అమీషా పటేల్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. బద్రి, నాని లాంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితురాలు. బాలీవుడ్, టాలీవుడ్లో అగ్రతారగా వెలుగొందిన ఈ నటి.. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నది.
తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. “గతంలో నేను పలువురితో డేటింగ్ చేశా! కానీ, ఎవరి దగ్గరా నిజాయతీ కనిపించలేదు. ఎవరూ నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోలేదు” అంటూ చెప్పుకొచ్చింది. తనతో ప్రేమాయణం నడిపినవాళ్లంతా తన శరీరాన్ని మాత్రమే ప్రేమించారనీ, తన ఆలోచనలు, నిర్ణయాలకు ఎవరూ గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. “నాకింకా పెళ్లిపై నమ్మకముంది.
నా మనసును అర్థం చేసుకోనే వ్యక్తి దొరికితే.. పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. పిల్లల్ని కని, కుటుంబాన్ని చూసుకోవాలని ఉంది” అంటూ మనసులోని మాటను బయటపెట్టింది. ఇక తనకు హాలీవుడ్ స్టార్హీరో టామ్ క్రూజ్పై క్రష్ అనీ, తనతో డేటింగ్ చేయాలని ఉందనీ చెప్పుకొచ్చింది. “నాకు చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్ అంటే ఇష్టం. నా పెన్సిల్ బాక్స్, నా ఫైల్స్లోనూ అతని ఫొటో ఉండేది” అంటూ బాల్యాన్ని గుర్తుచేసుకున్నది.