జనగామ చౌరస్తా, అక్టోబర్ 24: చాకలి ఐలమ్మ జిల్లా మహిళా సమాఖ్యలో భారీగా నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో సర్వే నంబర్ 233/సీ1/1/1/2/2లో 2.20 ఎకరాలు, సర్వే నంబ ర్ 233/సీ1/1/2/2లో 1.20 ఎకరాల చొప్పున మొత్తం 4 ఎకరాల స్థలాన్ని పట్టాదారుడు కందగట్ల అశోక్ నుంచి 2024 ఆగస్టు 24వ తేదీన సమాఖ్య పేరిట కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తికాగా పట్టాదారు పాసు పుస్తకం(ఖాతా నంబర్ 60650) కూడా జారీ అయింది. 2.20 ఎకరాల భూమికి మార్కెట్ వ్యాల్యు ధర రూ.56227500 ఉండగా, 1.20 ఎకరాలకు రూ.33736500 చొప్పున ఉంది.
ప్రస్తుతం వెంకిర్యాల గ్రామంలో సుమారు రూ. 30 నుంచి 35 లక్షలు మాత్రమే ధర పలుకుతుందని రైతులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా సమాఖ్య ప్రతినిధులు మాత్రం ఎకరానికి రూ. 58.75 లక్షల చొప్పున 4 ఎకరాలకు కలిపి రూ.2.35 కోట్లు చెల్లించి భూమి కొనుగోలు చేశారు. తక్కువ ధర కలిగిన భూమిని ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంతో సుమారు రూ. కోటి వరకు అవినీతి జరిగిందనే అనుమానాలు మహిళా సంఘాల సభ్యుల్లో నెలకొన్నాయి. దీంతో గురువారం నర్మెట మండల సమాఖ్య సమావేశాన్ని సభ్యులు బహిష్కరించారు. అవినీతిపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు పలువురు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
జిల్లా సమాఖ్యకు అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారిగా పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, బచ్చన్నపేట మండలాల నుంచి సుధ, స్రవంతి, చైతన్య ముగ్గురు ఉన్నారు. చెక్ పవర్స్ వీరికి ఉన్నాయి. జిల్లా సమాఖ్య కింద 12 మండల, 466 గ్రామైక్య, 11217 స్వయం సహాయాక సంఘాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్షా 26 వేల 922 మంది సభ్యులు ఇందులో వాటాదారులుగా ఉన్నారు. 12 మండలాలకు సంబంధించిన సమాఖ్య బాధ్యులు ఈసీ మెంబర్లు, ఆఫీసు బేరర్లుగా ఉన్నారు. వీరందరి తీర్మానం మేరకే భూమి కొనుగోలు చేసినట్లు జిల్లా సమాఖ్య ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని, కొందరు కావాలనే సమాఖ్య పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని తెలిపారు.