ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 15, 2020 , 01:17:05

విద్యుత్‌ తీగ... కారాదు యమపాశం

విద్యుత్‌ తీగ... కారాదు యమపాశం

వర్షాకాలంలో విద్యుత్‌ తీగలు ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి. విద్యుత్‌షాక్‌కు గురై ఏటా వందల సంఖ్యలో మూగజీవాలూ మృత్యువాత పడుతున్నాయి. అప్రమత్తంగా లేకపోతే కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నది. ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. ఆ సమయంలో కరెంట్‌ తీగలు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, ఎర్త్‌ విఫలం కావడం వంటి లోపాలు ఏర్పడుతుంటాయి. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధం కావడంతో బోరుబావులు, విద్యుత్‌ మోటార్ల వినియోగం ఎక్కువగా జరుగుతోంది. రైతన్నలు వ్యవసాయ పనుల వద్ద విద్యుత్‌ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరుగకుండా నివారించవచ్చు. -యాదాద్రి అగ్రికల్చర్‌

పంపుసెట్ల వద్ద అప్రమత్తత..

వ్యవసాయ పంపు సెట్లు వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్‌వాల్వ్‌లు ఇన్సులేషన్‌ సరిగా లేకపోవడం కారణంగా విద్యుత్‌ ప్రసారం జరిగి క్షణాల్లో వాటిని తాకడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పొలాల వద్ద విద్యుత్‌ మోటార్లను వినియోగించే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. పంపుసెట్లు ఆన్‌ చేసే సమయంలో అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. విద్యుత్‌ వైర్లు తెగిపడటం, ఎర్త్‌ రావడం వంటివి జరుగుతున్నాయో చూసుకోవాలి. ముఖ్యంగా వర్షం, గాలిదుమారం వచ్చిన సమయంలో మోటార్లను తాకే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. 

నిర్లక్ష్యం వద్దు..

విద్యుత్‌ వినియోగదారులు కూడా కరెంట్‌ పై అప్రమత్తంగా ఉండాలి. గృహాల్లో ఎప్పటికప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. విద్యుత్‌ ఉపకరణాలు వినియోగించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మోటార్లు, ఐరన్‌బాక్స్‌, కూలర్లు, వాషింగ్‌ మిషన్లు వంటి వాటిని వినియోగించే సమయంలో ఏదైనా విద్యుత్‌ వైర్‌ తెగితే ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. ఇండ్లల్లో ఐరన్‌ తీగలపై దుస్తులు ఆరేస్తుంటారు. ఈ సమయంలో విద్యుత్‌ వైర్లు ఏమైనా ఐరన్‌ తీగకు తగులుతున్నాయా..? ఎక్కడైనా వైర్లు తెగిపోయాయా చూసుకోవాలి. దండెం కోసం ఉపయోగించే వైర్లను విద్యుత్‌ ప్రసారమయ్యే వైర్లకు దగ్గరగా కట్టకూడదు. 

చార్జింగ్‌ పెట్టి ఫోన్‌లో మాట్లాడొద్దు..

అనేకమంది సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టిన సమయంలో ఫోన్‌ వస్తే మాట్లాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మాట్లాడే వ్యక్తి విద్యుత్‌షాక్‌కు గురయ్యే ప్రమాదాలు ఎక్కువ. చార్జర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తితే విద్యుత్‌ ప్రసారం జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్నిసార్లు చార్జింగ్‌ వైర్లకు విద్యుత్‌ ప్రసారం జరుగుతుంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని చార్జింగ్‌ పెట్టిన సమయంలో ఫోన్‌ కాల్‌ వచ్చినట్లయితే చార్జింగ్‌ తొలగించి మాట్లాడాలి.  

విద్యుత్‌ ప్రమాదాలకు నష్టపరిహారం 

  మృతి చెందిన సంఘటన, మృతికిగల కారణాలను బేరీజు వేసుకొని సుమారు రూ.5 లక్షల వరకు నష్టపరిహారం అందిస్తున్నారు. పశువులు మృతి చెందితే యజమానికి రూ.40 వేల వరకు నష్టపరిహారం అందజేస్తున్నారు.  

స్తంభాలతో జాగ్రత్త..

 విద్యుత్‌ తీగలు, స్తంభాలు విరిగిపోయిన సమయంలో విద్యుత్‌ స్తంభాలను ముట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద  ఫీజులు మార్చడం, సర్వీస్‌ వైర్లు, వీధి దీపాలను సరిచేయడం వంటి పనులు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.

VIDEOS

logo