బయ్యారం మార్చి 10: ‘నేను ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నాకు లక్ష రూపాయల జీతం. మీకు ఉద్యోగం ఇప్పిస్తా.. అంటూ కొందరిని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్త్తా’ అంటూ మరికొందరిని నమ్మించిన యువకుడు అందిన కాడికి దండుకొని ఉడాయించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. బయ్యారం మండలంలోని చోక్లాతండాకు చెందిన యువకుడు భూక్యా వెంకటసాయికృష్ణ కొన్నేళ్లపాటు హైదరాబాద్‌లో నివాసమున్నాడు. ఏడాది క్రితమే గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే స్థ్ధానికులకు ‘తాను ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నా.. లక్ష రూపాయల జీతం వస్తుందని… డబ్బులు ఇస్తే అలాంటి ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ. 2లక్షల నుంచి రూ.7 లక్షల వరకు నగదు, బంగారం తీసుకున్నాడు.
మరికొందరి వద్ద తనకు ముత్తూట్ ఫైనాన్స్‌లో తెలిసిన వారు ఉన్నారని, కుదువ పెట్టిన బంగారం తక్కువ ధరకు వస్తుందని మాయమాటలు చెప్పి నమ్మించాడు. దీంతో మండలంలోని చోక్లాతండా, జగ్నితండా, పాప్లితండాతోపాటు జిల్లాలోని సాలర్తండా, ముడుపుగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి గ్రామాలకు చెందిన 14 మంది సుమారు రూ.53 లక్షల నగదు, 61 తులాల బంగారం ఇచ్చారు. అయితే, రెండు నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడం, తీసుకున్న బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు ఒత్తిడి తేగా, రేపు మాపు అంటూ తిప్పేవాడు. నకిలీ బ్యాంకు వోచర్లు, చెక్కులు, వాట్సాప్ మెస్సేజ్‌లతో కొన్ని రోజులు మభ్య పెట్టాడు. ఒత్తిడి ఎక్కువ కావడంతో నాలుగు రోజుల నుంచి పత్తా లేకుండా పోయాడు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల వద్ద పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, ఆధారాలు పరిశీలించి కేసు నమోదు చేస్తామని గార్ల, బయ్యారం సీఐ రవికుమార్ తెలిపారు.