సోమవారం 01 మార్చి 2021
Yadadri - May 27, 2020 , 03:46:46

కరువు నేలపైజలసిరి

కరువు నేలపైజలసిరి

  • మాగాణిగా మారనున్న బీడు భూములు 
  • కాళేశ్వరం ప్యాకేజీ-16 ద్వారా బస్వాపూర్‌కు నీళ్లు
  • 40 ఏండ్ల కరువును పారదోలనున్న గోదారమ్మ  
  • 323 చెరువులకు జలకళ..సాగులోకి 44,279 ఎకరాలు 
  • నియోజకవర్గంలో 699 చెరువులకు జియోట్యాగింగ్‌ పూర్తి 
  • ఎల్లుండి కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం 

ఎటు చూసినా రాళ్లురప్పలు, బీడువారిన భూములు.. వర్షాధారంగానే సాగు..చుక్క నీటి కోసం నింగికేసి చూడాల్సిన పరిస్థితి..వందల అడుగులు బోర్లు వేస్తే తప్ప నీళ్లు రాని దుస్థితి..కరువును సమూలంగా పారదోలి వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రజల జీవన గమనాన్నే పూర్తిగా మార్చనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ ద్వారా నిర్మితమవుతున్న బస్వాపూర్‌ జలాశయానికి నీటిని అందించే ప్రధాన కాల్వ ద్వారా  ఆలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోని 323 చెరువులకు జలకళ సంతరించుకోనుంది. ఇందుకోసం ప్రధాన కాల్వతో ఓటీ-1,2లను నిర్మించనున్నారు.  దీనికి కావాల్సిన భూసేకరణ, డిజైనింగ్‌ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. త్వరలో పనులు ప్రారంభమై  యాసంగి సీజన్‌లోపు 44,279 ఎకరాలకు  సాగునీటిని అందించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ప్రతి చెరువును గోదావరి నీటితో నింపాలన్న లక్ష్యంతో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు నియోజకవర్గంలోని 699 చెరువులకు జియోట్యాగింగ్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బస్వాపూర్‌ జలా శయం  సామర్థ్యం 0.8 టీఎంసీలు కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాన్ని 11.39 టీఎంసీలకు పెంచారు.  

యాదగిరిగుట్ట : 40 ఏండ్లుగా కరువుతో కొట్టుమిట్టాడుతున్న ఆలేరు నియోజకవర్గం.. ఇక గోదావరి జలాలతో పచ్చని మాగాణిగా మారనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-16 కింద నిర్మిస్తున్న బస్వాపూర్‌ జలాశయానికి నీరు అందించే ప్రధాన కాల్వ ద్వారా నియోజకవర్గంలోని 6 మండలాల్లో 323 చెరువులకు జలకళ రానున్నది. ఇందుకోసం ప్రధాన కాల్వ కింద బ్రాంచ్‌ కెనాళ్లు-1, 2లను నిర్మించనుండగా.. భూసేకరణ, డిజైనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పనులు ప్రారంభమై వచ్చే యాసంగిలో 44,279 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ సూచన ప్రకారం నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్‌ చేశారు. బస్వాపూర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ ప్రాంతానికి మళ్లించేందుకు ప్రధాన కాల్వతోపాటు ఆయా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, బ్రాంచ్‌ కెనాళ్లు, మైనర్‌, సబ్‌ మైనర్‌ కాల్వల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మొత్తం 14 బ్రాంచ్‌ కెనాళ్లను ఏర్పాటు చేసి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. ప్రధానంగా బ్రాంచ్‌ కెనాళ్లు-1, 2 ద్వారా ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని అందించనున్నారు. మిగతా బ్రాంచ్‌ కెనాళ్ల(3 నుంచి 14) ద్వారా భువనగిరి, మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లోని 1,05,831 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

14 బ్రాంచ్‌ కెనాళ్లకు తూముల నిర్మాణం..

ప్రతి డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ నుంచి ఆయా ప్రాంతాలకు సాగునీరు అందేలా మైనర్లు, సబ్‌ మైనర్లు, క్రాస్‌ రెగ్యులేటర్లు నిర్మిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బస్వాపూర్‌ జలాశయానికి 0.8 టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటిని అందించాలంటే బ్రాంచ్‌ కెనాళ్లు తప్పనిసరిగా ఉండేది. తాజాగా సీఎం కేసీఆర్‌ బస్వాపూర్‌ జలాశయం సామర్థ్యాన్ని ఏకంగా 11.39 టీఎంసీలకు పెంచారు. దీంతో జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ జలాశయం నుంచి జిల్లాలోని చెరువులను నింపాలని ఇరిగేషన్‌ అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ క్రమంలో గతంలో నిర్మించాలని ప్రతిపాదించిన 14 బ్రాంచ్‌ కెనాళ్లకు తూములు ఏర్పాటు చేసి అనుసంధానంగా చిన్నకాల్వలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

బ్రాంచ్‌ కెనాళ్ల నుంచి ఆలేరుకు జలాలు..

కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భాగంగా నిర్మించనున్న కాల్వ తుర్కపల్లి మండల కేంద్రంలోని ముల్కలపల్లిలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 4 కిలో మీటర్ల దూరంలో ప్రధాన కాల్వ నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించేందుకు బ్రాంచ్‌ కెనాల్‌-2ను నిర్మించనున్నారు. ప్రధానకాల్వకు క్రాస్‌ రెగ్యులెటర్‌ను ఏర్పాటు చేసి కాల్వ ఎడమవైపు మరో బ్రాంచ్‌ కెనాలును నిర్మించి నీటిని మళ్లిస్తారు. ప్రధానంగా ఆలేరు నియోజకవర్గంలోని మండలాలకు నీరు అందించే లక్ష్యంగా వీటిని నిర్మిస్తున్నారు. బస్వాపూర్‌ జలాశయానికి ముందే బ్రాంచ్‌ కెనాల్‌-2ను నిర్మించనుండగా.. 42 కిలోమీటర్లు ప్రవహించనుంది. తుర్కపల్లి మండలం సంగ్యాతండా, యాదగిరిగుట్ట మండలం లప్పనాయక్‌తండా మధ్యలో ప్రారంభమై తుర్కపల్లిలోని పలు గ్రామాల నుంచి ప్రవహిస్తూ యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి, దాతారుపల్లి, మల్లాపురం గ్రామాన్ని తాకుతూ సైదాపురం గ్రామ పంచాయతీ భవనం వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రామాజీపేట వరంగల్‌ జాతీయ రహదారిని తాకుతూ చొల్లేరు, చిన్నకందుకూరు, మోటకొండూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌, మాటూరు వర్టూరు, చందేపల్లి మీదుగా, ఆత్మకూరు(ఎం) మండలం సింగారం, మొరిపిరాళ్ల, కొరటికల్‌, పల్లెపహాడ్‌, రహింఖాన్‌పేట గ్రామం వరకు ప్రవహిస్తుంది. ఈ కాల్వకు అక్కడక్కడ తూములు నిర్మించి చెరువుల్లోకి నీటిని మళ్లించనున్నారు. దీంతో పాటు బ్రాంచ్‌ కెనాల్‌-1ను సైతం నిర్మించి ప్రధానంగా ఆలేరు నియోజకవర్గానికి నీటిని అందించే విధంగా అధికారులు సర్వేలు నిర్వహించారు. త్వరలో పనులు చేపట్టనున్నారు.  

జియోట్యాగింగ్‌...

జలాశయాల నుంచి నేరుగా చెరువులను నింపాలన్న ఉద్దేశంతో ఇరిగేషన్‌ అధికారులు చెరువులకు జియోట్యాగింగ్‌ చేశారు. గతంలో ఏ చెరువు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉండేది. చెరువులను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

పలు గ్రామాల్లో చెరువులు సైతం కబ్జాకు గురయ్యాయి. వీటిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్‌ చేశారు. మిషన్‌ కాకతీయ మొబైల్‌ యాప్‌లో చెరువుల ఫొటోలు, తూములు, ఫీడర్‌ చానళ్లను పొందుపర్చడంతో ప్రతి చెరువుకు ఒక కోడ్‌ నమోదు అవుతుంది. ఈ పద్ధతి ద్వారా చెరువులను కబ్జాల నుంచి కూడా రక్షించవచ్చునని ఇరిగేషన్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గంలోని మొత్తం 699 చెరువులకు జియోట్యాగింగ్‌ చేశామన్నారు. 

323 చెరువులకు జలకళ..

కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలోని బ్రాంచ్‌ కెనాళ్ల్లు-1, 2 ద్వారా ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో 90 చెరువులు, మోటకొండూర్‌లో 70 చెరువులు, ఆలేరు మండలంలో 83 చెరువులు, ఆత్మకూరు(ఎం)లో 80 చెరువులకు జలకళ సంతరించుకోనున్నది. దీంతో యాదగిరిగుట్ట మండలంలో 17,767 ఎకరాలు, మోటకొండూర్‌ మండలంలో 13,320 ఎకరాలు, ఆత్మకూరు(ఎం) మండలంలో 10,630 ఎకరాలు, ఆలేరు మండలంలో 2,562 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా 332 చెరువులోకి జలకళ రావడంతోపాటు 44,279 ఆయకట్టు సాగులోకి వస్తుంది.

VIDEOS

logo