసే అధికారం ఆ విషక్రిమికి ఎవరిచ్చారు? జీవనకాంక్ష రెట్టించినప్పుడు, రోగ నిరోధక వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లోని రోగికైనా వేయి ఏనుగుల బలం వస్తుంది. 

బతకడానికి అవసరమైన ప్రతి ప్రయత్నమూ చేస్తాడు. వైద్యుల సూచనలు పాటిస్తాడు, సమయానికి మందులు వేసుకుంటాడు,  బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేస్తాడు. శరీర వ్యవస్థ కూడా వైద్యానికి సహకరించడం మొదలుపెడుతుంది. ఇక, శత్రు క్రిమి.. చావు మూడినట్టే. సరిహద్దుల్లోని ప్రత్యర్థి సైన్యం తోకముడిచి... ఒక్కో గుడారాన్నీ ఎత్తేసినట్టు, వైరస్‌ శరీరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతుంది. త్వరలోనే ‘నెగెటివ్‌' రిపోర్టు వస్తుంది. ‘నేను ఒక కథ సిద్ధం చేసుకున్నాను. ఓ నిర్మాత వినడానికి సమయం కూడా ఇచ్చాడు. అంతలోనే కరోనా సంక్షోభం మొదలైంది. ఆ వైరస్‌ నా మీదా దాడి చేసింది. ఓ దశలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. ఇక, మరణం తప్పదని అనిపించింది. అంతలోనే, నా కలలూ ప్రాజెక్టులూ గుర్తుకొచ్చాయి. నా కథ సినిమాగా తెరకెక్కే వరకూ నేను బతికుండాలి. బతికుంటాను కూడా అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసం కొంతా, వైద్యుల ప్రయత్నం కొంతా, కన్నవాళ్ల ఆశీస్సులు కొంతా.. అన్నీ కలిసి నన్ను బతికించాయి’ అంటాడో ఫిలిమ్‌నగర్‌ పౌరుడు.   

ఆత్మహత్య ఆలోచనను గెలిచి..


డిప్రెషన్‌ మనిషితో మైండ్‌గేమ్‌ ఆడుతుంది. ధైర్యంగా ఉన్నంతకాలం దరిదాపుల్లోకి కూడా రాలేదు. మనం కొంచెంకొంచెంగా బలహీనపడినకొద్దీ ఒక్కో అడుగూ మనవైపు వేస్తుంది. పూర్తిగా ఓటమిని అంగీకరించగానే.. నెత్తినెక్కి కూర్చుంటుంది. ఓ ఆట ఆడిస్తుంది. కరోనా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ రోగులకు  అయితే, ఆమడ దూరంలో తచ్చాడుతూ ఉంటుంది డిప్రెషన్‌. మన కండ్ల్లముందే ఎవరి ప్రాణాలో పోతుంటాయి. ఎవర్నో నిశ్శబ్దంగా సాగనంపుతుంటారు. ఈరోజు వచ్చినవాళ్లు రేపు ఉండరు. రేపు వచ్చినవాళ్లు ఎల్లుండి ఉండరు. 

‘ఏదో ఒక రోజు మనం కూడా?’  అన్న ఆలోచన రాగానే ఒళ్లు జలదరిస్తుంది. అదే తగిన సమయం అన్నట్టు.. డిప్రెషన్‌ గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మనం పాజిటివ్‌ ఆలోచనా ధోరణిని కవచంలా వాడుకోవాలి. ‘ఓ దశలో ఆత్మహత్య ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. దుప్పటితో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకోవాలా, కరెంటు వైరును బలంగా మెడకు బిగించుకోవాలా?.. అన్న విషయం గురించే రాత్రంతా ఆలోచించాను. పొద్దున లేవగానే.. ఆసుపత్రి కిటికీలో నుంచి సూర్యోదయం మహాద్భుతంగా దర్శనమిచ్చింది. కాసేపు ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆ కిరణాలతో పాటు ఆశావాద దృక్పథం నాలోకి ప్రవేశిస్తున్న భావన కలిగింది. నా పిరికి ఆలోచనలకు నేనే నవ్వుకున్నాను’ అంటూ నెగెటివ్‌ ధోరణిని తాను అధిగమించిన ఘట్టాన్ని వివరిస్తారు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీమ్‌లీడర్‌గా పనిచేస్తున్న ఓ విద్యాధికుడు. కొన్ని సంఘటనలు నాటకీయంగా అనిపించవచ్చు. ఆమాటకొస్తే జీవితమూ ఓ నాటకమే కదా.. జీవన్నాటకం!

సెల్ఫ్‌ టాక్‌తో..


రోజూ.. మనతో మనం, మనలో మనం వందలసార్లు మాట్లాడుకుంటాం. ‘సెల్ఫ్‌టాక్‌' అంటే ఇదే, తెలుగులో అయితే ‘స్వగతం’ అంటాం. కరోనా రోగికి మాట్లాడుకోవడానికి ఎవరూ ఉండరు. డాక్టర్లు వచ్చినా పీపీయీ కిట్‌తోనో. సైగలతోనే చెప్పాల్సిన విషయాలు చెప్పి వెళ్లిపోతారు. మనసులో పేరుకుపోయిన భావాలన్నీ ఎవరితో పంచుకోవాలి? ఇలాంటి సమయాల్లో నీకు నువ్వే ఆత్మీయుడివి. నీకు నువ్వే శ్రేయోభిలాషివి. నీతోనే నువ్వు మాట్లాడుకోవాలి. బంజారాహిల్స్‌కు చెందిన ఓ డాన్స్‌ టీచర్‌ ఇదే సూత్రాన్ని అనుసరించారు కొవిడ్‌ చికిత్స సమయంలో. “ప్రతి నెగెటివ్‌ ఆలోచననూ, ఒక పాజిటివ్‌ సంభాషణతో తరిమికొట్టేదాన్ని. ‘చాలామంది చనిపోతున్నారు’ అన్న ఆలోచన రాగానే, ‘చాలామందేం కాదు, మహా అయితే ఐదు శాతం లోపే! తొంభై అయిదుశాతం రోగులు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు’ అని నాకు నేను సమాధానం చెప్పుకునేదాన్ని. ఆ సాధన బాగానే పనిచేసింది. రెండుమూడు రోజులు తిరిగేసరికి నెగెటివ్‌ ఆలోచనలు బాగా తగ్గిపోయాయి” అంటారామె. మెడిటేషన్‌ కూడా ఈ ప్రయత్నంలో ఉపకరించిందని చెబుతారు.


logo