శనివారం 06 మార్చి 2021
Yadadri - Apr 07, 2020 , 00:22:49

నల్లగొండ జిల్లాలో 16కి చేరిన కరోనా కేసులు

నల్లగొండ జిల్లాలో 16కి చేరిన కరోనా కేసులు

  • మతప్రచారం కోసం జిల్లాకేంద్రంలో పర్యటించిన 15మంది బర్మాదేశస్తులు
  • బృందంలో నలుగురికి కరోనా పాజిటివ్‌
  • 32బృందాలతో ‘పాజిటివ్‌ ఏరియా’ల్లో సర్వే 
  • మరో 25మంది శాంపిల్స్‌ సేకరణ

నీలగిరి : నల్లగొండ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు సోమవారం నమోదయ్యాయి. గత బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ మసీదులో ఆశ్రయం పొందిన 15మంది బర్మా దేశస్తులు, మరో ఇద్దరు జమ్ముకశ్మీర్‌ యువకులను హైదరాబాద్‌ తరలించి పరీక్షలు చేయగా అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే మరోమారు పరీక్షల్లో మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 16కి చేరింది. ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులైన 162మందిలో 84మంది మెడికల్‌ రిపోర్టులు రాగా 63పెండింగ్‌లో ఉన్నాయి. సోమవారం మరో 25మంది శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం పంపించారు. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో నాలుగేళ్లుగా స్థిరపడి ఉన్న బర్మా దేశస్తులు ఈనెల15న నల్లగొండకు వచ్చినట్లు గుర్తించిన అధికారులు.. వారు సంచరించిన ప్రాంతాల్లో ఇప్పటికే శానిటైజేషన్‌ చేపట్టారు. 

32ర్యాపిడ్‌ హెల్త్‌ బృందాలతో  ఇంటింటి సర్వే... 

జిల్లాకేంద్రంలోని మీర్‌బాగ్‌కాలనీ, లైన్‌వాడ, గడీమసీదు, మాన్యంచెల్క, బర్కత్‌పుర మిర్యాలగూడలో సీతారాంపురం కాలనీ, దామరచర్ల గ్రామాలు రెడ్‌జోన్‌గా ప్రకటించిన జిల్లా యంత్రాంగం ఆయాప్రాంతాల్లో ర్యాపిడ్‌ హెల్త్‌ బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ మేరకు నల్లగొండలో 23, మిర్యాలగూడలో 7, దామరచర్లలో 4 బృందాలు పనిచేస్తున్నాయి. కరోనా లక్షణాలు కన్పిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతోపాటు వైద్య పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరించి హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందగా సూచిస్తున్నారు.

VIDEOS

logo