వెంకటాపూర్, నవంబర్ 9 : రామప్ప చరిత్ర విశిష్టత, కట్టడం ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెం పొందించుకోవాలని కలెక్టర్ కృష్ణ అదిత్య అన్నారు. మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రైతువేదికలో బుధవారం 2డే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం కార్యక్రమాని కి కలెక్టర్‌తో పాటు కేయూ వీసీ రమేశ్, ప్రొఫెసర్ పాండు రంగారావు, డీటీవో శివాజీ, భారత పురావస్తు శాఖ సీఏ మల్లేశ్, రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీ మల్లునాయక్, సర్పంచ్ డోలి రజితాశ్రీనివాస్, కాకతీయ హెరిటేజ్ సభ్యులు శ్రీధర్‌రావు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ప్రొఫెసర్ పాండురంగారావు శాలువాతో సన్మానించారు.
2047 వరకు అభివృద్ధి ప్రణాళిక : కాకతీయ హెరిటేజ్ సభ్యుడు శ్రీధర్‌రావు
రామప్ప అభివృద్ధి వెంటవెంటనే జరగదని, ఇందుకోసం 2047 వరకు ప్రణాళికలు రూపొందించామని శ్రీధర్‌రావు అన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రాకముందు తక్కువ మంది పర్యాటకులు వచ్చే వారని, ప్రస్తుతం వేల సంఖ్యలో వస్తున్నారని అన్నారు. పర్యాటకులకు స్థానికులే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే సంఖ్య పెరుగుతుందన్నారు. అనంతరం పాలంపేట బస్టాండ్ నుంచి రామప్ప ఆలయం వరకు అధికారులు, స్థానికులతో కలిసి హెరిటేజ్ వాక్ నిర్వహించారు. స్థానికులకు సౌత్ జోన్ ఇంటాక్ ప్రతినిధి, ప్రొఫెసర్ సూర్యనారాయణ పర్యాటక రంగాలపై వివరించారు. ఐకోమస్ మధు టూరిజం అండ్ కల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్పై వివరించారు.
యునెస్కో గుర్తింపునకు పదేళ్ల కృషి :పాండు రంగారావు
రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, శ్రీధర్‌రావుతో కలిసి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ స్థాపించి పదేళ్ల పాటు కృషి చేస్తే గుర్తింపు లభించిందని పాండు రంగారావు అన్నారు. ఆలయం గురించి ఫ్రాన్స్‌లో యునెస్కో ప్రతినిధులకు వివరించామన్నారు. భవిష్యత్‌లో రామప్ప దాని పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు. ఇందుకోసం పరిసర ప్రాంతాల ప్రజలు పర్యాటకులకు సరైన సేవలు అందించాలన్నారు.