శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Zindagi - Mar 17, 2020 , 23:14:27

భాషకు దక్కిన గౌరవం

భాషకు దక్కిన గౌరవం

భాషంటే.. మన ఉనికి.. మన జీవనం.. మన పరిసరాలు.. మన ఆస్తి.. మన జీవితం. భాష ఉంటేనే మన అస్తిత్వం. మరి మనం చదివే భాష.. రాసే భాష ఒక్కటేనా? ఎందుకింత వ్యత్యాసం? అదే ప్రశ్న ఏండ్లుగా వేధించిందా యువకుడిని.. ఆ ప్రశ్నే.. తెలంగాణ భాషలో పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథం రాసేలా చేసింది. ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లను ఎదుర్కొని డాక్టరేట్‌ అందుకునేలా చేసింది. అలా తెలంగాణ భాషలో థీసిస్‌ రాసిన పరిశోధక విద్యార్థిగా గుర్తింపు పొందిన యువకుడిని ‘యువ’ పలుకరించింది.

తెలంగాణ రాకముందు.. సభలో మన భాష మాట్లాడితే వెక్కిరింపులు. సమావేశంలో తెలంగాణ భాష ఇనవడితె మందలింపులు. అధికారుల్ని కలిసినా.. నాయకులతో ములాఖత్‌ అయినా.. మన భాషంటే చిన్నచూపే. మన యాస మాట్లాడే మనుషులంటే ఏవగింపే. మన భాషయాసల గొంతు నులిమిన వారెందరో. అలాంటి పరిస్థితులెన్నో కళ్లారా చూసి.. అచ్చ తెలంగాణ భాషలో పరిశోధనతో సైద్ధాంతిక గ్రంథం రాయాలని నిర్ణయించుకున్నాడు ఖాజా పాషా. ఓయూలో ఎంఏ రంగస్థల శాస్త్రం పూర్తయ్యాక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరాడు. ‘తెలుగు నాటకాలు, నాటికలు.. సినిమాలుగా మారే పరిణామం’ అంశంపై పరిశోధన చేశాడు. అందుకు అవసరమైన గ్రంథాన్ని తెలంగాణ భాషలో రాసి తన పేరుకు ముందు డాక్టర్‌ అనే గౌరవాన్ని చేర్చుకున్నాడు. మరి ఆగౌరవం ఊరికే వచ్చిందా?


నిలిచి గెలిచి.. 

‘తెలంగాణ భాషలో థీసిస్‌ రాస్తావా? అదెలా సాధ్యం? నిబంధనలకు విరుద్ధం? ఎలా రాస్తావో చూస్తాం కదా?’ అని నిరుత్సాహానికి గురి చేసిండ్రు. ‘ఎందుకు రాయొద్దు సార్‌.. నేను బరాబర్‌ రాస్త. మన భాషల మనం రాయకవోతె మరెవరు రాస్తరు? ఇంకెన్నొద్దులు సార్‌.. మన భాషను మనం గౌరవించకపోతె ఇంకెవరు గౌరవిస్తరు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాడతను. మూడేండ్ల పరిశోధన అనంతరం 2014లో థీసిస్‌ రాయడం ప్రారంభించిండు. 2016లో తన పరిశోధనా పత్రాల రచన పూర్తి చేసిండు. తెలంగాణ భాషలో థీసిస్‌ రాయకూడదనే నెపంతో ఏడాది, నిబంధనల్లో లేదనే నెపంతో మరో ఏడాది... ఇట్లా 2019 దాకా ఆగవట్టిండ్రు. అన్నింటికీ సమాధానం చెబుతూ ఆధారాలతో సహా రుజువులు చూపిస్తూ ఖాజా పాషా ముందుకెళ్లాడు. చివరికి 2019లో అతడికి పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

చింతబరిగె స్కీం 

ఖాజా పాషాది ఉమ్మడి వరంగల్‌ జిల్లా గున్నేపల్లి. ఉస్మానియా యూనివర్శిటీలో రంగస్థల శాస్త్రంలో పీజీ చదివిండు. ఆ విభాగంలో గోల్డ్‌మెడల్‌ కూడా సాధించిండు. యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన ‘పాపులర్‌ రచనలు చేయడమెలా?’ పుస్తకం ఖాజా జీవితాన్ని మార్చింది. చిన్నప్పట్నుంచి వేటూరి పాటలు వింటూ పెరిగిన పాషా సృజనాత్మక రచనల్లో మునిగిపోయేవాడు. వందల్లో కవితలు రాసిండు. 70 పేజీలు రాసిండు. అతికొద్ది నాటికలు రాసి తొమ్మిది నంది అవార్డులు గెలుచుకున్నడు. అందులో గాయత్రి డాటర్‌ ఆఫ్‌ బషీర్‌ అహ్మద్‌. శాపగ్రస్తులు (థర్డ్‌ జెండర్‌ గురించి), చింతబరిగె స్కీం (భాష గురించి), క్రిష్ణసాగరి నాటికలు చాలా పాపులర్‌ అయినవి. చింతబరిగె స్కీం తెలంగాణ ఉద్యమంలో సంచలనం రేకెత్తించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ సాక్షిగా ఈ నాటికను అడ్డుకోవాలని సమైక్యవాదులు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆఖరికి చింతబరిగె స్కీం బృందంపై భౌతికదాడికీ దిగారు. 

సిన్మాల్లోకి..

సీన్మాల్లోకి పోవాలనే కల. తెలంగాణోళ్లు డైరెక్టర్లు కారనే అపోహ. ‘ఎన్‌కౌంటర్‌' సిన్మా చూసినంక మనోళ్లూ డైరెక్టర్లు అయితరు అని గట్టిగ నమ్మిండు పాషా. కృష్ణానగర్‌ వీధుల్లో అందరిలాగే ఒక్క అవకాశం అంటూ తిరిగిండు. కానీ వెళ్లిన ప్రతిచోటా ‘అనుభవముందా?, రాసిన కథలేవీ’ ఇలాంటి వందల ప్రశ్నలు ఎదురయ్యాయి. పాషా ఓయూలో థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సు చదువుతున్న సమయంలోనే చిన్న చిన్న నాటికలు రాస్తూ, డైరెక్షన్‌ చేస్తూ తన కలకు నిజ రూపాన్నిచ్చుకున్నడు. 2013లో డాటర్‌ ఆఫ్‌ రామ్‌గోపాల్‌ వర్మ సినిమాకు  దర్శకత్వం వహించిండు. కన్నడలో విడుదలైన ‘రాజరథం’ సినిమాకు డైలాగ్‌ రైటర్‌గా పనిచేసిండు. 2014లో తెలంగాణ భాషలో ‘పూరిండియా’ షార్ట్‌ ఫిలిం నిర్మించిండు. ప్రస్తుతం తెలంగాణ భాషను సినిమాల్లో, మరిన్ని సాధనాల్లో అమలు చేసే ఆలోచనలో ఉన్నడు.


 

మన భాషల సదువుచెప్పాలె

స్కూళ్లల్ల తెలంగాణ భాషల చదువు చెప్పాలె. తెలంగాణ యాసల్నే పుస్తకాల్ని అచ్చు వేయించాలె. ఇతర దేశాల్లో ఉన్న మాదిరిగా మన యాసలో సినిమాలు నిర్మిస్తే అలాంటి సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలె. ప్రత్యేకంగా తెలంగాణ భాష కోసం ఓ డిక్షనరీ తీసుకురావాలె. గతంతో పోలిస్తే తెలంగాణ వచ్చాక మన భాషకు మంచి విలువ దక్కింది. భవిష్యత్‌ తరాలకు మన భాషను అందించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టి జనభాషను అమలుపర్చాలె. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ తెలంగాణ యాసలో గ్రంథ రచన చేసేందుకు ఎంతో ప్రోత్సాహాన్నందించారు. 

- డాక్టర్‌ ఖాజా పాషా 


-పడమటింటి రవికుమార్‌


logo