పారిస్: మరికొద్ది రోజుల్లో మొదలుకాబోయే ఒలింపిక్స్ కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పారిస్.. నగరంలో బతుకుజీవుడా అంటూ పొట్టచేతబట్టుకుని వచ్చిన శరణార్థుల శిబిరాలను ఖాళీ చేయిస్తోంది. విశ్వక్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించే సీన్ నది ఒడ్డున టెంట్లు వేసుకుని ఉంటున్న వలసజీవులను సోమవారం అర్ధరాత్రి పోలీసులు అక్కడ్నుంచి పంపించారు.
పశ్చిమ ఆఫ్రికా, ఇతర దేశాల నుంచి పారిస్కు వచ్చిన శరణార్థులు వేలల్లో ఉన్నారు. ఇదిలాఉండగా పోలీసుల చర్యపై మానవహక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. దీనిని ‘ప్రీ ఒలింపిక్ స్వీప్’గా వాళ్లు అభివర్ణిస్తున్నారు. ఒలింపిక్స్ చూసేందుకు వచ్చే వీక్షకులకు, పర్యాటకులకు పారిస్ నగర సౌందర్యం తప్ప శరణార్థులు కనబడొద్దన్నట్టుగా ఫ్రాన్స్ వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.