న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ 2024 ఫలితాలను వెల్లడించింది. ఇందులో 56 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ చేయగా వీరిలో అత్యధికంగా 15 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ 22న తుది ‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా, అంతకుముందు జనవరిలో సెషన్-1 పరీక్ష జరిగింది. ఈ రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోర్లను పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. విద్యార్థులు తమ స్కోర్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు జేఈఈ అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మే 17 నుంచి 26 వరకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలి. మే 26న ఉదయం పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఫలితాలు జూన్ 9న ప్రకటిస్తారు.