ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Dec 06, 2020 , 00:15:36

రూపాయికే సన్నబియ్యం

రూపాయికే సన్నబియ్యం

  •  కరోనా నేపథ్యంలో తెరుచుకోని పాఠశాలలు, వసతి గృహాలు 
  • పేరుకుపోయిన సన్నబియ్యం నిల్వలు 
  • స్టాక్‌ను రేషన్‌ దుకాణాలకు మళ్లింపు.. 
  • జిల్లాలో ఈ నెల నుంచి పంపిణీ 
  • పేదల కడుపు నింపేందుకే సర్కారు నిర్ణయం 
  • బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు 
  • ఇప్పటికే రేషన్‌ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా
  • మెరుగుపడనున్న భోజనం అక్రమాలకు అడ్డుకట్ట 
ఆలేరు టౌన్‌ : రేషన్‌ షాపుల్లో కార్డుదారులకు సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్నరకం ధాన్యాన్ని సాగు చేయడంతో దిగుబడి బాగా పెరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడం, వసతి గృహాలు తెరుచుకోకపోవడంతో  సన్నబియ్యం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఆ బియ్యాన్ని రేషన్‌ షాపులకు మళ్లించి అందిస్తున్నారు. జిల్లాలో  2,13,874 ఆహార భద్రత కార్డులు, 13,702 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. 481 రేషన్‌ షాపుల్లో వీరికి ప్రతీనెల 5973 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే గతనెలలో మిగిలి ఉన్న దొడ్డు రకం బియ్యాన్ని సరఫరా చేయగా, మిగిలిన కార్డుదారులకు సన్నబియ్యం అందించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రేషన్‌షాపుల్లో పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు. డిసెంబర్‌ 1 నుంచి గతంలో మాదిరిగా రూపాయికి కిలో చొప్పున అందిస్తున్నారు. అక్రమాలను నిరోదించేందుకు ఓటీపీ, ఐరిస్‌, ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా వస్తువులు సరఫరా చేస్తున్నారు. 

పారదర్శకంగా పంపిణీ..మంచి నిర్ణయం..

రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల నుంచి అన్ని రేషన్‌షాపుల్లో సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేషన్‌ బియ్యాన్ని బయట అమ్మడం చట్టవిరుద్ధం. అంతేకాకుండా లబ్ధిదారులు ఆధార్‌కార్డును మొబైల్‌ నెంబర్‌కు లింక్‌ చేసుకోవాలి. 
-శ్యాంసుందర్‌రెడ్డి, తహసీల్దార్‌, ఆలేరు 

మంచి నిర్ణయం..

పేదలకు రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యాన్ని సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. దొడ్డు బియ్యం తినాలంటే ఇబ్బందిగా ఉంది. కూరలు కలుపుకొని తింటుంటే రుచిగా ఉండదు. సన్నబియ్యంతో భోజనం చేయడం సులువుగా ఉంటుంది. ఇక నుంచి ప్రతినెల సన్నబియ్యం సరఫరా చేయలి.
-బేతి వెంకటేశ్‌, ఆలేరు 


VIDEOS

logo