హనుమకొండ చౌరస్తా, మార్చి 16 : ఒకే వేదికపై ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహిస్తున్న ‘ఆటో షో’ తొలిరోజు శనివారం ‘అదరహో’ అనేలా సాగింది. లేటెస్ట్ కార్లు, బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఔత్సాహికులు స్టాళ్లను సందర్శించి తమకు నచ్చిన కారు, బైక్ మోడళ్ల వివరాలను కంపెనీల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కొందరు అక్కడికక్కడే బుక్ చేసుకున్నారు.
కార్యక్రమాన్ని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, హనుమకొండ జడ్పీ అధ్యక్షుడు మారపల్లి సుధీర్‌కుమార్ ప్రారంభించారు. ‘నమస్తే తెలంగాణ’ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ ఎన్.సురేందర్‌రావు, వరంగల్ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, వీ శ్రీచరణ్, ఏజీఎం ఎం.రాజిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి కనపర్తి రమేశ్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, మార్కెటింగ్ మేనేజర్ అప్పని సూరయ్య, సర్క్యులేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్‌రెడ్డి, టీజీవో కో ఆర్డినేటర్ జగన్మోహన్రావు, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్, బీఆర్ఎస్ నాయకుడు పులి రజినీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. నేడు కూడా ఆటో షో కొనసాగనుండగా కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
మధ్యతరగతి ప్రజలతో పాటు ఉన్నతవర్గాలకు చెందిన వాహన ప్రియులకు అన్నిరకాల వాహనాలను ఒకేవేదికపైకి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రజల సౌకర్యం కోసమే ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఆటోషోలు నిర్వహిస్తున్నాం. గతంలో ఇలాంటి షోలు ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహా నగరాలకే పరిమితం. ఇప్పుడు మన నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఆటోషో నిర్వహించి వాహన ప్రియుల కలను సాకారం చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇకముందు కూడా మరిన్నిషోలు నిర్వహిస్తాం.
– ఎన్.సురేందర్‌రావు, ‘నమస్తే తెలంగాణ’ మార్కెటింగ్ జనరల్ మేనేజర్
స్టాళ్ల సందర్శనకు వచ్చిన వారిని ప్రోత్సహించేందుకు ‘నమస్తే తెలంగాణ’ బంపర్ డ్రా ఏర్పాటు చేసింది. డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి తొలిరోజు బహుమతులు అందించింది.
బెంజ్, ఎంజీ వంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడికి రావడం శుభపరిణామం. వాహన ప్రేమికుల కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండలో ఆటో షో నిర్వహించడం అభినందనీయం. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ వాహనం అవసరం. షోరూంలు తిరగాల్సిన అవసరం లేకుండా ఇక్కడికే వచ్చి కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. షోరూంలు ఏర్పాటు చేయని కంపెనీలు ప్రజలకు తమ ఉత్పత్తుల వివరాలను తెలిపేందుకు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది.
– బండా ప్రకాశ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్